త్వరలో పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల వేళ టీఎంసీ ఐటీ విభాగ చీఫ్‌పై ఈడీ దృష్టి
ప్రతీక్ జైన్ ఇల్లు, కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు
తమ ఎన్నికల వ్యూహపత్రాలను ఈడీ కాజేసిందని ఆరోపించిన మమత
సోదాల విషయం తెల్సి వెంటనే వచ్చి కొన్ని ఫైళ్లు పట్టుకెళ్లిన సీఎం
కోల్‌కతాలో కొనసాగిన హైడ్రామా
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు అత్యంత కీలకమైన ఎన్నికల వ్యూహాలు అందించే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐప్యాక్) సంస్థపై, ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆకస్మిక దాడులు చేసింది. కోల్‌కతాలోని ఆయన నివాసంతోపాటు ఐప్యాక్ కార్యాలయాలు, సంబంధిత ప్రాంతాల్లో ఈడీ అధికారులు బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు చేశారు.
రాబోయే పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీఎంసీ పార్టీ సిద్ధంచేసుకున్న ఎన్నికల వ్యూహప్రతివ్యూహాలు, పార్టీ అభ్యర్థుల జాబితా, ఎన్నికల వాగ్దానాలు, ఎజెండా, పార్టీ కార్యాచరణ, ఇతర రహస్య అంశాలకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనంచేసుకున్నట్లు వార్తలొచ్చాయి. సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఐప్యాక్ ఆఫీస్, లౌదన్ స్ట్రీట్‌లోని జైన్ ఇల్లుసహా 10 ప్రాంతాల్లో గురువారం ఉదయం 6 గంటల నుంచే సోదాలు మొదలైనట్లు తెలుస్తోంది.
టీఎంసీ కార్యకర్తలు కార్యాలయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు ఈడీకి తోడుగా పారా మిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. విషయం తెల్సుకున్న వందలాది మంది టీఎంసీ పార్టీ కార్యకర్తలు, నేతలు వెనువెంటనే జైన్ ఇల్లు, ఐప్యాక్ కార్యాలయాల వద్దకు చేరుకుని ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ఒక రాజకీయ వ్యూహరచనల సంస్థ కార్యాలయంలో చట్టవ్యతిరేకంగా సోదాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈడీ తనిఖీలకు ఎలాంటి చట్టబద్ధత లేదని స్పష్టంచేశారు.
రంగంలోకి దూకిన సీఎం మమత
ప్రధాని మోదీపై విమర్శల వాగ్బాణాలు సంధించే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు రాజకీయ ఎన్నికల వ్యూహాలు, సలహాలు అందించే ఐప్యాక్ సంస్థను ఈడీ సోదాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ ఆగమేఘాలమీద రంగంలోకి దూకారు. సెక్టార్5లోని ఐప్యాక్ కార్యాలయానికి వచ్చి కొన్ని కీలక పత్రాలు, ఫైళ్లను ఆమె కాపాడారు. వాటిని ఆమె చేతపట్టుకుని అక్కడి నుంచి వెనుతిరిగారు.
అంతకుముందే రాష్ట్ర డీజీపీ రాజీవ్ కుమార్, విధాన్‌పూర్ పోలీస్ కమిష నరేట్ పోలీస్ ఉన్నతాధికారులు, కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్‌వర్మ, పలువురు మంత్రులు, విధాన్‌పూర్ నగర మేయర్ కృష్ణచక్రవర్తి, టీఎంసీ నేతలు అక్కడికి చేరుకున్నారు. మమత నేరుగా 11వ అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కొన్ని ఫైళ్లను తీసుకొచ్చారు. ఓవైపు ఈడీ అధికారులు, పారామిలటరీ బలగాలు మరోవైపు సీఎం మమత, రాష్ట్ర మంత్రులు, డీజీపీ, పోలీస్ కమిషనర్లతో జైన్ నివాసం ఒకదశలో రణరంగాన్ని తలపించింది.
ఈడీకి వ్యతిరేకంగా నేడు ర్యాలీ
ఈడీ అక్రమ సోదాలను నిరసిస్తూ శుక్రవారం కోల్‌కతాలో నిరసన ర్యాలీ చేపట్టబోతున్నట్లు మమత ప్రకటించారు.‘‘ఎస్‌ఐఆర్ పేరిట ఓట్లు తీసేస్తున్నా, నాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నా, ఆఫీసుల్లో పార్టీ వ్యూహ పత్రాలను పట్టుకుపోతున్నా చూస్తూ ఊరు కోవాలా? నిరసన ప్రదర్శనలు చేయ కూడదా?. అందుకే శుక్రవారం కోల్‌కతాలోని జాదవ్‌పూర్ 8బీ బస్టాప్ నుంచి హజ్రా క్రాసింగ్ దాకా ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ చేపడతా. వేలాదిగా జనం తరలివచ్చి ఈడీ వైఖరిని రోడ్లపై ఎండగట్టండి’’ అని మమత పిలుపునిచ్చారు.
రాజకీయ వ్యూహాలను కొట్టేయడమే ఈడీ పనా?
సీఎం మమతసోదాల అంశంపై సీఎం మమత మీడియాతో మాట్లాడుతూ ఈడీ దాడులను తూర్పారబట్టారు. ‘‘మా పార్టీ ఐటీ విభాగ సారథి జైన్ ఇంట్లో ఈడీ చట్టవిరుద్ధంగా సోదాలు చేసింది. అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ, ఐప్యాక్ సిద్ధంచేసిన వ్యూహాలు, ఎజెండా, పార్టీ అభ్యర్థుల జాబితా, ఇతర రహస్య వివరాలతో కూడిన డాక్యుమెంట్లు, హార్డ్‌డిస్క్‌లను జప్తుచేసేందుకు దుస్సాహసం చేశారు. వాటిలో కొన్నింటిని ఎలాగోలా నేను స్వయంగా వెళ్లి వెంటపట్టుకొచ్చా.
రాజకీయ పార్టీకి సంబంధించిన విస్తృత సమాచారాన్ని తస్కరించడమే ఈడీ పనా?. రాజకీయ కక్షసాధింపు కోసమే ఈడీతో బీజేపీ సర్కార్ ఈ సోదాలు, దాడులు చేయిస్తోంది. వైరి పార్టీల రహస్యాలు కొట్టేస్తున్న ఈడీకి దర్యాప్తు సంస్థగా కొనసాగే అర్హతే లేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇలా రాజ్యాంగబద్ధ సంస్థలను విపక్ష పార్టీల మీద దుర్విని యోగపరుస్తున్నారు.
ఎన్నికలకు ముందే దర్యాప్తు సంస్థలను పంపించి వేధిస్తుంటే దేశాన్ని కాపాడేదెవరు?. ఇకనైనా ప్రధాని మోదీ జోక్యంచేసుకుని హోం మంత్రి అమిత్ షా ఆగడాలకు అడ్డుకట్టవేయాలి. సాల్ట్ లేక్‌లోని సెక్టార్–5లోని ఐప్యాక్ ఆఫీస్‌లో ఉదయం ఆరు గంటలకే సిబ్బంది ఎవరూ లేనప్పుడు ఈడీ దాడులుచేసింది. మా డేటా, ఎన్నికల వ్యూహపత్రాలు, కంప్యూటర్లలోని సమాచారాన్ని తస్కరించారు. ఇది నిజంగా నేరమే. మా ఆఫీస్‌లోని మొత్తం డాక్యుమెంట్లను పట్టుకెళ్లబోయారు. బల్లాలన్నీ ఖాళీగా ఉన్నాయి.
పోయిన పత్రాలను మళ్లీ సిద్ధంచేయాలంటే ఆలోపే ఎన్నికల ముహూర్తం, పోలింగ్ అయిపోతాయి. ఈడీ అధికారులు మా పత్రాలను కొట్టేశారు. మా ఎన్నికల వ్యూహాలను తెల్సుకున్నారు. అభ్యర్థుల జాబితా, హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు నొక్కేయడమే ఈడీ, అమిత్ షా పనా? టీఎంసీ అనేది నమోదిత రాజకీయ పార్టీ. ఆదాయ పన్ను చెల్లింపులు సమయానికి కట్టేస్తుంది. ఆ ఆదాయపన్ను వివరాలు కావాలంటే ఐటీ శాఖ నుంచి తీసుకోవచ్చు కదా?. ఇదే ఈడీగనక కోల్‌కతాలోని బీజేపీ ఆఫీస్‌లో సోదాలు చేస్తే బీజేపీ అగ్రనేతలు ఊరుకుంటారా?’’ అని మమత అన్నారు.
ఆధారాలు ఉన్నందుకే దాడి చేశామన్న ఈడీ
ఐప్యాక్ కార్యాలయాలపై సోదాల విషయంలో తర్వాత ఈడీ వివరణ ఇచ్చింది. ‘‘2020 నవంబర్‌లో పశ్చిమబెంగాల్‌లో కునుస్తోరియా, కజోరా, అసన్‌సోల్ ప్రాంతాల్లో బొగ్గు అక్రమ రవాణా కుంభకోణంలో స్థానిక బొగ్గు ఆపరేటర్ అనూప్ మాఝీ అలియాస్ లాలా ప్రధాన నిందితునిగా ఉన్నాడు. అతనికి సంబంధించిన వ్యక్తులు హవాలా మార్గంలో సొమ్మును తరలించారు. ఈ లావా దేవీలతో ఐప్యాక్ చీఫ్ ప్రతీక్‌జైన్‌కు సంబంధం ఉంది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను సంపాదించాం. జైన్ కార్యాలయాల్లో సోదాలు చేశాం’’ అని ఈడీ పేర్కొంది.


