సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని అయ్యప్ప స్వాములు ముట్టడించారు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీసులు కూడా యూనిఫాం ధరించాలంటూ ఆంక్షలు విధించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ రూల్స్ ఉన్నాయంటూ స్వాములు మండిపడ్డారు. అయ్యప్ప స్వాములకు మద్దతుగా బీజేవైఎం కార్యకర్తలు కూడా డీజీపీ కార్యాలయానికి తరలివచ్చి ఆందోళనలో పాల్గొన్నారు.

అయ్యప్ప మాలతో ఆఫీసుకు రాకూడదంటూ ఇచ్చిన మెమోపై దీక్ష తీసుకున్న పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజీపీ కార్యాలయానికి వచ్చిన స్వాములు ఆఫీసులోనికి వెళ్లే ప్రయత్నంలో తోపులాట జరిగింది. ఈ నేపధ్యంలో పోలీసులు లాఠీ చార్జీ చేశారని అయ్యప్ప స్వాములు ఆరోపిస్తున్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వాములు భారీ ర్యాలీతో డీజీపీ కార్యాలయం ముట్టడికి తరలిరావడంతో వారిని పోలీసులు బారికేడ్లతో అడ్డుకోవలసి వచ్చింది. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా స్వాములు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో స్వాములకు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో పోలీసులు కొందరు అయ్యప్పలను అరెస్టు చేశారు. అయ్యప్ప దీక్ష ధరించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడాన్ని అయ్యప్ప స్వాములు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయ్యప్ప మాలలు వేసుకున్న పోలీసులు యూనిఫామ్ డ్రెస్ కోడ్ లేకుండా డ్యూటీకి రావద్దంటూ ఇటీవల ఆదేశాలు ఇచ్చారు. దీనికి నిరసనగా అయ్యప్పలు ఆందోళనకు దిగారు. అయ్యప్ప దీక్షాధారులకు పోలీస్ డ్రెస్ కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కాగా అయ్యప్ప దీక్షాధారులకు యూనిఫారం నిబంధనల్లో వెసులుబాటు ఇవ్వలేమని హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం నవంబర్ 20న ఒక ఉత్తర్వు జారీ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ, యూనిఫాం నిబంధనల్లో వెసులుబాటు కల్పించాలని కంచన్‌బాగ్ స్టేషన్‌కి చెందిన ఎస్సై ఎస్. కృష్ణకాంత్ వినతి చేశారు. సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ కె శ్రీకాంత్ ఈ అంశంపై స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఉత్తర్వుల ప్రకారం డ్రెస్ కోడ్ విషయంలో వెసులుబాటు కల్పించడం కుదరదని తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని ఆయన ఆ జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లకూ తెలియజేశారు.
ఇది కూడా చదవండి: TG: గ్రూప్ 2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట


