మొన్న అల్లు అర్జున్‌, ఇప్పుడు ప్రభాస్‌.. హరీశ్‌రావు సంచలన కామెంట్‌ | Ex minister Harish Rao Comments On the Raja Saab tickets Issue | Sakshi
Sakshi News home page

మొన్న అల్లు అర్జున్‌, ఇప్పుడు ప్రభాస్‌పై కక్ష.. హరీశ్‌రావు సంచలన కామెంట్‌

Jan 11 2026 2:51 PM | Updated on Jan 11 2026 3:31 PM

Ex minister Harish Rao Comments On the Raja Saab tickets Issue

తెలుగు చిత్ర పరిశ్రమ పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు  పలు విమర్శలు చేశారు. సినిమా రంగం అనేది తమ రాజకీయ కక్షలను తీర్చుకునేందుకు ఒక అడ్డాగా మార్చుకున్నారని ఆయన భగ్గుమన్నారు. ఒక సినిమాకు టికెట్‌ ధరలు పెంచి మరో సినిమాకు పెంచకపోవడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో వస్తుంది. మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు తెలియదు.. ఆ జీఓ ఎలా వచ్చిందో అంటారు. అసలు తన దగ్గరికే ఫైల్‌ రాలేదని నిస్సహాయంగా చేతులెత్తేస్తారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష కడితే.., మరో సంఘటనలో సీఎం పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయితే టికెట్‌ ధర రూ. 600కు పెంచుకోవచ్చని అనుమతి ఇస్తారా..? ఆపై వారం రోజుల పాటు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా..? అంటూ  హరీశ్‌రావు ప్రశ్నించారు. '50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న చిత్ర పరిశ్రమ వాతావరణాన్ని.. మీ అహంకారంతో, మీ పిచ్చి చేష్టలతో, మీ పగ ప్రతీకారాలతో, మీ చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారు.' అని ఆయన ఫైర్‌ అయ్యారు.

తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది..
సినిమా టికెట్‌ రేట్ల విషయంలో శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు.. అని హరీశ్‌రావు అన్నారు. సాక్షాత్తు ఒక క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే.. ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే.. అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరని ప్రశ్నించారు. 'మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో..? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో..?.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం.' అని ఆయన హెచ్చరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement