హైడ్రోపోనిక్ ఆహారోత్పత్తి కేంద్రాల్లో మోనోసైటోజీన్స్ బ్యాక్టీరియా వల్ల లిస్టెరియోసిస్ అనే వ్యాధి సోకుతున్నట్లు అమెరికాలో గుర్తించారు. ఏటా 1,600 కేసులు నమోదవుతున్నాయి. 260 మంది చనిపోతున్నారు కూడా. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు అత్యధికంగా దీని బారినపడుతున్నారు. అందువల్ల ఎల్. మోనోసైటోజీన్స్ ఆహార భద్రతకు, ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది.
సాధారణ వ్యవసాయంలో మట్టి ద్వారా వ్యాపించే తెగుళ్లు హైడ్రోపోనిక్ పద్ధతిలో సాగయ్యే పంటలకు సోకవు. అయితే, మట్టికి బదులు వాడే సబ్‌స్ట్రేట్‌లు, విత్తనాలు, నీరు, పోషక ద్రావణాల్లో ఎల్. మోనోసైటోజీన్స్ వంటి క్రిములు పెరుగుతాయి. అమెరికాలోని లూసియానా స్టేట్ యూనివర్సిటీ(ఎస్‌ఎస్‌యూ) ఎస్‌ఎస్‌యూ స్కూల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్సెస్ ప్రొఫెసర్, ఫుడ్ ఇన్నోవేషన్ ఇన్‌స్టిట్యూట్ తాత్కాలిక సంచాలకులు డాక్టర్ అచ్యుత్ అధికారి నేతృత్వంలోని పరిశోధకుల బృందం పరిశోధనలు చేసింది.
టమాటా, లెట్యూస్, స్ట్రాబెర్రీ పంటలను పెంచే పోషక ద్రావణాలలో ఎల్. మోనోసైటోజీన్ క్రిములు పెరుగుదల తీరుపై డాక్టర్ అచ్యుత్ బృందం చేసిన తాజా అధ్యయనంలో తేలిందేమంటే.. పోషక ద్రావణం ఉదజని సూచిక (పీహెచ్)లో మార్పులు ఈ క్రిముల పెరుగుదలకు, తగ్గుదలకు దోహదం చేస్తున్నాయి.
పీహెచ్ 5 గల డిస్టిల్డ్ వాటర్‌లో ఎల్. మోనోసైటోజీన్ క్రిములు 72 గంటల్లో నశించాయి. లైట్యూస్, స్ట్రాబెర్రీ పంటకు వాడే ద్రావణాలలో పీహెచ్ 6 ఉన్న దశలో ఈ క్రిములు బాగా పెరిగాయి. అయితే, టమాటా పోషక ద్రావణం అన్ని పీహెచ్ స్థాయిల్లో ఎల్. మోనోసైటోజీన్ క్రిముల పెరుగుదల పరిమితంగా ఉంది. ఈ క్రిములను చంపటానికి రసాయనిక క్రిమిసంహారకాలను వాడితే, మేలు చేసే సూక్ష్మజీవులు కూడా చనిపోతాయి. కాబట్టి రసాయన రహిత పద్ధతిపై పరిశోధకులు దృష్టి సారించారు. యూవీ–సీ కాంతి ఎల్. మోనోసైటోజీన్ క్రిములను గణనీయంగా తగ్గించినట్లు వెల్లడైంది. హైడ్రోపోనిక్ సాగు నానాటికీ విస్తరిస్తున్న నేపథ్యంలో డా. అచ్యుత్ పరిశోధనలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.


