
వాషింగ్టన్: గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు హమాస్ (Hamas) ప్రణాళికలు రచిస్తోందని కలకలం రేపింది. హమాస్ దాడుల ప్రణాళిక గురించి తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని అమెరికా (USA) విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో, రంగంలోకి దిగిన అమెరికా.. హమాస్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య సుదీర్ఘ యద్ధం జరిగిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో ఇజ్రాయెల్- హమాస్ (Israel- Hamas)ల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ బందీలను సైతం హమాస్ విడుదల చేసింది. అయితే, గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు హమాస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ సందర్బంగా అమెరికా (USA) విదేశాంగ శాఖ అలర్ట్ అయ్యింది. పాలస్తీనా పౌరులపై హమాస్ దాడి ప్రణాళిక.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని అమెరికా పేర్కొంది.
తమ మధ్యవర్తిత్వ ప్రయత్నాలతో సాధించిన గణనీయమైన పురోగతిని ఇది దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. హమాస్ ఈ దాడులకు పాల్పడితే.. గాజా ప్రజలను రక్షించడానికి, కాల్పుల విరమణ సమగ్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమకు అందిన ఈ సమాచారాన్ని ఈజిప్టు, ఖతార్, తుర్కియేతో సహా శాంతి ఒప్పందానికి హామీగా ఉన్న దేశాలకు తెలియజేసినట్లు యూఎస్ తెలిపింది. దీంతో, మరోసారి గాజాలో ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయా అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.