న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ నాలుగు, ఐదు తేదీల్లో భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కల్పించే భద్రతా ఏర్పాట్లు ప్రపంచ స్థాయిలో అత్యంత ఉన్నతమైనవిగా ఉండనున్నాయి. ఇప్పటికే రష్యాకు చెందిన ప్రత్యేక భద్రతా సంస్థ అధికారులు భారత్‌కు చేరుకొని, అన్ని ఏర్పాట్లను క్షుణ్ణంగా సమీక్షిస్తున్నారు. పుతిన్ ప్రపంచంలోనే అత్యంత భారీ భద్రత కలిగిన నేతలలో ఒకరిగా పేరొందారు. 2012లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య, స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దాడి తర్వాత పుతిన్‌కు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఆహారానికి ల్యాబ్‌లో పరీక్షలు
పుతిన్ భద్రతా వలయంలో ‘అదృశ్య భద్రతా బృందం’ ఒక కీలకమైన అంశం. ది మాస్కో టైమ్స్ నివేదిక ప్రకారం, ఈ ప్రత్యేక బృందం అధ్యక్షుడు పర్యటించే ప్రాంతానికి ఆయన కంటే ముందే చేరుకుంటుంది. స్థానికులతో ఎంతగా కలిసిపోతుందంటే, వారిని ఎవరూ గుర్తించలేరు. రష్యా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లినా, ఆయన భద్రతా బృందం ఒక పోర్టబుల్ ల్యాబ్‌ను తీసుకువెళ్తుంది. దీని ప్రధాన ఉద్దేశం.. ఆయన తీసుకునే ఆహారం, నీటిలో ఎలాంటి విషాలు లేదా హానికరమైన పదార్థాలు లేవని నిర్ధారించడం. ల్యాబ్ పరీక్ష లేకుండా ఆయనకు ఆహారం వడ్డించరు. పుతిన్ తాగే నీరు కూడా విదేశాల నుండి కాకుండా, రష్యా నుండే వస్తుంది.
‘దాపరికానికి’ పోర్టబుల్ టాయిలెట్
పుతిన్ ఆహారం విషయంలో అత్యంత కఠినమైన ప్రోటోకాల్‌లను అనుసరిస్తారు. ఆయన వ్యక్తిగత చెఫ్, వంట సిబ్బంది ఎల్లప్పుడూ ఆయనతో పాటు ప్రయాణిస్తారు. విదేశీ పర్యటనల్లో ఆయన హోటళ్లలో లేదా ఆతిథ్య దేశంలోని ఆహారాన్ని తీసుకోరు. ఆయన తన సొంత వంటగదిలో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తింటారు. అయినప్పటికీ భద్రతా తనిఖీలు తప్పనిసరి. మరింత గోప్యత కోసం పుతిన్ విదేశీ పర్యటనల సమయంలో తన వ్యక్తిగత పోర్టబుల్ టాయిలెట్‌ను కూడా వెంట తీసుకువెళ్లడం గమనార్హం. దీనికి కారణం ఏ దేశం లేదా ఏజెన్సీ తన ఆరోగ్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని (జీవసంబంధమైన నమూనాలు) పొందకుండా నిరోధించడమే.
పటిష్టమైన కాన్వాయ్
రష్యా అధ్యక్షుడి కాన్వాయ్ అభేద్యంగా ఉంటుంది. ఇందులో ప్రత్యేక ఆర్మర్డ్ కారుతో పాటు, మెడికేర్ వ్యాన్, ఆహార పరీక్ష కోసం పోర్టబుల్ ల్యాబ్, కమాండ్ కంట్రోల్ వాహనం, స్నిపర్ బృందం, సైబర్ సెక్యూరిటీ యూనిట్, శాటిలైట్ కమ్యూనికేషన్ యూనిట్ ఉంటాయి. పుతిన్ భారత పర్యటన సందర్భంగా, దేశీయ ఎస్‌పీజీ, ఎన్‌ఎస్‌జీ దళాలు.. రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్‌ఎస్‌ఓ)ఏజెన్సీతో కలిసి పనిచేస్తూ, అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తాయి.
ఉమ్మడి భద్రతా వలయం
పుతిన్ పర్యటన సందర్భంగా భారతదేశంలో భద్రతా ప్రోటోకాల్‌లు అత్యంత కట్టుదిట్టంగా ఉండనున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్ హౌస్ చుట్టూ నో-ఫ్లై, నో-డ్రోన్ జోన్లుగా ప్రకటిస్తారు. అధ్యక్షుడి రాకపోకల కోసం ప్రత్యేక వీఐపీ భద్రతా కారిడార్, ట్రాఫిక్ లాక్‌డౌన్ జోన్ అమలు చేస్తారు. జామర్లు, యాంటీ-డ్రోన్‌లు, స్నిపర్‌ల ద్వారా నిరంతర తనిఖీలు చేపడతారు. ఎస్‌పీజీ, ఎన్‌ఎస్‌జీ, రష్యన్ ఏజెన్సీల ఉమ్మడి భద్రతా వలయం ఈ పర్యటనను మరింత పటిష్టం చేయనుంది.
భారత్‌కు సదవకాశం
ఈ పర్యటన భారతదేశానికి ఒక ప్రధాన అవకాశంగా మారనుంది. వ్యూహాత్మక, రక్షణ, ఆర్థిక సహకారంతో పాటు, కార్మిక, సామాజిక సహకారంపై గణనీయమైన చర్చలకు అవకాశం ఏర్పడనుంది. రష్యన్ కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో పెరుగుతున్న కార్మిక కొరతను తీర్చడానికి 2030 నాటికి సుమారు 31 లక్షల మంది కార్మికులు అవసరం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి రష్యా కనీసం పది లక్షల మంది విదేశీ కార్మికులను నియమించుకోవాలని భావిస్తోంది. ఈ విషయంలో భారతదేశం ప్రధాన వనరుగా మారే అవకాశాలున్నాయి. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే, భారత యువతకు రష్యాలో చట్టబద్ధమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భారతదేశ విదేశీ మారకం పెరుగుతుంది, రెండు దేశాల మధ్య సామాజిక, ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి.
ఇది కూడా చదవండి: బిహార్ ఎఫెక్ట్: జార్ఖండ్‌లో సోరెన్-బీజేపీ కొత్త సర్కారు?


