న్యూఢిల్లీ: ‘గతేడాది జరిగిన కరూర్ తొక్కిసలాటకు తమ పార్టీకి సంబంధం లేదని హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ సీబీఐ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. కరూర్ తొక్కిసలాటపై విజయ్ సోమవారం ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆరు గంటల సుదీర్ఘ విచారణ తర్వాత ఆయన సీబీఐ కార్యాలయం నుంచి తన నివాసానికి వెళ్లారు.
విచారణలో కరూర్ తొక్కిసలాటపై విజయ్ సీబీఐ అధికారులకు ఏం చెప్పి ఉంటారనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో విజయ్ కరూర్ తొక్కిసలాటకు తమ పార్టీ బాధ్యత వహించబోదని సీబీఐ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. సీబీఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన విజయ్‌ని.. తొక్కిసలాట ఘటనపై విచారణ అధికారులకు ఏం చెప్పారని మీడియా ప్రశ్నించింది. తొక్కిసలాట తీవ్రత తగ్గించేందుకు వేదికను విడిచివెళ్లానని తెలిపారు. ఇదే విషయాన్ని విజయ్ పలు పార్టీ బహిరంగ కార్యాక్రమాల్లో చెప్పుకొచ్చారు.
ఇక ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి కాలేదని, విజయ్ స్టేట్మెంట్‌ను వెరిఫై చేసిన తర్వాత మళ్లీ పిలుస్తామని సీబీఐ అధికారులు చెప్పినట్లు సమాచారం. ‘విజయ్‌ను విచారించడం పూర్తి కాలేదు. సంక్రాంతి పండుగ కారణంగా విచారణ ప్రస్తుతానికి వాయిదా వేశాం. పండుగ తర్వాత సమన్లు జారీ చేసి విచారణకు పిలుస్తామం’అని సీబీఐ విచారణ అధికారులు జాతీయ మీడియాకు చెప్పినట్లు తెలుస్తోంది.
మరోవైపు తమిళనాడు పోలీసులు మాత్రం కరూర్ తొక్కిసలాటకు విజయ్ కారణమని ఆరోపిస్తున్నారు. సభ నిర్వహించే సమయం కంటే ఆలస్యంగా వచ్చారని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సమయం గడిచే కొద్దీ అభిమానులు,పార్టీ కార్యకర్తలు విజయ్‌ను చూసేందుకు భారీ ఎత్తున గుమిగూడారు. ఊపిరాడడక జనసందోహాన్ని కట్టడి చేసే సమయంలో ఈ ఘోర జరిగినట్లు స్పష్టం చేస్తున్నారు. సభకు వచ్చిన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఆహారం, మంచినీరు,టాయిలెట్ సౌకర్యం కల్పించడంలో టీవీకే విఫలమైందన్నారు.
తొక్కిసలాటపై అధికార డీఎంకే పార్టీ కుట్రకు పాల్పడిందని విజయ్ ఆరోపించారు. డీఎంకే మాత్రం పోలీసుల వైఫల్యం వల్లే భారీ ప్రాణ నష్టం జరిగిందని విజయ్ ఆరోపణల్ని ఖండించింది. కాగా, గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ ప్రసంగించిన భారీ రాజకీయ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఇది ఇటీవలి తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా నిలిచింది.
#WATCH | Delhi: TVK Chief and actor Vijay leaves from Central Bureau of Investigation (CBI) office where he appeared for a probe into the Karur stampede. pic.twitter.com/0G7zmLQl6Q
— ANI (@ANI) January 12, 2026


