సాక్షి,గుంటూరు: సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. క్రెడిట్ చోరీ చంద్రబాబు నిష్ణాతుడైతే.. తనలోని ఆరర్ట్స్‌ని ప్రదర్శించడంలో పవన్ కళ్యాణ్ దిట్టా అని ఎద్దేవా చేశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. క్రెడిట్ చోరీలో చంద్రబాబు నిష్ణాతుడు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్ట్ విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భూ కేటాయింపులు, అనుమతులు, పునరావాసం వంటి కీలక పనులు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలోనే జరిగాయి.
పదివేల ఎకరాలు కావాలని చంద్రబాబు కోరగా ప్రజలు తిరగబడ్డారని, తాము వచ్చాకే సరిపడా భూమికి కుదించాం. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు సహకరిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తోందని చంద్రబాబు చెప్పే మాటలు బడాయి మాత్రమే. మా హయాంలోనే అత్యధిక పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఎంఎస్ఎంఈల ద్వారా 32 లక్షల ఉద్యోగాలు వస్తే.. గత చంద్రబాబు కేవలం 9 లక్షల ఉద్యోగాలే వచ్చాయి.
కరెంటు, తాగునీరు సహా అనేక పన్నులు వేసి ప్రజలను బాధపెడుతున్న ఘనత చంద్రబాబుదే. ఛార్జీలు పెంచేదిలేదన్న ఆయన రూ.20 వేల కోట్లపైనే కరెంటు ఛార్జీలు పెంచారు. వైఎస్ జగన్ అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని విమర్శించిన చంద్రబాబు.. గత 18 నెలల్లోనే రూ.3.7 లక్షల కోట్ల అప్పు చేశారు. మరి దీన్ని ఏం అనాలో చంద్రబాబే చెప్పాలి.

పవన్ కళ్యాణ్ చాలా ఆర్ట్స్ ఉన్నాయి. రాజకీయాల్లో నటించటం కూడా పవన్‌కు తెలిసిన విద్యే. చంద్రబాబును అనవసరంగా పొగడటం, వైఎస్ జగన్‌ను తిట్టినందుకు రహస్యంగా గిఫ్టులు అందుకుంటున్నారు. అది కూడా ఒక ఆర్టే. జనసేన నెత్తిమీద ఎక్కి టీడీపీ వారు డాన్స్ చేస్తున్నారు. ముందుగా మీ కార్యకర్తలను కాపాడుకో పవన్.పవన్ కళ్యాణ్ ఎక్కడ పడితే అక్కడ డాన్స్ చేస్తున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామితో ఆటలాడొద్దని హితువు పలికారు.


