ఆయన గుండె గట్టిదే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేయడం సాధారణంగా మారిపోయింది. ఆయన మునుపటిలా లేరని.. ఎనర్జీ లెవల్ దారుణంగా పడిపోయిందని.. బహుశా వయోభారమే అందుకు కారణమై ఉండొచ్చని తాజాగా న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఇది సాధారణంగానే ఆయనకు కోపం తెప్పించింది.
ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న కథనాలను వైట్‌హౌజ్ కొట్టిపారేసింది. తాజాగా ఆయన తీయించుకున్న ఎమ్మారై స్కాన్‌తో ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ మీడియా ముందుకు వచ్చారు. సాధారణంగా ఆయన వయసు ఉన్నవాళ్లకు ఇమేజింగ్ పరీక్షలు చేయాలని వైద్యులు సూచిస్తుంటారు. అలా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి ఆందోళనకరమైన అంశాలు కనిపించలేవు.
ఆయన గుండె సాధారణంగానే ఉంది. రక్తనాళాల్లో ఎలాంటి బ్లాకులు లేవు. రక్తప్రవాహానికి ఆటంకం.. గుండె, ప్రధాన రక్తనాళాల్లో ఎలాంటి అసాధారణతలు కనిపించలేదు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు’’ అని మీడియా కథనాలను ఖండించారామె. మరోవైపు న్యూయార్క్ టైమ్స్ కథనం మీద ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.
‘‘ఇప్పటిదాకా నా జీవితంలో ఏనాడూ ఇంతలా కష్టపడలేదు. అంతగా పని చేస్తూ.. పర్‌ఫెక్ట్‌గా ఫలితాలు రాబట్టగలుగుతున్నా. శారీరకంగా, మానసికంగా నేను ఫిట్‌గా ఉన్నా. నా స్టామినా విషయంలో సందేహమే అక్కర్లేదు’’ అని మొన్నీమధ్యే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. న్యూయార్క్ టైమ్స్‌ను తిట్టిపోసిన ఆయన.. ఆ కథనం వెనుక రాజకీయాల ప్రభావం ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే.. ఎప్పటిలాగే దానిని అమెరికన్ల శత్రువుగా అభివర్ణించారు. అలాగే ఆ కథనం రాసిన కేటీ రోగర్స్‌కు నానాశాపనార్థాలు పెట్టారు.
28 ఏళ్ల కరోలైన్ లెవిట్ అమెరికా చరిత్రలో అత్యంత యువ ప్రెస్ సెక్రటరీ ఘనత దక్కించుకుంది. 2022లో న్యూ హాంప్‌షైర్ 1వ కాంగ్రెస్ జిల్లా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చాక ఆమెకు వైట్‌హౌజ్‌లో బాధ్యతలు అప్పగించారు. అందగత్తె మాత్రమే కాదు.. తెలివైంది కూడా అంటూ ఆయన తరచూ ఆమెపై ప్రశంసలు గుప్పిస్తుంటారు. ఈ ఏడాదిలోనే ఆమె వివాహం జరిగింది కూడా.


