ఉక్రెయిన్ సంక్షోభ విషయంలో రష్యాపై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ చమురు విషయంలో భారత్‌పై సుంకాల యుద్ధమే చేశారు. రెండు దఫాలుగా 50 శాతం అన్యాయంగా పన్నులు విధించారు. అయితే ఏకపక్ష నిర్ణయాలకు తాము తలొగ్గబోమని.. జాతి ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని భారత్ కుండబద్ధలు కొట్టింది. ఈ క్రమంలో ట్రంప్ చేసిన పలు ప్రకటనలనూ (పాక్-భారత్ ఉద్రిక్తతలను ఆపానంటూ చేసినవి కూడా) ఖండించింది కూడా.
ఈలోపు.. షాంగై సదస్సులో పుతిన్-మోదీ ఒకే కారులో ప్రయాణించడం, ప్రత్యేకంగా భేటీ కావడంలాంటివి ట్రంప్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఆ రెండు దేశాలవి డెడ్ ఎకానమీలని.. అవి ఎలా పోయినా తనకు సంబంధం లేదంటూ ఆ సమయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారాయన. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఆయన స్వరం మారింది. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతిని తగ్గించబోతోందని.. ప్రధాని మోదీ మాట మీద తనకు నమ్మకం ఉందని.. భారత్‌తో అమెరికా అనుబంధం కొనసాగుతుందంటూ స్వరం మార్చారు. అఫ్‌కోర్స్ భారత్ వాటిని ఖండించింది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో..
రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు రానున్నారు. మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వాస్తవంగా ఈ ఇద్దరు శక్తివంతమైన నేతల భేటీపై గత ఆరు నెలలుగా ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. వీళ్ల కలయిక అంటే ఏమాత్రం మిండుగు పడని ట్రంప్ ఎలా స్పందిస్తారో ? అనేదే అందుకు ప్రధాన కారణం.
వాస్తవానికి రష్యా చమురును భారత్‌కు దూరం చేయాలని ట్రంప్ చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే ఆ పాచికలేవీ పారలేదు. సరికదా ట్రంప్ నుంచి రష్యా చమురు సరఫరాదారులైన ఆంక్షల ప్రకటన వెలువడగానే భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ మాస్కోకు వెళ్లి పుతిన్‌తో సమావేశం అయ్యారు. అటుపై పుతిన్ సన్నిహితుడైన నికోలాయ్ పెత్రుషెవ్‌తో ఈ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఇప్పుడేమో డిసెంబరు 4, 5 తేదీల్లో పుతిన్ భారత్‌లో పర్యటిస్తారనే ప్రకటన వెలువడింది.
పుతిన్ ఢిల్లీలో జరగబోయే 23వ రష్యా-భారత్ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొంటారు. అయితే భారత్‌తో భారీ ఎత్తున ఒప్పందాల ఎజెండాతోనే రష్యా అధ్యక్షుడు భారత్‌కు వస్తున్నారా?.. ఉక్రెయిన్ సంక్షోభం ముగించేందుకు మోదీ మధ్యవర్తిత్వాన్ని పుతిన్ కోరనున్నారా? రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్ మాటల్ని పట్టించుకోకూడదని చెబుతారా? అసలు ఇవేవీ కావు.. సైనికపరమైన సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నారా?.. పుతిన్ భారత్‌కు ఎందుకొస్తున్నారనే ప్రశ్నలపై చర్చ నడుస్తోంది ఇప్పుడు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంతో పాక్ క్షిపణులను తుక్కు చేసి ప్రపంచానికి సత్తా చాటిన భారత్ ఇప్పుడు రష్యా ఆయుధ సంపత్తిపై ఆసక్తి ప్రదర్శిస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పైగా మేక్ ఇన్ ఇండియానికి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితుల్లో అది కష్టతరమేనన్న అభిప్రాయమూ రక్షణ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. అయితే అమెరికా ఆంక్షలను లెక్కచేయని తరుణంలో పుతిన్ భారత్‌తో మరో కోణంలోనూ ఒప్పందాలు చేసుకునే అవకాశం లేకపోలేదు. అందులో.. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్తు ప్లాంట్‌లో కొత్త మాడ్యులర్ రియాక్టర్ల నిర్మాణంలో రష్యా భాగస్వామిగా మారే అవకాశం బలంగానే కనిపిస్తోంది.
ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సుదీర్ఘంగా భేటీ అయిన పుతిన్.. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు రావడం ట్రంప్‌ను ఒత్తిడికి గురిచేసే అంశమే. అందుకే వీళ్ల దోస్తీపై ఆయన పగబట్టారు. అదీగాక అమెరికా, యూరప్ దేశాలకు వ్యతిరేకంగా పుతిన్ ఆసియా దేశాలతో ఓ బలమైన కూటమిగా ఎదిగేతే గనుక.. అందులో భారత్ ప్రధాన భూమిక అవకాశాలను తోసిపుచ్చలేం. అందుకే భారత్‌తో మరింత దగ్గరైతే రష్యా మళ్లీ సూపర్ పవర్‌గా ఎదుగుతుందనే భయం ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
:::వెబ్‌డెస్క్ స్పెషల్


