మూడు థర్మల్ ప్లాంట్ల అంచనాలు పెంచి బడా స్కామ్: మాజీ మంత్రి హరీశ్‌రావు
రూ.15 వేల నుంచి రూ.20 వేల కోట్లు దండుకునేందుకే..
లాభాలు తెచ్చే డిస్కమ్‌లు.. కమీషన్ల కోసం ప్రైవేటు పరం
త్వరలో రేవంత్ అంతర్రాష్ట్ర కుంభకోణాలు బయటపెడతాం
సాక్షి, హైదరాబాద్: పదేళ్లపాటు అన్ని వర్గాల సంక్షేమానికి చిరునామాగా ఉన్న తెలంగాణను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భారీ కుంభకోణాలకు కేంద్రంగా మార్చిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రూ.50 వేల కోట్ల అతి పెద్ద పవర్ స్కామ్‌కు రూపకల్పన చేసి 30 నుంచి 40శాతం కమీషన్లు దండుకునేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు.
రామగుండం, పాల్వంచ, మక్తల్‌లో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ల పేరిట రూ.15 వేల నుంచి రూ.20 వేల కోట్ల «అంచనాలు పెంచి భారీ స్కామ్‌కు పాల్పడుతోందని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం ప్రతీ చర్య వెనుకా ‘కమీషన్’అనే మిషన్ దాగుంటుందని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు బుధవారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
థర్మల్ పవర్ ప్లాంట్ల పేరిట బడా స్కామ్
‘రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు నిర్మాణానికి ఎన్‌టీపీసీ, జెన్‌కోలో తక్కువ రేటుతో ముందుకు వచ్చే వారికి అవకాశమిస్తామని చెప్పడం పెద్ద డ్రామా. ఒక మెగావాట్ ఉత్పత్తికి ఎన్‌టీపీసీకి రూ.12.23 కోట్లు, జెన్‌కోకు రూ.14 కోట్లు అవుతుందని ఇప్పటికే డీపీఆర్‌లు ఇచ్చాయి. గతంలో యాదాద్రి ప్లాంటును రూ.8.63 కోట్లు, భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను రూ.9.74 కోట్లకే నిర్మించాం. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం ఒక్కో మెగావాట్ ఉత్పత్తికి రూ.14 కోట్లు పెట్టేందుకు సిద్ధమవుతోంది. గతంలో యూనిట్ విద్యుత్‌కు రూ.5 వెచి్చంచడాన్ని తప్పుపట్టిన రేవంత్.. ఇప్పుడు రూ.8 నుంచి రూ.10 ఖర్చు చేసేందుకు సిద్దమవుతున్నాడు.
800 మెగావాట్ల ఒక్కో ప్లాంటు నిర్మాణ వ్యయం రూ.10,880 కోట్లు కాస్తా పూర్తయ్యే నాటికి రూ.15 వేల కోట్లకు చేరుతుంది. అదే జరిగితే యూనిట్ విద్యుత్ వ్యయం రూ.10కి పెరుగుతుంది. మూడు 800 మెగావాట్ల సామర్ద్యం కలిగిన యూనిట్లకు రూ.50 వేల కోట్లు ఖర్చు అయితే అందులో 80 శాతం అప్పు, మరో 20శాతం జెన్‌కో ఖర్చు చేస్తుంది. చెప్పులు ఎత్తుకుపోయే వారికి రూ.40వేల కోట్ల అప్పు, రూ.10వేల కోట్ల పెట్టుబడి ఎలా వస్తాయో చెప్పాలి. ఎన్‌టీపీసీ నుంచి యూనిట్ ధర రూ.4.88 నుంచి రూ.5.96 వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఎన్‌టీపీసీ 2400 మెగావాట్లు విద్యుత్‌ను యూనిట్‌కు రూ.4.12లకు సరఫరా చేస్తామని చెప్తున్నా ప్రభుత్వం తిరస్కరించింది’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. యాదాద్రి వపర్ ప్లాంట్‌ను తాము అధికారంలోకి వస్తే మూసేస్తామన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఇప్పుడు కొత్త థర్మల్ కేంద్రాలకు కేబినెట్‌లో ఆమోదం తెలిపితే.. ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు.
బీజేపీ డైరెక్షన్‌లో రేవంత్ యాక్షన్
‘లాభాలు తెచ్చే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కమ్)లను ప్రైవేటీకరణ చేసి కమీషన్లు దండుకునే కుట్రకు రేవంత్ తెరలేపాడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ డైరెక్షన్‌లోనే రేవంత్ యాక్షన్ చేస్తుండు. రేవంత్ చేసిన అంతర్రాష్ట్ర స్కామ్ వివరాల సేకరణ 90 శాతం పూర్తయింది. త్వరలో హైదరాబాద్ అండర్‌గ్రౌండ్ కేబుల్, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ స్కామ్‌లను కూడా ఆధారాలతోసహా బయటపెడతాం. వాటాలు, కమిషన్ల కోసం కేబినెట్ మీటింగ్‌లు పెట్టి పంపకాల్లో తేడా రావడంతో బయటకు వచ్చి సీఎం, మంత్రులు పరస్పరం నిందలు వేసుకుంటున్నారు.
పరిశ్రమల భూముల బదలాయింపులో రూ.5 లక్షల కోట్లు దండుకునే కుట్ర సీఎంతోపాటు కేబినెట్ సబ్ కమిటీది కూడా అని మంత్రులు చెబుతున్నారు. కాంగ్రెస్ కుంభకోణాలపై బీఆర్‌ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటి కాకుంటే ప్రభుత్వ కుంభకోణాలపై కేంద్రం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి’అని హరీశ్‌రావు చెప్పారు.


