చెలామణిలో ఉన్న నోట్లలో 80% పాతవే
ఏటా 2,000 కోట్లకుపైగా నోట్ల డిస్పోజ్
ఇష్టారీతిన వాడకంతో తగ్గుతున్న జీవిత కాలం
సాక్షి, స్పెషల్ డెస్క్: మనం వాడుతున్న నోట్లలో అత్యధికం పాత నోట్లే ఉంటాయి. ఐదింటిలో ఒకటి మాత్రమే తళతళ మెరుస్తూ కొత్తది ఉంటోంది. దేశవ్యాప్తంగా చెలామణిలో ఉన్న నోట్లు, ఏటా కొత్తగా విడుదలవుతున్న నోట్ల సంఖ్య ఈ విషయాన్ని చెబుతోంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్
ఇండియా (ఆర్‌బీఐ) ఏటా డిస్పోజ్ చేస్తున్న పాత నోట్ల సంఖ్య ఎంతో తెలుసా? జస్ట్ 2,000 కోట్లకు పైగానే.
అజాగ్రత్తగా వాడకం
దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో 3,030 కోట్ల కొత్త నోట్లు రంగ ప్రవేశం చేస్తే.. 2,385 కోట్ల పాత నోట్లను ఆర్‌బీఐ డిస్పోజ్ (పారవేయడం) చేసింది. ఏడాదిలో డిస్పోజ్ అయిన నోట్ల సంఖ్య 12.27% పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో 884 కోట్ల నోట్లు డిస్పోజ్ అయ్యాయి. జనం ఏ స్థాయిలో నోట్లను అజాగ్రత్తగా వాడుతున్నారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
చేతులు మురికిగా ఉన్నా పట్టుకోవడం, ఇష్టం వచ్చినట్టు మడతపెట్టి జేబు, పర్సులో దూర్చడం వంటి కారణాల వల్ల నోట్ల జీవిత కాలం తగ్గుతోంది. ఉపయోగించలేని విధంగా ఉన్న పాత నోట్లు వివిధ బ్యాంకుల ద్వారా ఆర్‌బీఐకి చేరతాయి. ఆర్‌బీఐ వీటిని చిన్నచిన్న ముక్కలుగా చేసి ఇటుకల (బ్రిక్వెట్స్) మాదిరిగా కుదించి డిస్పోజ్ చేస్తుంది. ఇలా ఏటా 15,000 టన్నుల బ్రిక్వెట్స్ పేరుకుపోతున్నాయని కేంద్ర బ్యాంక్ వెల్లడించింది.
కాయినైజేషన్, యూపీఐ..
ఆర్‌బీఐ డిస్పోజ్ చేస్తున్న నోట్లలో సింహభాగం రూ.500 నోట్లు ఉంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో వీటి సంఖ్య 898 కోట్లుగా ఉంది. రూ.100 నోట్లు 583 కోట్లు ఉన్నాయి. డిస్పోజ్ చేస్తున్న రూ.20, రూ.10 నోట్ల సంఖ్య భారీగా తగ్గింది. ఈ రెండు డినామినేషన్లలో రెండేళ్లలో డిస్పోజ్ అయిన నోట్ల సంఖ్య 664 కోట్ల నుంచి 373 కోట్లకు పడిపోయింది. దీనికి కారణం వీటి స్థానంలో కాయిన్స్ వచ్చి చేరడంతోపాటు యూపీఐ వాడకం పెరగడమే.
అయినా నోట్ల వెల్లువ..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) రాకతో భారత్‌లో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. అయినప్పటికీ మన దేశంలో కరెన్సీ నోట్ల వాడకం ఏమాత్రం తగ్గడం లేదు. ఆర్‌బీఐ ఏటా వ్యవస్థలోకి కొత్తగా ప్రవేశపెడుతున్న నోట్లే ఇందుకు నిదర్శనం. 2022–23తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చి చేరిన కొత్త నోట్ల సంఖ్య 2,260 కోట్ల నుంచి 3,030 కోట్లకు ఎగబాకింది. అంటే ఏకంగా 34% అధికం అయ్యాయన్నమాట. ఈ మూడేళ్లలో రూ.500, రూ.100 విలువచేసే నోట్లే అత్యధికంగా వ్యవస్థలోకి వెల్లువెత్తుతున్నాయి.
పార్టికల్ బోర్డ్ తయారీలో..
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు పాడైపోయిన నోట్ల ముక్కలు లేదా బ్రిక్వెట్స్‌ను భూమిలో పాతిపెట్టడం లేదా కాలుస్తున్నాయి. నోట్ల తయారీ, ముద్రణలో వాడే సెక్యూరిటీ థ్రెడ్స్, ఫైబర్స్, సెక్యూరిటీ ఇంక్స్, ఇతర రసాయనాల వల్ల తలెత్తే పర్యావరణ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని.. నోట్ల ముక్కలు, బ్రిక్వెట్స్‌ను పారవేయడానికి బదులుగా బోర్డ్ ప్యానెల్స్, ఇంటీరియర్ డిజైన్ మెటీరియల్, పార్టికల్ బోర్డ్ ఫర్నిచర్, అకౌస్టిక్ అప్లికేషన్లలో వినియోగించవచ్చని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్, టెక్నాలజీ అధ్యయనం కనుగొంది. ఈ నేపథ్యంలో పారి్టకల్ బోర్డ్ తయారీ కంపెనీలతో ఇప్పటికే ఆర్‌బీఐ చర్చలు ప్రారంభించింది.
స్థూల–ఆర్థిక అంశాలే..
ప్రజల నుంచి డిమాండ్, పాడైన వాటి స్థానంలో కొత్తవి మార్చడం.. ఈ అంశాల ఆధారంగా ఒక సంవత్సరంలో ముద్రించాల్సిన నోట్ల పరిమాణం, విలువ ఆధారపడి ఉంటుంది. జీడీపీ అంచనా వృద్ధి, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, నగదు రహిత (డిజిటల్) చెల్లింపు పద్ధతుల్లో పెరుగుదల వంటి స్థూల–ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని చెలామణిలో ఉండే నోట్ల సంఖ్య పెరుగుదలను అంచనా వేస్తారు. ప్రజల వద్ద ఉన్న నోట్ల పరిమాణం, నోట్ల సగటు జీవితకాలం ఆధారంగా ఏటా కొత్త నోట్లను జారీ చేస్తారు.



