గజ దొంగ సినిమాలో గోల్డ్ మ్యాన్‌ను ఉద్దేశించి ‘మీ ఇల్లు బంగారం గాను..’ అంటూ ఐటెం గర్ల్ ఆడిపాడుతుంది. పైన ఫొటో చూసి అదేదో నగల షాపు దుకాణమో లేదంటే నగల ఎగ్జిబిషన్ అనుకుంటే పొరపడినట్లే..!
ఈ కనిపించేది ఓ ప్రభుత్వ అధికారి బంగ్లా. ఇలాంటి బంగ్లాలు ఇలాంటివి ఆయనకు నాలుగైదు ఉన్నాయట. అలాంటి పది మంది అధికారుల ఇళ్లలో తనిఖీలు జరిపితే.. భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, డబ్బు బయటపడ్డాయి..

మంగళవారం కర్ణాటక యాంటీ కరప్షన్ ఏజెన్సీ లోకాయుక్త జరిపిన తనిఖీల్లో విస్తుపోయే ఈ దృశ్యాలు కనిపించాయి. లోకాయుక్త అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అనుమానంతో రంగంలోకి దిగారు.

బెంగళూరు, మైసూరు, మాండ్య, బీదర్, ధారవాడ, హవేరి, శివమొగ్గ, దావణగెరెలో ఈ తనిఖీలు జరిగాయి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ D.M. గిరీష్, మాండ్య టౌన్ ప్లానింగ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ C. పుట్టస్వామి, బీదర్ అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ ప్రేమ్ సింగ్, మైసూరు హూటగల్లి మునిసిపాలిటీ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ C. రామస్వామి, ధారవాడ కర్ణాటక యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సుభాష్ చంద్ర, హవేరి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేకప్ప, బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ RTO ఆఫీస్ సూపరింటెండెంట్ P. కుమారస్వామి, శివమొగ్గ SIMS మెడికల్ కాలేజ్ FDA నివాసాలు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరిగాయి.

కోట్ల విలువైన ఆస్తి పత్రాలు.. పెద్ద మొత్తంలో నగదు.. బంగారు ఆభరణాలు.. విలాసవంతమైన బంగ్లాలు ఉన్నట్లు తేలింది. అయితే తనిఖీలు పూర్తయ్యాకే పూర్తి వివరాలు తెలియజేస్తామని అధికారులు ప్రకటించారు.


