వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అధ్యక్షుడి అధికారిక నివాస భవనం వైట్‌హౌస్ సమీపంలోనే కాల్పుల కలకలం రేగిన సంగతి తెలిసిందే. విధి నిర్వహణలో ఉన్న వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డు సిబ్బందిపై ఓ యువకుడు పాయింట్ 357 స్మిత్ అండ్ వెసన్ రివాల్వర్‌తో హఠాత్తుగా కాల్పులు జరిపాడు. మొత్తం ముగ్గురు జవాన్లపై కాల్పులు జరిగాయి. ఇద్దరు తీవ్రంగా గాయపడగా, మరో జవాను స్వల్పంగా గాయపడ్డాడు.
ఈ క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌కార్డ్ హోల్డర్స్‌పై దృష్టిపెట్టారు. 19 దేశాల నుండి వచ్చిన వారికి జారీ చేసిన గ్రీన్ కార్డులపై విస్తృత సమీక్ష చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అఫ్గాన్‌తో సహా మరో 18 దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌ను సమీక్షించనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ప్రతి విదేశీయుడి గ్రీన్ కార్డును పూర్తిస్థాయిలో పునఃపరిశీలన చేయాలి” అని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించినట్లు తెలిపారు.
కాగా, ఇటీవలి కాలంలో భారత్, అఫ్గానిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. తాలిబన్ పాలకులు భారత్‌కు స్నేహహస్తం అందిస్తున్నారు. కలిసి పనిచేస్తామని చెబుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం, తాలిబన్ పాలకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అఫ్గాన్–పాక్ సరిహద్దుల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అఫ్గాన్ యువకుడు అమెరికాలో కాల్పులు జరపడం, అధ్యక్షుడు ట్రంప్ అఫ్గానిస్తాన్‌పై కత్తి నూరుతుండడం చర్చనీయాంశంగా మారింది.


