ఇరాన్ అమెరికా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆందోళనకారులను అణచివేస్తే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే సైనిక చర్యకు దిగుతామని ట్రంప్.. తమ దేశ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే అంతు చూస్తామంటూ ఖమేనీ సవాల్-ప్రతిసవాల్ విసురుకుంటున్నారు. అయితే ఆందోళనలతో ఇరాన్ నెత్తురోడుతున్న వేళ.. ఆ దేశంలోని ఇతర దేశాల పౌరుల భద్రతపై ఆందోళన నెలకొంది.
ఇరాన్ సంక్షోభంలో(Iran Crisis) మరణాలను అక్కడి ప్రభుత్వం తక్కువగా చూపెడుతోందంటూ మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటిదాకా 548 మరణించారని.. అందులో 48 భద్రతా సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది(హెచ్‌ఆర్‌ఏఎన్‌ఏ అనే అమెరికా మానవ హక్కుల సంఘం లెక్కల ప్రకారం). అలాగే 10 వేల మంది ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారని సమాచారం. అయితే.. అరెస్ట్ అయిన వాళ్లలో ఇతర దేశా పౌరులు ఉన్నట్లు పలు కథనాలు వైరల్ అవుతున్నాయి.
నిరసనల్లో పాల్గొనకపోయినా.. కొందరి చేతులకు బేడీలు వేసి తీసుకెళ్తన్నట్లుగా దృశ్యాలు అందులో ఉన్నాయి. అందులో భారతీయులు, అఫ్గనిస్థాన్ జాతీయులు ఎక్కువగా ఉన్నట్లు ఆ ప్రచార సారాంశం. పైగా విదేశీ వ్యవహారాల శాఖ సంబంధిత పేర్లతో ఉన్న అకౌంట్లలో ఆ వీడియోలు పోస్టు కావడం గమనార్హం. దీంతో.. ఆ దేశంలో పనుల నిమిత్తం వెళ్లిన భారత పౌరులు.. విద్యార్థుల భద్రతపై ఢిల్లీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే..
భారత్‌లో ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలి(Mohammad Fathali) ఆ కథనాలను ఖండించారు. అలాంటిదేమీ.. ఇరాన్‌లోని భారతీయులతో సహా ఇతర దేశాల పౌరుల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో జరిగిన ఫేక్ ప్రచారం ఆధారంగానే ఆ కథనాలు పుట్టుకొచ్చాయని అంటున్నారు. పుకార్లను నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆయన క్లారిటీగా ఓ పోస్ట్ చేశారు.

అయితే.. అటు ఇరాన్ ఈ తరహా కథనాలు మొదటి నుంచే ఖండిస్తోంది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్న కుట్ర అని ఆరోపించింది. ఇరాన్ నిరసనలను కొందరు విదేశీ నటులు.. మీడియా వక్రీకరిస్తున్నాయని.. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తోంది.
మన పిల్లలు సేఫ్!
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ఇరాన్‌లో 10,000 నుంచి 12,000 మంది భారతీయులు ఉన్నారు. ఇందులో పనుల నిమిత్తం వెళ్లేవాళ్లు, భారతీయ మూలాలు ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. అయితే అక్కడికి భారత్ నుంచి అత్యధికంగా వెళ్లేది వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులే. ఈ నేపథ్యంలో.. వాళ్ల భద్రతపై కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. వాళ్లు సురక్షితంగా ఉన్నారని ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIMSA), ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్స్ (FAIMA) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో భారత రాయబార కార్యాలయం, సీనియర్ అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని.. విద్యార్థులతో, అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొంది.


