భారీ ధర పలకనున్న వందేళ్లనాటి రష్యా రాచరిక వస్తువు
లండన్: రష్యా జార్ చక్రవర్తుల రాజరిక ఠీవీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే అత్యంత అరుదైన వింటర్‌ఎగ్ ఒకటి ఇప్పుడు వేలంపాటలో రికార్డ్‌ల మోత మోగించేందుకు సిద్ధమైంది. రష్యా జార్ చక్రవర్తి నికోలస్–2 తన తల్లి, రాజమాత మారియా ఫియోడోరోవ్‌నాకు వందేళ్ల క్రితం ఈస్టర్ కానుకగా బహూకరించిన విలువైన వింటర్ ఎగ్ గురించే ఇప్పుడా చర్చ అంతా.
డిసెంబర్ రెండో తేదీన క్రిస్టీస్ వేలంపాట సంస్థ తమ లండన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే వేలంపాటలో ఈ స్ఫటిక ఫ్యాబెర్జీ వింటర్ ఎగ్ ఏకంగా రూ.236 కోట్లకుపైగా ధర పలకవచ్చన్న అంచనాలు ఎక్కువయ్యాయి. దీనిని ప్రఖ్యాత వజ్రాభరణాల సంస్థ ఫ్యాబెర్జీ తయారుచేసింది. 1913 సంవత్సరంలో రాజు నికోలస్ దీనిని తన తల్లికి బహూకరించారు. రష్యా ప్రభుత్వ అధీనంలోకాకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న ఏడింటిలో ఇదీ ఒకటని వేలంసంస్థ పేర్కొంది.
ఎన్నెన్నో ప్రత్యేకతలు
దవళవర్ణంలో ధగధగా మెరిసేపోయే ఈ వింటర్ ఎగ్ ఎత్తు 10 సెంటీమీటర్లు. లీలగా చూస్తే పూర్తి గుడ్డులాగా కనిపించినా దానిని రెండుభాగాలుగా తెరవొచ్చు. చలికాలంలో ఆరుబయట పెడితే మంచుబిందువులు పడి ఘనీభవించినట్లు స్ఫురించేలా దీనిని డిజైన్‌చేశారు. ప్లాటినమ్ లోహపు బుల్లి బుట్టలో అనిమోనిస్ పుష్పాలను గుదిగుచ్చి చూడచక్కటి పుష్పగుచ్ఛా న్ని తయారుచేసి లోపల పెట్టారు.
గుడ్డు అంతర్గ తంగా మొత్తంగా ఏకంగా 4,500 చిన్న చిన్న వజ్రా లను పొదిగారు. అనిమో నిస్ పుష్పాలను క్వార్జ్‌తో తయారుచేశారు. ఆకుల ను పచ్చలతో రూ పొందించారు. శీతాకాల చలిని చీల్చుకుంటూ వసంత రుతువులోకి కాలం అడుగుపెట్టేవేళ అనిమో నిస్ పుష్పాలు వికసిస్తా యి. కష్టకాలాన్ని దాటి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నందుకు గుర్తుగా రష్యాలో ఈ పుష్పాలను బహుమతిగా ఇస్తారు.
ఫ్యాబెర్జీ వజ్రాభరణాల సంస్థలోని ఏకైక కళాకృతి కళాకారిణి ఆల్మా పిహల్ దీనిని డిజైన్ చేశారు. స్వర్ణకారులైన ఆల్బర్ట్ హల్మ్‌స్ట్రోమ్, పిహల్ బంధువు దీనిని తయారు చేశారు. ‘‘అద్భుతమైన చేతి పనితనం, ఆకర్షణీ యమైన డిజైన్‌లకు ఈ వింటర్ ఎగ్ పెట్టింది పేరు. అలంకరణ కళల్లో ఈ ఎగ్ ఒకరకంగా మోనాలిసా పెయింటింగ్‌లాంటిది’’ అని క్రీస్టిస్ వేలంసంస్థలో రష్యా కళారూపాల విభాగ అధిపతి మార్గో ఒగానేసియన్ వ్యాఖ్యానించారు.
పీటర్ కార్ల్ ఫ్యాబెర్జీ సారథ్యంలోని వజ్రా భరణాల సంస్థ 1885 నుంచి దాదాపు పాతికేళ్ల పాటు రష్యా రాజకుటుంబాల కోసం దాదాపు 50 స్మారక ఎగ్‌లను తయారు చేసి ఇచ్చింది. జార్ చక్రవర్తి అలెగ్జాండర్–3 తన సతీమణికి ప్రతి ఈస్టర్‌కు ఒక ఈస్టర్ ఎగ్ ను బహూకరించి ఇలా ఎగ్‌ల బహూకరణ పర్వానికి తెరలేపారు. దీనిని నికోలస్–2 కొనసా గించారు.


