కేన్సర్‌కు ఆహారం ఆన్సర్‌..! | Health Tips: Cancer Fighting Foods: Improve Outcomes with Diet | Sakshi
Sakshi News home page

Cancer Fighting Foods: ఏయే కూరగాయలు, పండ్లు కేన్సర్‌కి చెక్‌పెడతాయంటే..!

Nov 18 2025 11:09 AM | Updated on Nov 18 2025 11:42 AM

Health Tips: Cancer Fighting Foods: Improve Outcomes with Diet

ఇంగ్లిష్‌లోనూ తెలుగులోనూ కామన్‌గా ఓ సామెత ఉంది. అదే... ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ ద్యాన్‌ క్యూర్‌. అంటే చికిత్స కంటే నివారణ మేలు అని అర్థం. నిజమే... రోజూ ఆహారం తీసుకోక తప్పదు. అదే గనక ఆరోగ్యకరమైనది కావడంతోపాటు కేన్సర్‌ను నివారించేదైతే... అది కేవలం కేన్సర్‌నే కాదు... ఎంతో ఆత్మక్షోభనూ, మరెంతో వేదననూ నివారిస్తుంది. అంతేకాదు... భవిష్యత్తులో మందులకు పెట్టే బోలెడంత  డబ్బునూ ఆదా చేస్తుంది. అన్నిటికంటే ముందుగా శారీరక బాధల నివారణతోపాటు మానసికమైన శాంతినీకాపాడుతుంది. అందుకే రోజూ ఎలాగూ తినే అవే ఆకుకూరలనూ, కాయగూరలనూ, పండ్లనూ మార్చి మార్చి తింటూ ఉంటే పై ప్రయోజనాలన్నీ కలుగుతాయి. ఏయే ఆహారపదార్థాలు ఏయే కేన్సర్లను నివారిస్తాయో, అలా నివారించడానికి వాటిల్లోని ఏ పోషకాలు తోడ్పడతాయో తెలుసుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. తద్వారా కేన్సర్‌ను నివారించుకుందాం...

పండ్లు... ఆకుకూరలు... ఆహారపదార్థాలు... ఇలా మనం రోజూ తినే పదార్థాలతోనే కేన్సర్లను నివారించుకోవడం సాధ్యమనే అనడం కాకుండా వాటిల్లోని ఏయే పోషక విలువలు అలా జరిగిందేందుకు దోహదపడతాయో తెలుపుతున్నారు కేన్సర్‌పై పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలూ, ఆహారనిపుణులు. పైగా ఏయే ఆహారపదార్థాల్లోని ఏ నిర్దిష్టమైన పోషకం కేన్సర్‌ను ఎలా నివారిస్తుందో తెలుసుకునేందుకు యూకేకు చెందిన ‘వరల్డ్‌ క్యాన్సర్‌ రీసెర్చ్‌ ఫండ్‌’  ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఆ అధ్యయనాల ద్వారా కేవలం ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తినడం ద్వారానే చాలా సులువుగా కేన్సర్‌ను ఎలా నివారించగలమో తెలుసుకుందాం.

పెదవులు, నోరు, ఫ్యారింగ్స్‌ కేన్సర్‌ నివారణకు... 
బాగా ముదురురంగులో ఉండే అన్ని రకాల పండ్లతోపాటు బాగా ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు పెదవులు, నోరు, ఫ్యారింగ్‌ కేన్సర్లను నివారిస్తాయి. అంతేకాదు... విటమిన్‌ ఏ ఎక్కువగా ఉండే పండ్లు కూడా నోరు, ఫ్యారింగ్స్‌ కేన్సర్లను నివారిస్తాయి. ఉదాహరణకు విటమిన్‌–ఏ ఎక్కువగా ఉండే బొప్పాయి, క్యారట్, మామిడి వంటి తాజా పండ్లు నోరు, ఫ్యారింగ్స్, క్యాన్సర్లను నివారణకు తోడ్పడతాయి. టొమాటోలోని లైకోపిన్‌ కూడా ఈ తరహా క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడుతుంది. అంతేకాదు... ఈ లైకోపిన్‌తో మరో ఉపయోగం కూడా ఉంది. ఇందులో యాంటీ క్యాన్సర్‌ గుణాలతోపాటు గుండెజబ్బులను నివారించే గుణం కూడా ఉంది.

కంటి కేన్సర్‌ నివారణకు... 
ఒమెగా 3–ఫ్యాటీ ఆసిడ్స్‌ ఎక్కువగా ఉండే సాల్మన్‌ చేపలు, వాల్‌నట్‌లతోపాటు గ్రీన్‌–టీ, బెర్రీ పండ్లు, పసుపు, విటమిన్‌–ఇ, విటమిన్‌–సి, విటమిన్‌–ఏ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో కంటి కేన్సర్లను సమర్థంగా నివారించవచ్చు. సెలీనియమ్, పీచుపదార్థాలు ఫైటోకెమికల్స్‌ ఎక్కువగా ఉండే బ్రెజిల్‌–నట్స్‌ కూడా కంటి క్యాన్సర్‌ నివారణకు తోడ్పతాయి.

రొమ్ము కేన్సర్‌ నివారణకు... 
దానిమ్మ పండులోని ఎలాజిక్‌ యాసిడ్‌ అనే పోషకంలోని పాలీఫినాల్స్‌ రొమ్ముక్యాన్సర్‌ను సమర్థంగా నివారిస్తాయి. అలాగే కెరొటినాయిడ్‌ అనే పోషకం ఎక్కువగా ఉండే పాలకూర, క్యారట్, బ్రాకలీలు కూడా రొమ్ముక్యాన్సర్‌ నివారణకు గణనీయంగా తోడ్పడతాయి. ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్‌ ఎక్కువగా ఉండే గ్రీన్‌–టీ కూడా రొమ్ము క్యాన్సర్‌ నివారణకు చాలావరకు తోడ్పడుతుంది.

గాల్‌బ్లాడర్‌ కేన్సర్‌ నివారణకు... 
ఊబకాయం / స్థూలకాయం రాకుండా ఆరోగ్యకరమైన పరిమితిలో బరువును నియంత్రించుకోవడమన్నది గాల్‌బ్లాడర్‌ క్యాన్సర్‌ నివారణకు బాగా తోడ్పడే అంశం. ఇలా బరువును నియంత్రించుకోవడం అన్నది కేవలం ఒక్క గాల్‌బ్లాడర్‌ కేన్సర్‌ నివారణకు మాత్రమే కాకుండా పెద్దపేగు, ప్రోస్టేట్, ఎండోమెట్రియమ్, మూత్రపిండాలు, రొమ్ము కేన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది. ఇందుకోసం ఆరోగ్యకరంగా ఉండే కొవ్వులు తక్కువగా తీసుకుంటూ ఆకుకూరలు మాత్రం ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండాలి.

మూత్రాశయ (బ్లాడర్‌) కేన్సర్ల నివారణకు... 
క్రూసిఫెరస్‌ వెజిటబుల్స్‌ జాతిగా పేరుపడ్డ క్యాబేజీ, బ్రాకలీ వంటి ఆహారాలతో మూత్రాశయ (బ్లాడర్‌) క్యాన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చు. యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సస్‌లోని యాండర్సన్‌ ​కేన్సర్‌ సెంటర్‌లో తేలిన అంశాలను బట్టి విటమిన్‌–ఇ లోని ఆల్ఫా టోకోఫెరాల్‌ అనే జీవరసాయనం  బ్లాడర్‌ కేన్సర్‌ నివారణకు బాగా ఉపయోగపడుతుంది. పాలకూర, బాదాంలతోపాటు పొద్దుతిరుగుడునూనె, కుసుమ నూనెలోనూ విటమిన్‌–ఇ మోతాదులు ఎక్కువ. ఇక మిరియాలలో ఉండే పోషకాలు కూడా బ్లాడర్‌ క్యాన్సర్‌ నివారణకు ఉపయోగపడతాయి.  

మూత్రపిండాల (కిడ్నీ) కేన్సర్‌ నివారణకు... 
నారింజ రంగులో ఉండే కూరగాయలు (ఉదాహరణ క్యారట్‌)తో పాటు టొమాటో, అల్లం, ఆప్రికాట్‌ వంటివి... మూత్రపిండాల (కిడ్నీ) క్యాన్సర్‌ నివారణకు బాగా తోడ్పడతాయి.  కిడ్నీల ఇన్‌ఫ్లమేషన్‌ను బెర్రీ పండ్లు గణనీయంగా తగ్గిస్తాయి. ఫలితంగా కిడ్నీ జబ్బుల ముప్పు కూడా బాగా తగ్గిపోతుంది. ఇక పొట్టు తీయని ధాన్యాలు, నట్స్, బఠాణీ, చిక్కుళ్ల వంటి ఫైటేట్‌ అనే పోషకం ఉన్న ఆహారాలు మూత్రపిండాల క్యాన్సర్‌ నివారణకు సమర్థంగా తోడ్పడతాయి.

గర్భాశయ ముఖద్వార (సర్విక్స్‌) కేన్సర్‌ నివారణకు... 
ఆహారంలో విటమిన్‌–ఇ, విటమిన్‌–సి ఎక్కువగా ఉండేలా చూసుకోవడం అని చర్య సర్విక్స్‌ క్యాన్సర్‌ నివారణకు బాగా ఉపకరిస్తుంది. ఉదాహరణకు క్యారట్, చిలగడదుంప, గుమ్మడి వంటి ఆహారాలతో దీన్ని చాలాబాగా  నివారించవచ్చు. ఎలాజిక్‌ ఆసిడ్స్‌ అనేవి క్యాన్సర్‌ పెరుగుదలను అరికడతాయి. ఈ పోషకం స్ట్రాబెర్రీ, రాస్ప్‌బెర్రీ, వాల్‌నట్, దానిమ్మ, ద్రాక్ష, ఆపిల్, కివీ పండ్లలో పుష్కలంగా ఉంటుంది 

కాబట్టి వాటిని తీసుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వారా (సర్విక్స్‌) కేన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చు. అయితే ఇక్కడ ఓ చిన్న జాగ్రత్త పాటించడం మేలు చేస్తుంది. అదేమిటంటే... చక్కెర మోతాదులు తక్కువగా ఉండే (లో–గ్లైసీమిక్‌) పండ్లైన దానిమ్మ, ఆపిల్‌ వంటి పండ్లతో ఈ క్యాన్సర్‌ నివారణ మరింత తేలిక.

తల, మెడ (హెడ్‌ అండ్‌ నెక్‌) క్యాన్సర్‌ల నివారణకు... 
పసుపు, నారింజ, ఎరుపు, ఆకుపచ్చ, తెల్లటి తొక్క కలిగి ఉండే పండ్లు తల, మెడ క్యాన్సర్లను నివారిస్తాయి. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్‌ హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్ల నివారణకు తోడ్పడతాయి. అలాగే ఈ పండ్లలోనే మెరుపు కలిగి ఉండే (కొద్దిపాటి మెరుపుతో బ్రైట్‌గా ఉండే) తొక్కతో ఉండే పండ్లు ఈ హెడ్‌ అండ్‌ నెక్‌ కేన్సర్లను మరింత సమర్థంగా నివారిస్తాయి. ఉదాహరణకు...  నారింజ, కివీ, జామ, పైనాపిల్‌ పండ్లు తల, మెడ క్యాన్సర్లను నివారణకు సమర్థంగా తోడ్పడతాయి.

బ్రెయిన్‌ కేన్సర్‌ కణుతుల నివారణకు... 
ఉల్లి, వెల్లుల్లి జాతికి చెందిన రెబ్బలలో మెదడు (బ్రెయిన్‌) కేన్సర్‌ను నివారించే గుణం ఎక్కువ. (అన్నట్టు వీటిలోని యాంటీ క్యాన్సర్‌ ΄ోషకాలు కేవలం బ్రెయిన్‌ కేన్సర్‌నే కాదు... ఇతరత్రా చాలా రకాల క్యాన్సర్‌ల నివారణకూ ఉపయోగపడతాయి). ఇక ఒమెగా 3–ఫ్యాటీ ఆసిడ్స్‌ ఎక్కువగా ఉండే వాల్‌నట్, లిన్‌సీడ్‌ ఆయిల్‌తో మెదడు కేన్సర్‌లు తేలిగ్గా, సమర్థంగా నివారితమవుతాయి. ఇవి కేన్సర్‌ నివారణతోపాటు వ్యక్తుల్లో వ్యాధి నివారణ వ్యవస్థను (ఇమ్యూనిటీని) పటిష్టం చేసేందుకూ ఉపయోడపడతాయి.

ఒవేరియన్‌ కేన్సర్‌ నివారణకు... 
క్యారట్‌ల వంటి వాటితో పాటు పసుపురంగూ, నారింజరంగుల్లో ఉండే వెజిటబుల్స్‌తో (ఉదాహరణకు బెల్‌పెప్పర్‌ వంటివాటితో) ఒవేరియన్‌ క్యాన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చు. కెరటినాయిడ్స్‌ ఎక్కువగా ఉండే క్యారట్‌ వంటివి రోజూ అరకప్పు మోతాదులో రెండు సార్లు  తీసుకోవడం వల్ల ఒవేరియన్‌ క్యాన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చని అమెరికన్‌ కేన్సర్‌ సొసైటీ వంటి ప్రజోపయోగ, పరిశోధనల సంస్థల అధ్యయానాల్లో తేలింది.

జీర్ణాశయ (స్టమక్‌) క్యాన్సర్‌ నివారణకు... 
జీర్ణాశయ (స్టమక్‌) కేన్సర్‌ నివారణకు కాప్సికమ్‌ (కూరగా వండటానికి ఉపయోగించే బెంగళూరు మిరప లేదా బెల్‌పెప్పర్‌)లో ఉండే ఫైటోకెమికల్స్‌ బాగా ఉపయోగపడతాయి. పరిమితంగా తీసుకునే  మిరపకాయలు ’ మిర్చీ వంటి వాటితోపాటు మిరియాల పరిమిత వాడకం కూడా స్టమక్‌ క్యాన్సర్‌ను నివారిస్తాయి. ఆకుకూరలు, పొట్టుతో ఉండే ధాన్యాలు, తాజా పండ్లు అనేక కేన్సర్ల నివారణతో పాటు జీర్ణాశయ కేన్సర్‌ రిస్క్‌ను తగ్గిస్తాయి. జీర్ణాశయ క్యాన్సర్‌ నివారణకు ఉప్పు వాడకాన్ని గణనీయంగా తగ్గించడమూ అవసరమే.

కాలేయ కేన్సర్‌ నివారణకు... 
పాలీఫీనాల్, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండే బ్లూబెర్రీ పండ్లు, విటమిన్‌–ఇ పుష్కలంగా ఉండే బెల్‌పెప్పర్, పాలకూర, బాదం వంటి ఆహార పదార్థాలు కాలేయ క్యాన్సర్‌ నివారణకు తోడ్పడతాయి. ఇక నూనెల్లో పొద్దుతిరుగుడు నూనె, కుసుమ నూనెలు కూడా కాలేయ కేన్సర్‌ నివారణకు దోహదపడతాయి. అయితే ఈ నూనెలను పరిమితంగా మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.

ఎముక కేన్సర్‌ నివారణకు... 
యాంటీ ఆక్సిడెంట్స్‌ అనే పోషకాలు ఆక్సిడేషన్‌ ప్రక్రియతో వెలువడే విషయాలను (టాక్సిక్‌ మెటీరియల్స్‌ను) విరిచేస్తాయి. ఇలాంటి  యాంటీఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు... ఉదాహరణకు బెర్రీలు, చెర్రీలు, టొమాటో, బ్రాకలీ వంటివి ఎముక కేన్సర్‌ను సమర్థంగా నివారిస్తాయి. అలాగే ఒమెగా 3–ఫ్యాటీ ఆసిడ్స్‌ అనేక పోషకాలు పుష్కలంగా ఉండే సాల్మన్‌ చేపలు, వాల్‌నట్‌లతోనూ ఎముక క్యాన్సర్లు బాగానే నివారితమవుతాయి. ఇక ప్రోటీన్లు ఎక్కువగా ఉండే మాంసాహారం, చేపలు, గుడ్లతోనూ ఎముక క్యాన్సర్‌ త్వరితంగా నివారితమవుతుంది.

చివరగా... 
ఆహారం తీసుకోవడం అన్నది మన జీవక్రియల కోసం మనం రోజూ తప్పక చేసే పని అయినందున... ఆ ఆహారాన్నే తాజా ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్ల రూపంలో మరింత ఆరోగ్యకరంగా తీసుకోవడం వల్ల ఒకే సమయంలో రెండు సౌకర్యాలు సమకూరతాయి. 

అవి ఆరోగ్యంగా ఉండటం, అలా ఆరోగ్యంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధకత మన సొంతం కావడంతో ఈ ఇమ్యూనిటీ కూడా క్యాన్సర్‌ల నివారణకు తోడ్పడుతుందని గుర్తుంచుకోవాలి. ఇలా తీసుకున్న ఆహారం వల్ల ఒళ్లు పెరగకుండా తగినంత వ్యాయామమూ చేయడం వల్ల ఈ మార్గంలో క్యాన్సర్‌ నివారణ మరింత సమర్థంగా చేయడం సాధ్యమవుతుంది. 
డాక్టర్‌ రాజేష్‌ బొల్లం, సీనియర్‌ కన్సల్టెంట్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌

నిర్వహణ యాసీన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement