నిలదొక్కుకోవాలంటే నేర్చుకోవాల్సిందే
సొంతంగా డబ్బు ఖర్చు చేస్తున్న టెకీలు
సాంకేతిక రంగంలో మారుతున్న ధోరణి
సాక్షి, స్పెషల్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న కొత్త టెక్నాలజీ. కంపెనీలూ ఈ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. జాబ్ మార్కెట్లో ఉద్యోగులు నిలదొక్కుకోవాలంటే కృత్రిమ మేధ నైపుణ్యాలను అందిపుచ్చుకోవాల్సిందే. అది కూడా ఇప్పటికిప్పుడే. ప్రధానంగా టెక్ రంగంలోని సిబ్బందికి ఈ ఆవశ్యకత ఏర్పడింది. ఏఐ స్కిల్స్ ఉన్నఫళంగా నేర్చుకోవాల్సిందేనా? జీసీసీ సొల్యూషన్స్ కంపెనీ ‘ఆన్సర్’.. తన గ్లోబల్ టాలెంట్ ప్లాట్‌ఫామ్ ‘టాలెంట్500’తో కలిసి రూపొందించిన ‘ఏఐ అడ్వాంటేజ్ సర్వే రిపోర్ట్–2025’ అవుననే చెబుతోంది.
కృత్రిమ మేధ నైపుణ్యాలు తమ భవిష్యత్తుకు అనివార్యమైనవిగా టెక్ నిపుణులు భావిస్తున్నారని నివేదిక తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 70% కంటే ఎక్కువ మంది నిపుణులు రాబోయే మూడు నెలల్లో ఏఐ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వేగంగా నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోందని నివేదిక వివరించింది.
సొంతంగా చొరవ..
పనిచేస్తున్న సంస్థలు అధికారికంగా ఇచ్చే శిక్షణ కోసం ఉద్యోగులు వేచిచూడటం లేదని నివేదిక తెలిపింది. చాలామంది టెకీలు యూట్యూబ్, సొంతంగా అభ్యాసం, ఆన్‌లైన్ కోర్సుల ద్వారా నైపుణ్యం పెంచుకుంటున్నారు. 53.7% మంది సొంత డబ్బు వెచి్చంచి నేర్చుకుంటున్నారు. అయితే, నాలుగింట ఒకవంతు మంది రూ.10 వేల కంటే ఎక్కువగా ఖర్చు చేస్తుండడం విశేషం. ‘ఏఐ నైపుణ్యాలు కెరీర్‌ను రూపొందిస్తాయని ఉద్యోగులకు తెలుసు. కాబట్టే వేగంగా ఈ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సొంతంగా చొరవ తీసుకుంటున్నారు. ప్రధానంగా జీసీసీలకు ఈ ఆవశ్యకత అసలైన ప్రయోజనం చేకూర్చనుంది. నేర్చుకోవడానికి ఆసక్తిగా, సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తి ఏఐ సామర్థ్యాలను ఉన్నతంగా నిర్మించడానికి సరైన పునాదిని సృష్టిస్తుంది. ఈ శక్తికి వెన్నంటి నిలిచినప్పుడు అది సంస్థకు నిజమైన బలంగా మారుతుంది’.. అని నివేదిక స్పష్టం చేసింది.

ఎవరెవరు ఉన్నారంటే..
భారత్‌లోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్‌లో (జీసీసీ) ఇంజనీరింగ్, ప్రోడక్ట్, క్యూఏ, డేటా, ఆపరేషన్స్, సపోర్ట్ వంటి విభాగాల్లో పనిచేస్తున్న 3,000 మందికి పైగా వృత్తి నిపుణులు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. వీరిలో బెంగళూరు నుంచి 48.5%, హైదరాబాద్ 22.2%, ఢిల్లీ ఎన్‌సీఆర్ నుంచి 14.3% మంది ఉన్నారు. మిగిలినవారు పుణే, ముంబై, చెన్నైకి చెందినవారు. సర్వేలో పాల్గొన్న వారిలో 35 ఏళ్లలోపు వారు 71% మంది ఉన్నారు. అయితే కోడింగ్, రీసెర్చ్, డేటా అనాలిసిస్ రంగాల్లో ఏఐ ప్రభావం అధికంగా ఉంది. 1–2 ఏళ్లలో తమ ఉద్యోగాల్లో ఏఐ చాలా మార్పులు తెస్తుందని అత్యధికుల భావన.


