సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ(Officer on Special Duty) రాజశేఖర్‌రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది.
గురువారం జూబ్లీహిల్స్ పీఎస్‌లో రాజశేఖర్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. రెండు గంటలపాటు విచారణ జరిపి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు సిట్ అధికారులు. గత ఏడాది మార్చిలో ఈ కేసు నిందితుడు రాధా కిషన్(టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ) ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే కేసీఆర్ ఓఎస్డీని విచారించినట్లు తెలుస్తోంది.
రాధాకిషన్ తన స్టేట్‌మెంట్‌లో మాజీ సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించారు. కేసీఆర్ కుటుంబం సభ్యులు, పార్టీలో సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకు తాము పని చేశామని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే పదేళ్లపాటు కేసీఆర్‌కు ఓఎస్డీగా పని చేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ ప్రశ్నించింది.


