సాక్షి,హైదరాబాద్: కూకట్‌పల్లి అర్జున్ థియేటర్‌లో జరిగిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రదర్శనలో దుర్ఘటన చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్‌లో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీ స్టారర్ సినిమా చూస్తుండగా ఓ అభిమాని ఆకస్మికంగా కుప్పకూలి మృతి చెందాడు.
థియేటర్‌లో ఉన్న ఇతర ప్రేక్షకులు వెంటనే స్పందించి అతనిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు వెలువడేందుకు వైద్య పరీక్షలు, విచారణ కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో థియేటర్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మెగాస్టార్ అభిమానుల ఉత్సాహం మధ్య ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం అందరినీ కలచివేసింది.
కాగా, మృతుడు 12వ బెటాలియన్‌కు చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆనంద్ కుమార్‌గా గుర్తించారు. ఉదయం 11.30 గంటల షో చూడటానికి సినిమా థియేటర్‌కు వచ్చారు. సినిమా మధ్యలో, అకస్మాత్తుగా తన సీటులో కుప్పకూలిపోయాడు. తోటి ప్రేక్షకులు భయపడ్డారు. తర్వాత తేరుకుని వెంటనే అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు ఆనంద్ చనిపోయినట్లు ప్రకటించారు. గుండెపోటు మరణానికి కారణమని అనుమానిస్తున్నారు


