యువత, మహిళలు, రైతుల కోసం తెలంగాణ విజన్ డాక్యుమెంట్–2047లో వినూత్న ప్రణాళిక
ఈ మూడు రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక కార్యాచరణ
పారిశ్రామిక రంగానికి అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి... భారీగా ఉపాధి కల్పనే లక్ష్యం
మహిళలకు ఆర్థిక స్వావలంబన, కోటి మందిని కోటీశ్వరులుగా మార్చేందుకు ప్రాధాన్యత
వైవిధ్య పద్ధతుల్లో పంటల సాగు, మార్కెట్‌తో అనుసంధానంతో రైతులకు లాభాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధిని వేగవంతం చేసేలా భవిష్యత్ ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంట్–2047ను మూడు సూత్రాలతో సిద్ధం చేస్తోంది. మహిళలు, యువత, రైతులకు ఇందులో అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే రూపొందించిన ముసాయిదా నివేదికలో పలు ఆలోచనలను పొందుపర్చింది.
రాష్ట్ర జనాభాలో సగ భాగం ఉన్న మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం.. యువశక్తిని ప్రపంచ పారిశ్రామిక విధానానికి సన్నద్ధం చేసేలా నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి ఉపాధి బాట పట్టించడం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన రైతాంగానికి సాంకేతికతను విస్తృతం చేసి రైతన్న ఆదాయాన్ని భారీగా పెంచడం కోసం వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు పెంచుతామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో ప్రస్తావిస్తుండగా ఇప్పుడు తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌లో ఆ అంశం ఇతివృత్తంగానే అన్ని రంగాలకూ ప్రాధాన్యత పెంచుతూ ఈ నివేదికను సర్కారు రూపొందిస్తోంది.
మిలియనీర్లుగా మహిళలు..
తెలంగాణ విజన్ డాక్యుమెంట్–2047లో మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పట్టంకడుతోంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న సీఎం ప్రకటనలకు అనుగుణంగా విజన్ డాక్యుమెంట్‌లో మహిళల కోసం నాలుగు ప్రత్యేక అంశాలను ప్రస్తావించారు. బాలికల విద్యాభివృద్ధిలో భాగంగా ప్రతి ఆడపిల్లకు తొలి ప్రాధాన్యం చదువే అనే అంశాన్ని అందులో పొందుపర్చారు. ఇందుకు ఉపకా ర వేతనాలు, భద్రతను జోడించారు.
ఉపాధి అవకాశాల్లో మహిళల వాటాను భారీగా పెంచడం, సౌకర్యాల కల్పనకు ఒకే వేదిక ఏర్పాటు చేయడం, మహి ళా సాధికారతకు ఆర్థిక చేయూత, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధా నించడం లాంటి అంశాలకు ఈ డాక్యుమెంట్‌లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
మార్కెట్ డిమాండ్‌కు అనువైన పంటల సాగు...
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఆర్థికాభివృద్ధిలో ఈ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ విజన్ డాక్యుమెంట్‌లో రైతాంగానికి పెద్దపీట వేసింది. ప్రస్తుతమున్న 42 లక్షల టన్నుల ఉద్యాన పంటల సాగును మరింత పెంచనుంది.
మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులను మళ్లించడం.. పండిన పంట దిగుబడులను నేరుగా రైతులు విక్రయించేలా మార్కెట్ కనెక్టివిటీ పెంచడానికి ప్రాధాన్యత ఇవ్వనుంది. సాగులో అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను విస్తృతం చేసేలా 12 అంశాలతో కూడిన సుస్థిర వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేలా వ్యూహాత్మక ప్రణాళికను అమలు చేయనుంది.
నైపుణ్యాల తోట.. ఉపాధికి బాట..
అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక విధానాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలను భాగస్వాములను చేస్తూ యువతకు ఆధునిక పారిశ్రామిక విధానానికి అనుగుణమైన శిక్షణ ఇవ్వడంతోపాటు వారికి ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రత్యేక పాఠ్యాంశాన్ని రూపొందిస్తోంది.
స్కిల్ డెవలప్‌మెంట్, ఎంప్లాయిబులిటీ, ఉపాధితో కూడిన ఉన్నత విద్యను జోడించడమే లక్ష్యంగా కార్యక్రమాలను రచిస్తోంది. మరోవైపు యువతను క్రీడల వైపు ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేసే లక్ష్యంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. నిపుణులను, ప్రఖ్యాత క్రీడాకారులను భాగస్వాములను చేస్తూ సరికొత్తగా శిక్షణ ఇవ్వనుంది.


