సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRAA) పై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సున్నం చెరువు కూల్చివేతల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ గురువారం ఘాటు విమర్శలు చేసింది.
‘‘రాజ్యాంగ హక్కులను హైడ్రా ఉల్లంఘించింది. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ ఫెన్సింగ్ ఎందుకేశారు?. గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు. ఫుల్ ట్యాంక్ లెవల్(FTL) నిర్ధారించకుండా ఎలా కూల్చేస్తారు?. అసలు ఎఫ్‌టీఎల్ నిర్ధారణే జరగనప్పుడు హద్దులు ఎలా నిర్ణయిస్తారు?. హద్దుల విషయంలో సర్వే చేసే దిశగా ఎందుకు ప్రయత్నించలేదు?..
సున్నం చెరువు సియేట్ కాలనీలో ఉన్న వారిపై హైడ్రా చర్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 300-A ప్రకారం హక్కుల ఉల్లంఘనకు దారి తీస్తాయి. సియేట్ కాలనీ వాసుల స్థలాలలో ఫెన్సింగ్ వేయడం, కూల్చి వేయడం లాంటివి చేయొద్దు’’ అంటూ హైడ్రాను హైకోర్టు హెచ్చరించింది.
నల్లచెరువు వద్ద ఉద్రిక్తత
కూకట్ పల్లిలోని నల్ల చెరువు వద్ద హైడ్రా గురువారం కూల్చివేతలకు దిగింది. అయితే.. అధికారుల్ని అడ్డుకునేందుకు ప్రకాష్ నగర వాసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో సిబ్బందితో వాగ్వాదానికి దిగగా.. ఉద్రిక్తత నెలకొంది.


