షూటింగ్, బ్యాడ్మింటన్ క్రీడా సమాఖ్యల హర్షం
2030 కామన్వెల్త్ క్రీడల్లో ఈ రెండు ఈవెంట్లు పునరాగమనం!
న్యూఢిల్లీ: భారత్‌కు మళ్లీ కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య భాగ్యం దక్కడంపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), క్రీడాశాఖ కంటే కూడా అంతర్జాతీయ క్రీడా షూటింగ్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్), ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తెగ సంబరపడిపోతున్నాయి. భారత్‌కు 2030 ఆతిథ్య హక్కులు దక్కడాన్ని ఈ రెండు క్రీడా సమాఖ్యలు స్వాగతించాయి. దీంతో ఈ మెగా ఈవెంట్‌లో తిరిగి ఈ రెండు క్రీడాంశాలు చేరతాయని ఆశిస్తున్నాయి.
వచ్చే ఏడాది స్కాట్లాండ్ దేశంలో జరిగే గ్లాస్గో–2026 కామన్వెల్త్ క్రీడల నుంచి షూటింగ్, బ్యాడ్మింటన్ ఈవెంట్‌లను తొలగించారు. ఇది భారత శిబిరాన్నే కాదు... ఐఎస్‌ఎస్‌ఎఫ్, బీడబ్ల్యూఎఫ్‌లను సైతం తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ఎందుకంటే ఈ రెండు ఈవెంట్లలో చెప్పుకోదగ్గ సంఖ్యలో బంగారు, రజత, కాంస్య పతకాల్ని మన క్రీడాకారులు సాధిస్తారు.
ఈ పతకాలతో ఆయా అథ్లెట్లకు నజరానాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఈపాటికే ఉద్యోగాలుంటే పదోన్నతులు సైతం దక్కుతాయి. కానీ ఈవెంట్లకు కత్తెర వేయడంతో భారత షూటర్లు, షట్లర్లకు అశనిపాతమైంది. అయితే 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కుల్ని బుధవారం భారత్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆతిథ్య దేశం ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈ రెండు క్రీడల్ని చేరుస్తారని ఐఎస్‌ఎస్‌ఎఫ్, బీడబ్ల్యూఎఫ్ గట్టిగా ఆశిస్తున్నాయి.
వడోదరలో క్రికెట్!
అహ్మదాబాద్ వేదికగా జరిగే కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా నిర్వహించబోయే క్రికెట్ పోటీలకు సమీప నగరం వడోదర వేదికయ్యే అవకాశముందని ఐఓఏ సీఈఓ రఘురామ్ అయ్యర్ తెలిపారు. దీనిపై ఇంకా అధికారక నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. భారత్‌లో జరిగే మెగా ఈవెంట్‌లో 15 నుంచి 17 క్రీడాంశాలకు చోటు ఉంటుందని క్రీడా వర్గాలు వెల్లడించాయి.


