భర్త వేధింపులతో నవవధువు ఆత్మహత్య
ధారూరు: భర్త వేధింపులు భరించలేక, జీవితంపై విరక్తి చెందిన ఒక నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని గడ్డమీది గంగారంలో బుధవారం జరిగిన ఈ ఘటనపై ధారూరు సీఐ రఘురామ్ తెలిపిన వివరాలివి. గ్రామానికి చెందిన గంజి మల్లమ్మ, సాయప్పల చిన్న కూతురు శిరీష (21)కు పరిగి మండలం మల్లమోనిగూడేనికి చెందిన శివలింగంతో ఐదు నెలల క్రితం వివాహం చేశారు.
వంట బాగా చేయడం లేదంటూ, తనకన్నా తక్కువ చదువుకున్నావంటూ శివలింగం ఆమెను నిత్యం వేధించేవాడు. ఆమెను చితకబాదేవాడు. ఈక్రమంలో మంగళవారం కూడా భార్యాభర్తలు గొడవ పడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన శివలింగం భార్యను తీసుకెళ్లి పుట్టింట్లో వదిలేశాడు. ఆమె ఫోన్‌ను సైతం తీసుకుని తిరిగి వెళ్లిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లితో శిరీష జరిగిన విషయాన్ని చెప్పగా.. ‘అల్లుడితో ఉదయం మాట్లా డదాంలే’.. అని సర్దిచెప్పింది.
బుధవారం కూలి పనులకు వెళ్తూ కూతురికి ఫోన్ ఇచ్చి వెళ్లింది. శిరీష భర్తకు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయగా ‘నీవు నాకు అక్కర్లేదు.. అక్కడే చచ్చిపో’.. అంటూ చీదరించుకున్నాడు. ఈ మాటల తో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం ఇంటికి చేరుకున్న తల్లికి శిరీష ఉరేసుకుని కనిపించడంతో గుండెలు బాదుకుంది. ఫోన్‌లో రికార్డయిన సంభాషణల ఆధారంగా విచారణ జరిపి, కారకులను కఠినంగా శిక్షించాలని మల్లమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


