అవినీతి కేసులో 21 ఏళ్ల జైలు
కుమారుడు, కుమార్తెకూ ఐదేళ్ల శిక్ష
ఢాకా: బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢాకా న్యాయస్థానం గురువారం మూడు అవినీతి కేసుల్లో ఆమెకు 21 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టు భూకేటాయింపుల్లో అవతవకలకు పాల్పడినట్లు అవినీతి నిరోధక శాఖ ఈ మూడు కేసులు నమోదు చేసింది. మార్చి 10న చార్చిషీట్లను సమర్పించింది. ఒక్కో కేసులో ఏడేళ్ల చొప్పున 21 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పుచెప్పింది.
ఎటువంటి దరఖాస్తులు లేకుండా, తన అధికార పరిధిని మించి హసీనా ప్లాట్‌ను కేటాయించారని కోర్టు పేర్కొంది. వరుసగా శిక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. హసీనా గైర్హాజరీలో ఉండగా ఆమె పరారీలో ఉన్న వ్యక్తిగా పేర్కొంటూ కోర్టు తీర్పునిచి్చంది. ఒక్కో కేసులో ఒక లక్ష రూపాయల జరిమానా చెల్లించలేకపోతే మరో 18 నెలల జైలు శిక్ష విధించనున్నట్లు వివరించింది.
హసీనా కుమారుడు, కుమార్తె సాజిబ్ వాజిద్ జాయ్, సైమా వాజిద్ పుతుల్‌లపై దాఖలైన కేసుల్లోనూ ఇరువురికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. ఇద్దరికీ లక్ష చొప్పున జరిమానా విధించింది. చెల్లించని పక్షంలో ఒక నెల ఎక్కువ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి చెప్పారు. అయితే విచారణ చట్టబద్ధతను హసీనా కొట్టిపారేసారు. తనపై ఉన్న అభియోగాలు రాజకీయపూరితమైన వని హసీనా అభిప్రాయపడ్డారు. కోర్టు మోసపూరితమైనదని ఆరోపించారు.
గతేడాది ఆగస్టు 5 నుంచి హసీనా భారత్‌లో నివసిస్తున్నారు. గతేడాది జూలై, ఆగస్టు మధ్య విద్యార్థుల నేతృత్వంలో జరిగిన తిరుగుబాటును హింసాత్మకంగా అణచివేయాలని ఆదేశించినందుకు హసీనాను దోషిగా నిర్ధారించిన ట్రిబ్యునల్ ఈ నెల 17న ఆమెకు మరణశిక్ష విధించింది. వారం రోజులకే ఈ తీర్పు వచి్చంది. హసీనా కుటుంబంతోపాటు గృహ నిర్మాణశాఖ మాజీ మంత్రి షరీఫ్ అహ్మద్, శాఖ అధికారులతో సహా 20 మందిపై ఈ కేసుల్లో విచారణ జరిగింది. ఒకరికి తప్ప 19 మందికి వేర్వేరు శిక్షలు పడ్డాయి.


