రూ. 100 నోటుపై ముద్రించిన నేపాల్
కఠ్మాండు: భారత్‌లోని కాలాపానీ, లిపులెఖ్, లింపియధుర ప్రాంతాలు తమవంటూ వాదిస్తున్న నేపాల్ ప్రభుత్వం మరో వివాదానికి తెరతీసింది. తాజాగా విడుదల చేసిన రూ.100 నోటుపై ముద్రించిన నేపాల్ మ్యాప్‌లో ఆ మూడు ప్రాంతాలు ఉండటమే ఇందుకు కారణం. నేపాల్ రాష్ట్ర బ్యాంక్(ఎన్‌ఆర్‌బీ) గత గవర్నర్ మహా ప్రసాద్ అధికారి సంతకంతో కూడిన ఆ నోట్‌పై నేపాల్ క్యాలెండర్ ప్రకారం 2081లో విడుదల చేసినట్లుగా ఉంది.
అంటే, ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ఇది గతేడాది 2024. 2020లో అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రభుత్వం లిపులెఖ్, కాలాపానీ, లింపియధుర తమవేనంటూ ఆ దేశ కొత్త మ్యాప్‌ను విడుదల చేయడం వివాదం రేపింది. దీనిపై అప్పట్లో భారత్ తీవ్రంగా స్పందించింది. ఏకపక్ష చర్యగా అభ్యంతరం తెలిపింది. భూభాగాన్ని కృత్రిమంగా విస్తరించి చూపడాన్ని ఆమోదించబోమంది.


