సాక్షి, హైదరాబాద్: అంతరిక్ష రంగంలో దేశం ఈ రోజు ఒక అపూర్వ ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శంషాబాద్‌లో నిర్మించిన భారీ కార్యాలయం ‘ఇన్ఫినిటీ క్యాంపస్’ను గురువారం వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
‘‘..విప్లవాత్మక విధానపరమైన మార్పుల ప్రభావంతో ప్రైవేట్ సంస్థలు ఈ రంగంలో దూసుకెళుతున్నాయి. హైదరాబాద్‌లో నేడు ఆవిష్కృతమైన స్కైరూట్ కంపెనీ కార్యాలయం ‘ఇన్ఫినిటీ క్యాంపస్’ దేశ యువశక్తికి, కొత్త ఆలోచనలకు, సృజనాత్మకతకు ప్రతీకగా నిలుస్తోంది. సృజనాత్మక ఆవిష్కరణలతో దూసుకెళుతున్న భారత దేశ యువత ఇతర దేశాల జెన్‌జీ తరానికి కూడా ఆదర్శంగా నిలుస్తోంది..
.. యువతరం రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉందని, సృజనాత్మకంగా ఆలోచిస్తోందని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. ఉపగ్రహ ప్రయోగాల విషయంలో దేశం అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి చేరుకుంటుంది’’ అనే ధీమా వ్యక్తం చేశారాయన. ఈ సందర్భంగా స్కైరూట్ సంస్థ వ్యవస్థాకులు పవన్ కుమార్ చందన, నాగభరత్ డాకాలు దేశ యువతకు స్ఫూర్తినిస్తున్నారని ప్రశంసించారు.
యువత దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోందని, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాణిస్తోందని దేశ ప్రధాని కొనియాడారు. అంతరిక్ష రంగమూ దీనికి భిన్నమేమీ కాదని.. ఇద్దరు, ముగ్గురు జెన్-జీలతో మొదలైన స్టార్టప్‌లు చాలా తక్కువ వనరులతోనే అద్భుతాలు సృష్టిస్తున్నారని, అలాంటి వారిని కలిసే అవకాశం తనకు దక్కిందని వివరించారు. జెన్-జీ ఇంజినీర్లు, డిజైనర్లు, కోడర్లు, సైంటిస్ట్‌లు రాకెట్ల చోదక వ్యవస్థలు మొదలుకొని కాంపోజిట్ మెటీరియల్స్, ఉపగ్రహ వ్యవస్థలు, రాకెట్లకు సంబంధించిన కొత్త కొత్త టెక్నాలజీలను ఆవిష్కరిస్తున్నారని చెప్పారు. ఐదేళ్ల క్రితం ఇలాంటివి కనీసం ఊహకు కూడా అందేవి కావని.. అందుకే 21వ శతాబ్ధం దేశ జెన్-జీదేనని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
ప్రైవేటీకరణ దిశగా భారత అణుశక్తి రంగం
అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీలను అనుమతించడం ద్వారా సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని సమీప భవిష్యత్తులో అణుశక్తి రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత అంతరిక్ష రంగ ప్రస్థానం చాలా చిన్న స్థాయిలో మొదలైందని, సైకిళ్లపై రాకెట్ విడిభాగాలను మోసుకెళ్లే స్థితినుంచి ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన లాంచ్ వెహికల్‌ను తయారు చేయగల స్థాయికి చేరగలిగామని ప్రధాని గుర్తు చేశారు. ఈ ప్రస్థానం పరిమితమైన వనరులతోనే మొదలైనప్పటికీ వృద్ధిమ ఆత్రం దేశ శాస్త్రవేత్తల సంకల్పబలానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. గడచిన దశాబ్ధ కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అంతరిక్ష రంగంలోనే 300కుపైగా స్టార్టప్‌లు వెలిశాయి అని సమాచార, వాతావరణ అంచనాలు, వ్యవసాయం, అర్బన్ ప్లానింగ్‌లతోపాటు దేశ భద్రతకూ అంతరిక్ష రంగం విస్తృత వినియోగంలోకి వచ్చిందని వివరించారు. దేశీ అంతరిక్ష రంగంపై పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోందని చిన్న ఉపగ్రహాలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోందని వివరించారు.
ప్రయోగం ఎప్పుడంటే..
సుమారు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కార్యలయంలోనే స్కైరూట్ తన మొట్టమొదటి ఆర్బిటల్ వెహికల్ ‘విక్రమ్-1’ను తయారు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా విక్రమ్-1ను ఆవిష్కరించారు. స్కైరూట్ సొంతంగా తయారు చేసిన ఆర్బిటల్ వెహికల్ ‘విక్రమ్-1’ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సాయంతో రెండు నెలల్లో ప్రయోగించనున్నట్లు సంస్థ వ్యవస్థపకుల్లో ఒకరైన పవన్ కుమార్ చందన తెలిపారు.
2018లో దేశంలోనే మొట్టమొదటి సబ్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-ఎస్’ ప్రయోగాన్ని విజయవంతం కావడం గురించి ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యానికి ఓకే చెప్పడం వల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా వికసిత్ భారత్ 2047 కంటే ఎంతో ముందుగానే ఆవిష్కృతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు నాగ భరత్ డాకా మాట్లాడుతూ 2030 నాటికి దేశం ఏడాదికి యాభై అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించగల స్థితికి చేరుకుంటుందని, స్కైరూట్‌లో డిమాండ్‌కు తగ్గట్టుగా నెలకు ఒక విక్రమ్-1ను తయారు చేసే సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంటామని అన్నారు. కేంద్ర బొగ్గు, పర్యావరణ శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డితోపాటు, వ్యోమగామి శుభాంశు శుక్లా, ఇన్‌స్పేస్ ఛైర్మన్ పవన్ గోయాంక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


