హైవే టూరిజం | Tourism development as part of Telangana Rising Vision 2047 | Sakshi
Sakshi News home page

హైవే టూరిజం

Nov 27 2025 4:03 AM | Updated on Nov 27 2025 4:03 AM

Tourism development as part of Telangana Rising Vision 2047

తెలంగాణ రైజింగ్‌ విజన్‌–2047లోభాగంగా ప్రభుత్వ ప్రాధాన్య ప్రణాళిక

జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రతి 100 కిలోమీటర్లకు ఒక రిసార్ట్‌ నిర్మాణం 

విశ్రాంతి గదులు, ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు, రైతుల ఆధ్వర్యంలో ఆహారశాలలు, మోటల్స్‌ ఏర్పాటు 

వివిధ పర్యాటక కేటగిరీల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి

ప్రజారవాణా వ్యవస్థ అభివృద్ధికి ప్రణాళిక... అన్ని రవాణా సౌకర్యాల కోసం ఒకటే డిజిటల్‌ కార్డు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రైజింగ్‌ విజన్‌–2047లో భాగంగా పర్యాటకరంగ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా రంగంగా ఎంపిక చేసుకుంది. ఇందుకోసం అనేక వ్యూహాలతో ముసాయిదాను విడుదల చేసింది. అందులో హైవే టూరిజం గురించి ప్రస్తావించింది. 

రాష్ట్రంలోని ప్రధాన జాతీయ, రాష్ట్ర రహదారులపై రిసార్టుల ఏర్పాటు ఆర్థిక ప్రగతికి దోహదమవుతుందని పేర్కొంది. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక రిసార్టు, పిట్‌ స్టాప్‌లను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడే విశ్రాంతి గదులు, ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు, రైతులతో నడిపే ఆహారశాలలు, గృహ వసతిని తలపించేలా మోటల్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

ఆయా హైవేలకు సమీప మండలాల్లో లభించే స్థానిక వంటకాలు, హస్తకళలను ఈ మోటల్స్‌లో ప్రోత్సహించనుంది. అలా గే పర్యాటక అభివృద్ధి చర్యల గురించి కూడా ఈ ముసాయిదాలో ప్రతిపాదించింది. అందులోని ముఖ్య ప్రతిపాదనలు ఇలా.. 

» వరంగల్, హనుమకొండలో 10–15 వేల సీట్ల సామర్థ్యంతో కన్వెన్షన్లు నిర్మించాలి. భద్రకాళి చెరువు, కాకతీయ ఫోర్ట్‌ సర్క్యూట్‌ల వద్ద హోటళ్లతో వాటిని అనుసంధానించాలి. 
»    హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్‌లలో వసతి, మౌలిక సదుపాయాలు, హాల్స్‌ బుకింగ్‌ కోసం డిజిటల్‌ కనెక్టింగ్‌ వేదికలను ఏర్పాటు చేయాలి. 
»    హైదరాబాద్‌ వేదికగా అంతర్జాతీయ మెడికల్‌ ప్లాట్‌ఫాంను ఏ ర్పాటు చేయాలి. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లలోని ఆ స్పత్రుల అక్రెడిటేషన్‌లు, వైద్య చికిత్సలకు అవసరమయ్యే ధ రలతో కూడిన మెడికల్‌ టూరిజం చార్టర్‌ను రూపొందించాలి.  
»    వికారాబాద్, మెదక్‌లలో ఫారెస్ట్‌ స్పా రీట్రీట్‌ల ఏర్పాటు, నల్లమల కొండలు, పోచారం అభయారణ్యంలో ఎకో వెల్‌నెస్‌ సర్క్యూట్‌లను ఏర్పాటు చేయాలి. 
»    సంగారెడ్డి, నిజామాబాద్‌లలో లేక్‌ సైడ్‌ నేచర్‌ థెరపీ హబ్‌లను అభివృద్ధి చేయాలి. 
»    చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్, భువనగిరి, వరంగల్‌ కోటల వద్ద డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ జరిగేలా అభివృద్ధి చేయాలి. 
»    పోచంపల్లి, గద్వాల, నారాయణపేటలలో హెరిటేజ్‌ హోం స్టేలను ఏర్పాటు చేయాలి.  
»   హుస్సేన్‌సాగర్‌పై కయాకింగ్, భువనగిరి కోటపై స్కైవాక్, నెక్లెస్‌రోడ్డు చుట్టూ సైక్లింగ్‌ను అభివృద్ధి చేయాలి. 
»     ఫ్యూచర్‌ రెడీ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌లో భాగంగా టికెటింగ్, రూట్లు, పేమెంట్స్‌ను అనుసంధానించాలి. ఆరీ్టసీ, మెట్రో, ఎంఎంటీఎస్, పర్యాటక సర్క్యూట్లలో ప్రయాణాల కోసం ఏకీకృత డిజిటల్‌ కార్డును ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణాలను సులభతరం, నగదురహితం చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement