విమానయాన రంగానికి కొత్త రెక్కలు | Pm Modi Inaugurates Safran Aircraft Engine Servicing Centre In Hyderabad | Sakshi
Sakshi News home page

విమానయాన రంగానికి కొత్త రెక్కలు

Nov 27 2025 1:22 AM | Updated on Nov 27 2025 1:22 AM

Pm Modi Inaugurates Safran Aircraft Engine Servicing Centre In Hyderabad

ఎంఆర్‌ఓ కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న ప్రధాని మోదీ. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

హైదరాబాద్‌లో సఫ్రాన్‌ విమాన ఇంజిన్ల సర్వీసింగ్‌ కేంద్రం వర్చువల్‌ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ

దేశాన్ని ప్రపంచ ఎంఆర్‌ఓ కేంద్రంగా మార్చేందుకు సఫ్రాన్‌ కేంద్రం దోహదపడుతుందని వెల్లడ

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌ భారత్‌దేనని ప్రకటన 

పెద్ద కలలు కంటున్నాం..

అంతకన్నా పెద్ద పనులు చేస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నామని వ్యాఖ్య 

సంస్కరణల భారతావని పెట్టుబడిదారులకు

విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తోందన్న ప్రధాని  

పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ ప్రస్తుతం సంస్కరణల ఆధారిత దేశంగా మారి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఫ్రాన్స్‌కు చెందిన దిగ్గజ ఏరోస్పేస్, రక్షణరంగ సంస్థ సఫ్రాన్‌ రూ. 1,300 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లోని జీఎంఆర్‌ ఏరోస్పేస్‌ అండ్‌ ఇండ్రస్టియల్‌ పార్క్‌ సెజ్‌లో ఏర్పాటు చేసిన ‘లీప్‌’ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతు, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌ఓ) కేంద్రాన్ని (సఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ సర్వీసెస్‌ ఇండియా) ప్రధాని బుధవారం వర్చువల్‌గా ప్రారంభించారు.

వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్న ఈ కేంద్రంలో ఏటా 300 వాణిజ్య విమానాలకు చెందిన ‘లీప్‌’ఇంజిన్ల సరీ్వసింగ్‌ వీలవనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘నేటి నుంచి భారత విమానయాన రంగం కొత్త పుంతలు తొక్కనుంది. సఫ్రాన్‌ కంపెనీకి చెందిన ఈ కొత్త కేంద్రం భారత్‌ను ఒక గ్లోబల్‌ ఎంఆర్‌ఓగా మార్చేందుకు సహాయపడుతుంది’అని చెప్పారు.

ఈ కేంద్రం విమానాయన రంగంలో దేశ యువతకు ప్రత్యేకించి దక్షిణాది ప్రాంత యువతీయువకులకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందన్నారు. సఫ్రాన్‌ బోర్డు, అధికారుల బృందంతో జరిగిన చర్చల్లో భారత్‌పట్ల వారికి ఉన్న విశ్వాసం, ఆశాభావాన్ని గమనించినట్లు పేర్కొన్నారు. దేశంలో సఫ్రాన్‌ పెట్టుబడులు ఇదే వేగంతో కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా సఫ్రాన్‌ బృందానికి ప్రధాని అభినందనలు తెలియజేశారు.

 

సఫ్రాన్‌ సంస్థ ఏర్పాటు చేసిన విమాన ఇంజిన్‌ సర్వీస్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో కేంద్రమంత్రి  రామ్మోహన్‌ నాయుడు, సంస్థ ప్రతినిధులు  

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి... 
భారత విమానయాన రంగం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌లలో ఒకటని ప్రధాని మోదీ చెప్పారు. దేశీయ విమానయాన మార్కెట్‌ ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్‌గా ఉందని వివరించారు. దేశ ప్రజల ఆకాంక్షలు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయన్న ఆయన.. వాటి ఫలితంగా దేశంలో విమాన ప్రయాణానికి డిమాండ్‌ పెరుగుతోందన్నారు. డిమాండ్‌ను తీర్చడానికి విమానయాన సంస్థలు విమానాల సంఖ్యను పెంచుకుంటున్నాయని తెలిపారు. భారతీయ విమానయాన కంపెనీలు 1,500 కంటే ఎక్కువ కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చినట్లు మోదీ పేర్కొన్నారు.  

పెరిగిన ఎంఆర్‌ఓ అవసరం... 
విమానయాన రంగం వేగంగా విస్తరిస్తున్నందున ఎంఆర్‌ఓ కేంద్రాల అవసరం కూడా పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం మరమ్మతుల కోసం దేశంలో 85 శాతం విమానాలు విదేశాలకు వెళ్తున్నాయని.. ఈ పరిణామం విమానయాన సంస్థల ఖర్చుల పెరుగుదల, సరీ్వసుల్లో జాప్యానికి కారణమవుతోందని మోదీ పేర్కొన్నారు. ఇది దేశ విమానయాన రంగానికి ఏమాత్రం మంచిది కాదని.. అందుకే ప్రపంచంలోని ప్రధాన ఎంఆర్‌ఓ కేంద్రాల్లో ఒకటిగా భారత్‌ను నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

తొలిసారిగా ఒక అంతర్జాతీయ సంస్థ భారత్‌లో డీప్‌ లెవెల్‌ సరీ్వసింగ్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తోందని మోదీ తెలియజేశారు. సఫ్రాన్‌ అందించే అంతర్జాతీయ స్థాయి శిక్షణ, విజ్ఞాన బదిలీ, భారతీయ సంస్థలతో భాగస్వామ్యం రాబోయే ఏళ్లలో మొత్తం ఎంఆర్‌ఓ వ్యవస్థకు కొత్త ఊపు, దిశను ఇచ్చే శ్రామిక శక్తిని తయారు చేసేందుకు సహాయపడుతుందని ప్రధాని చెప్పారు. 

డిజైన్‌ ఇన్‌ ఇండియా.. 
‘డిజైన్‌ ఇన్‌ ఇండియా’ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని.. ఈ నేపథ్యంలో భారత్‌లో విమాన ఇంజిన్, విడిభాగాల తయారీ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రధాని మోదీ సఫ్రాన్‌ బృందాన్ని కోరారు. ఏరోస్పేస్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌లో సఫ్రాన్‌ కంపెనీ విస్తృతంగా పనిచేస్తోందన్న ప్రధాని.. ప్రొపల్షన్‌ వ్యవస్థల డిజైన్, తయారీ కోసం కూడా భారత నైపుణ్యాలు, అవకాశాలను ఉపయోగించుకోవాలని కంపెనీని కోరారు. ‘మేం పెద్ద కలలు కంటున్నాం. అంతకంటే పెద్ద పనులు చేస్తున్నాం. ఉత్తమ ఫలితాలను అందిస్తున్నాం’అని ప్రధాని పేర్కొన్నారు. సులభతర వ్యాపారానికి భారత్‌ ప్రాధాన్యం ఇస్తోందని మోదీ చెప్పారు. 

రక్షణ రంగంలోనూ 74 శాతం ఎఫ్‌డీఐ.. 
ప్రైవేటు రంగానికి అవకాశంలేని రక్షణ వంటి రంగాల్లోనూ ఇప్పుడు 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు అనుమతిచి్చనట్లు ప్రధాని మోదీ తెలిపారు. అంతరిక్ష రంగంలోనూ కీలక విధానాన్ని అవలంబించినట్లు వెల్లడించారు. ఈ చర్యలు ప్రపంచానికి ‘భారత్‌ పెట్టుబడులను స్వాగతిస్తుంది.. ఆవిష్కరణలను స్వాగతిస్తుంది’అనే స్పష్టమైన సందేశాన్ని పంపాయన్నారు.

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలు అంతర్జాతీయ తయారీదారులను భారత్‌లో తయారీ వైపు ఆకర్షించాయని ప్రధాని చెప్పారు. తమ పాలనలో 40 వేలకుపైగా నిబంధనలను తగ్గించి జాతీయ ఏకగవాక్ష విధానం ద్వారా అనుమతులను మంజూరు చేస్తున్నట్లు వివరించారు. జీఎస్టీ సంస్కరణలు, ఫేస్‌లెస్‌ ట్యాక్స్‌ అసెస్‌మెంట్, కొత్త కారి్మక కోడ్‌లు, దివాలా కోడ్‌ వంటి చర్యల ఫలితంగా భారత్‌ ఇప్పుడు ప్రపంచ దేశాలకు చెందిన పెట్టుబడిదారులకు ఒక విశ్వసనీయ భాగస్వామిగా, ఒక ప్రధాన మార్కెట్‌గా, వేగంగా దూసుకుపోతున్న తయారీ కేంద్రంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. 

తెలంగాణ వృద్ధికి ‘సఫ్రాన్‌’మైలురాయి: సీఎం రేవంత్‌రెడ్డి 
సఫ్రాన్‌ సంస్థ తమ కార్యకలాపాల విస్తరణకు తెలంగాణను ఎంచుకోవడం రాష్ట్ర వృద్ధికి ఒక మైలురాయి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశంలో ‘లీప్‌’ఇంజిన్‌ల తొలి ఎంఆర్‌వో కేంద్రం ఇదేనన్నారు. ఈ కేంద్రంలో వెయ్యి మంది సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇది రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలకు ఊతమిస్తుందని చెప్పారు. రఫేల్‌ యుద్ధ విమానాల్లో వినియోగించే ఎం88 సైనిక ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతుల కోసం సఫ్రాన్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న మరో ఎంఆర్‌ఓకు శంకుస్థాపన చేసుకున్నామని సీఎం రేవంత్‌ వెల్లడించారు.

భారత వైమానిక దళం, భారత నావికాదళానికి ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. భారత్‌లోని ప్రధాన ఏరోస్పేస్, డిఫెన్స్‌ హబ్‌గా హైదరాబాద్‌ మారిందన్నారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఎంఎస్‌ఎంఈ విధానం దేశంలోనే అత్యుత్తమని చెప్పారు. సఫ్రాన్, బోయింగ్, ఎయిర్‌ బస్, టాటా, భారత్‌ ఫోర్జ్‌ వంటి సంస్థలు హైదరాబాద్‌ను తయారీ, పరిశోధన, అభివృద్ధి కోసం ఎంచుకున్నాయని సీఎం తెలిపారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో ఎగుమతులు గత ఏడాది రెట్టింపు అయ్యాయని వ్యాఖ్యానించారు.

9 నెలల్లో రూ.30,742 కోట్లకు చేరుకున్నట్లు చెప్పారు, మొదటిసారిగా మన ఫార్మా ఎగుమతులను ఈ రంగం అధిగమించిందన్నారు. 100 ఐటీఐలను ఏటీఎస్‌లుగా మార్చామని, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ విమానాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 30 వేల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో తెలంగాణ రాష్ట్ర విజన్‌ను డిసెంబర్‌ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్‌ 2047 గ్లోబల్‌ సమ్మిట్‌కు అందర్నీ ఆహ్వనిస్తున్నట్లు సీఎం తెలిపారు.

బెంగళూరు–హైదరాబాద్‌ను డిఫెన్స్, ఏరోస్పేస్‌ కారిడార్‌గా ప్రకటించాలని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంతి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సఫ్రాన్‌ గ్రూప్‌ చైర్మన్‌ రాస్‌ మెకలెన్స్, సీఈవో, డైరెక్టర్‌ ఒలివర్‌ అండ్రీస్, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్స్‌ సీఈవో స్టీఫెన్‌ క్యూయల్, జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ గ్రంథి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement