రిజర్వుడ్ ధ్రువీకరణ డిక్లరేషన్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యాక పోటీలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి వారం రోజుల సమయమే కేటాయించారు. అయితే పోలింగ్ ముగియడానికి నిర్ణయించిన సమయానికి 44 గంటల ముందు ఎలాంటి ప్రచారం నిర్వహించడానికి అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
» రాత పూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వాడొద్దు..అదీ నిర్ణీత సమయం వరకే అనుమతి ఉంటుంది.
» ప్రచారానికి ఉపయోగించే కరపత్రాలు, పోస్టర్లు మొదలైన వాటి ముద్రణపైనా ఆంక్షలున్నాయని, వీటి ముద్రణదారుల వివరాలు, అడ్రస్ వంటివి తప్పకుండా వాటిపై పేర్కొనాలి.
» ఓటర్లకు ఏ రకంగానూ లంచం ఇచ్చేందుకు, అనుచితప్రవర్తనతో వారిని బెదిరించడం, భయపెట్టడం, దొంగ ఓట్లను ప్రోత్సహించేలా వ్యవహరించొద్దు.
» ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేసేవారు కుల ధ్రువీకరణ డిక్లరేషన్ సమర్పించాలి. షెడ్యూల్ తెగలకు చెందినవారు తెలంగాణకు సంబంధించిన ఏదైనా కమ్యూనిటీకి చెందినవారై ఉండాలి.
» గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులంతా నేరపూరిత చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన స్వీయ డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాలి.
విద్వేష భావాలు రెచ్చగొడితే అంతే...
ఎన్నికల లబ్ధి కోసం అభ్యర్థి లేదా అతడి అనుమతితో ఏజెంట్, ఇతరులు మతం, జాతి, కులం, వర్గం లేదా భాషా ప్రాతిపదికన ప్రజల మధ్య విభేదాల సృష్టి, వ్యక్తుల మధ్య విద్వేష పూరిత భావాలు లేదా దేశంలోని వివిధ తరగతుల మధ్య విద్వేష భావాలు రెచ్చగొట్టడం వంటి వాటిని కూడా అవినీతి చర్యగానే పరిగణిస్తామని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. విద్వేషాలతో రెచ్చగొట్టిన వారు ఒకవేళ గెలిచినా వారి సభ్యత్వం రద్దయ్యే పరిస్థితి ఎదురవుతుంది. ఎన్నికల నేరంగా పరిగణిస్తే మూడేళ్ల వరకు పొడిగించే జైలుశిక్ష, జరిమానా రెండూ విధిస్తారు.
నోటా...
పంచాయతీ ఎన్నికల్లోనూ నన్ ఆఫ్ ద అబోవ్(నోటా)ను అమలు చేయనున్నారు. బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పత్రాల ద్వారా నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో ‘నోటా’గుర్తును కూడా ప్రత్యేకంగా పొందుపరుస్తున్నారు. పోటీలో ఉన్న అభ్య ర్థుల్లో ఎవరికి ఓటు వేసేందుకు ఓటరు సంసిద్ధంగా లేకపోతే నోటాపై ముద్ర వేసేందుకు అవకాశం కల్పించారు.


