దేశంలోనే తొలి వాహనం
హైదరాబాద్‌కు చెందిన ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ కంపెనీ తయారీ
ఏఐ ఆధారితంగా పనిచేసే వాహనం
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణ రంగంలో మరో మేలి ముందడుగు పడింది. దేశంలోనే మొట్టమొదటి యాంటీ డ్రోన్ నిఘా వాహనం ‘ఇంద్రజాల్ రేంజర్’ఆవిష్కృతమైంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ కంపెనీ తయారు చేసిన ఈ అత్యాధునిక యాంటీ డ్రోన్ వాహనం ఏఐ ఆధారంగా పనిచేస్తుంది. కదులుతూ ఉండగానే డ్రోన్లను పసిగట్టడంతోపాటు వాటి గమనాన్ని పరిశీలించి మట్టుపెట్టగలదు.
దేశ సరిహద్దుల రక్షణతోపాటు మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలోనూ ఇవి కీలకం కానున్నాయి. దేశ సరిహద్దు భద్రతా దళాలు వీటి సాయంతో ఇప్పటికే 255 పాకిస్తానీ డ్రోన్లను కూల్చేయడం విశేషం. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఇటీవలే డ్రోన్ల సాయంతో ఆయుధాలను దేశ సరిహద్దులు దాటించి భారత్‌లోకి సరఫరా చేసిన నేపథ్యంలో ఇంద్రజాల్ రేంజర్‌కు ప్రాధాన్యం పెరిగింది.
డ్రోన్లను పసిగట్టి కూల్చేయగల ఆయుధ వ్యవస్థలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.. కానీ ఇవన్నీ ఒక చోట స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే పనిచేయగలవు. ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ తయారు చేసినవి మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. కదులుతుండగానే ఎగురుతున్న డ్రోన్లను గుర్తించగలవు. కృత్రిమ మేధతో ప్రమాదాన్ని అంచనా వేసి అవసరమైన సందర్భాల్లో వాటిని అడ్డుకుని కూల్చేయగలవు.

రక్షణ కవచాలు
ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ బుధవారం ఇంద్రజాల్ రేంజర్ వాహనాలను హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ సీఈఓ కిరణ్ రాజు మాట్లాడుతూ.. ‘ఇంద్రజాల్ రేంజర్ కూల్చే ప్రతి శత్రు డ్రోన్ దేశ అంతర్గత భద్రతను మరింత బలపరుస్తుంది. ప్రజల ప్రాణాలు కాపాడుతుంది. స్వతంత్రంగా పనిచేయగల వ్యవస్థ వీటి సొంతం. ఫలితంగా భద్రతాదళాలపై పనిభారం తగ్గుతుంది. దశాబ్దకాలం పరిశోధనల ఫలితంగా ఇంద్రజాల్ రేంజర్‌ను తయారు చేశాం.
ఏఐ, రోబోటిక్స్, అటానమస్ వ్యవస్థల మేళవింపుగా ప్రత్యేకమైన అటానమీ ఇంజిన్ ‘స్కైఓఎస్’ను అభివృద్ధి చేశాం’అని తెలిపారు. ఆర్మీ జనరల్ ఆఫీసర్, ఆర్మీ వార్ కాలేజీ మాజీ కమాండెంట్ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే మాట్లాడుతూ... ‘యువతకు సురక్షితమైన దేశం అవసరం. అంతర్జాతీయ నేర నెట్‌వర్క్‌ల నీడ వీరిపై పడకూడదు. ఇంద్రజాల్ రేంజర్ వంటివి టెక్నాలజీ యంత్రాలు మాత్రమే కాదు. మన పిల్లలు, రైతులు, భవిష్యత్తుకూ రక్షణ కవచాలు’అని పేర్కొన్నారు.


