- రవికి విక్రయించిన వారిని గుర్తించడం అంత ఈజీ కాదు..!
- లావాదేవీ తర్వాత అంతర్ధానమైన ఖాతాలు
- రికార్డు చేసిన సినిమాల క్వాలిటీ పెంచే బాధ్యత
- ఔట్ సోర్సింగ్‌కు రవికి పోలీసు కస్టడీ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ‘ఐబొమ్మ’, ‘బపం’ వెబ్‌సైట్లు నడిపించిన ఇమ్మడి రవికి అనేక పైరసీ సినిమాలు విక్రయించిన వారిని గుర్తించడం అంత ఈజీ కాదని... దాదాపు అసాధ్యమని సైబర్ క్రైమ్ పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. అతడు టెలిగ్రాం యాప్ ద్వారా వీటిని ఖరీదు చేయడమే అందుకు కారణమని చెప్తున్నారు. రవి ఆరేళ్ల కాలంలో తన వెబ్‌సైట్లలో 21 వేలకు పైగా సినిమాలను పొందుపరిచాడు. వీటిలో ఏ ఒక్కటీ తాను నేరుగా పైరసీ చేయలేదు. మూవీ రూల్స్, తమిళ్ వన్ సహా అనేక పైరసీ వెబ్‌సైట్లలో ఉన్న సినిమాలను స్క్రీన్ రికార్డింగ్ చేసే వాడు. దీంతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలైన వాటినీ ఇదే విధానంలో రికార్డు చేసే వాడు. దీనికోసం రవి కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం (సీఎంఎస్) అనే సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసి వినియోగించాడు. ఇలా రికారి్డంగ్ చేసిన చిత్రాలు ఆయా సైట్లు, ఓటీటీల్లో విడుదలైన కొన్ని గంటల తర్వాత ఐబొమ్మతో పాటు దాని అనుబంధ వెబ్‌సైట్లలోకి వచ్చేవి.
టెలిగ్రాం యాప్స్ నుంచీ ఖరీదు
సోషల్‌మీడియా యాప్ టెలిగ్రాం వేదికగానూ పైరసీ చిత్రాల క్రయవిక్రయాలు జరుగుతుంటాయని, తాను ఆ రకంగానూ కొన్నింటిని కొన్నానని రవి పోలీసుల విచారణలో చెప్పారు. వివిధ రకాలైన ఐడీలతో ఈ యాప్‌లోకి ప్రవేశించే వ్యక్తులు పైరసీ సినిమాలను హైపర్ లింక్ ద్వారా పొందుపరుస్తారు. యూఎస్‌డీటీ, బిట్ కాయిన్ల రూపంలో వారికి చెల్లింపులు జరిపితే ఆ చిత్రాన్ని చూసే అవకాశం ఇస్తారు. ఇలా ఆ చిత్రాలను రవి ఖరీదు చేసి, రికార్డు కూడా చేశాడు. ఓ ఐడీ ద్వారా ప్రవేశించిన విక్రేత నిర్ణీత మొత్తం అందిన వెంటనే అంతర్ధానం అయిపోతాడు. ఈ కారణంగానే విక్రేత ఆచూకీ కనిపెట్టడం దాదాపు అసాధ్యం అని అంటున్నారు. రవి వెబ్‌సైట్లలో దాదాపు హెడ్‌డీ క్వాలిటీ సినిమాలే ఉంటాయి. దీన్ని చూసిన పోలీసులు అతడి వెనుక భారీ నెట్‌వర్క్ ఉంటుందని, సర్వర్లను హ్యాక్ చేసి ఈ సినిమాలు సంగ్రహిస్తాడని భావించారు. అయితే విచారణలో రవి బయటపెట్టిన అంశాలు ఈ అనుమానాలను పటాపంచలు చేశాయి. ఓ సినిమాను రికారి్డంగ్ చేసిన తర్వాత దాని ఆడియో, వీడియోల క్వాలిటీలను పెంచేవాడు. దీనికోసం కరేబియన్ దీవుల్లో ఉన్న కొందరితో ఔట్ సోర్సింగ్ విధానంలో ఒప్పందాలు
చేసుకున్నాడు.
మరో మూడు రోజుల పోలీసు కస్టడీ
రవిపై మొత్తం ఐదు కేసులు నమోదై ఉన్నాయి. ఈ నెల రెండో వారంలో పోలీసులు ఓ కేసులో అతడిని అరెస్ట్ చేసి ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. మరో వారం రోజులు అదనపు కస్టడీ కోరగా... మూడు రోజులకు అనుమతిస్తూ న్యాయస్థానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అతన్ని గురువారం చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని శనివారం వరకు విచారించనున్నారు. మరోవైపు మిగిలిన నాలుగు కేసుల్లో రవిని కోర్టు నుంచి ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్ పొందడం ద్వారా అరెస్టు చేయాల్సి ఉంది. రెండు కేసుల్లో ఈ వారెంట్ పొందిన అధికారులు ఒకదాంట్లో అరెస్టు చేశారు. ప్రస్తుత కస్టడీ ముగిసిన తర్వాత ఈ కేసులోనూ పోలీసు కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇదే పంథాలో మిగిలిన మూడు కేసుల్లోనూ చేయనున్నారు.
ఇంటర్‌నెట్ బొమ్మ, బలపాలే పేర్లు...
రవి నిర్వహించిన వెబ్‌సైట్లకు పెట్టిన పేర్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు క్లారిటీ వచ్చింది. ఐబొమ్మ పూర్తి స్వరూపం ఇంటర్‌నెట్ బొమ్మ. రవి స్వస్థలం విశాఖపట్నం. ఆ ప్రాంతంలో సినిమాను బొమ్మగా పిలుస్తుంటారు. తాను ఆ బొమ్మను ఇంటర్‌నెట్‌లో చూపిస్తున్నందుకే ఐబొమ్మ అనే పేరు పెట్టాడు. మరో వెబ్‌సైట్‌కు బలపం అని పేరు పెట్టాలని భావించి, డొమైన్‌లో వచ్చిన సాంకేతిక సమస్యతో దాని స్పెల్లింగ్ నుంచి ‘ఎల్’ తీసేసి ‘బపం’గా మార్చాడు.


