నేటి నుంచి తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు
మూడు రోజుల పాటు స్వీకరణ
ఆశావహులకు పరీక్ష
పోటీకి అర్హతలు, అనర్హతలు ఇవే...
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల సందడంతా పల్లెసీమలకు చేరింది. గురువారం పంచాయతీల వారీగా రిటర్నింగ్ అధికారుల ద్వారా ఎలక్షన్ నోటీస్ విడుదలచేసి నోటీస్ బోర్డుపై అతికించడంతో నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. గురువారం నుంచి మూడురోజుల పాటు తొలి విడత ఎన్నికలకు (సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు) ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 11న తొలిదశలో 189 మండలాల్లో 4,236 సర్పంచ్, 37,440 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మొత్తం మూడుదశల్లో (డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో) ఈ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు ముగిశాక.. 30న వాటిని పరిశీలించి, అదేరోజు సాయంత్రం చెల్లుబాటయ్యే నామినేషన్ల జాబితాను వెల్లడిస్తారు. వాటిపై ఏమైనా అభ్యంతరాలుంటే డిసెంబర్ 1న అప్పీలు చేసుకుంటే, 2న వాటిని పరిష్కరిస్తారు. 3న మధ్యాహ్నం 3 గంటల్లోగా ఉపసంహరణలు ముగిశాక, ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. తొలి విడత నామినేషన్ల స్వీకరణకు జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
క్లస్టర్ కేంద్రాల్లో..
ప్రతి గ్రామంలో కాకుండా మూడు, నాలుగు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యు ల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా క్లస్టర్ కేంద్రాల్లోనే నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్వోలు), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా (ఏఆర్వోలు) గెజిటెడ్ హోదా కలిగిన అధికారులనే నియమించారు.
ప్రభు త్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సూపరింటెండెంట్ స్థాయి అధికారులు సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీచేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్‌పత్రంతోపాటే డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. సర్పంచ్ పదవికి పోటీచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.వెయ్యి, ఇతరులు రూ.2 వేలు డిపాజిట్‌చేయాలి. వార్డు సభ్యుడి పదవికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నామినేషన్ రుసుం కింద రూ.250, ఇతరులు రూ.500 చెల్లించాలి.
అభ్యర్థులు డిపాజిట్‌ను నగదురూపంలో ఆర్వోకు చెల్లిస్తే రసీదు ఇస్తారు. ఆ రసీదును నామినేషన్‌పత్రానికి జోడించాలి. అభ్యర్థులు తప్పనిసరిగా పంచాయతీలో ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదై ఉండాలి. నామినేషన్ల స్వీకరణ మొదలు కానుండడంతో గ్రామాల్లో పోటీకి ఆశావహులు సన్నాహాలు చేసుకుంటున్నారు.
అర్హతలివీ...
» నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి అభ్యర్థి 21 ఏళ్ల వయసు పూర్తి చేసుకుని ఉండాలి.
» » ఎస్టీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో అభ్యర్థులు తెలంగాణకు సంబంధించిన షెడ్యూల్డ్ తెగలుగా ప్రకటించిన ఏదేని ఒక కులం, తెగకు (కమ్యూనిటీకి) చెందిన వారై ఉండాలి.
» ఎస్సీలు, బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్డ్ కులాలు లేదా వెనుకబడిన తరగతులుగా ప్రకటించిన సామాజిక వర్గానికి చెందినవారై ఉండాలి.
అనర్హతలు...
» క్రిమినల్ కేసుల్లో శిక్ష పడితే పోటీకి అనర్హులు. శిక్ష ముగిసిన తేదీ నుంచి ఐదేళ్లపాటు ఈ అనర్హత వర్తిస్తుంది.
» పౌరహక్కుల పరిరక్షణ చట్టం–1955 ప్రకారం శిక్ష పడినవారు అనర్హులు.
» తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని 22, 23, 24 సెక్షన్ల ప్రకారం అనర్హులై ఉండకూడదు.
» మతిస్థిమితం లేనివారు, చెవిటి లేదా మూగవారు పోటీకి అనర్హులు.
» దివాళా తీసిన లేదా దివాళా నుంచి వెలుపలికి రాని వ్యక్తిగా కోర్టు నిర్ణయించిన వారు లేదా అందుకు దరఖాస్తు చేసుకున్న వారు.
» ఏదైనా పారితోíÙకం పొందుతూ గ్రామ పంచాయతీ తరఫున లేదా దానికి వ్యతిరేకంగా లీగల్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్న వారు.
» నేర శిక్షాస్మృతి–1973 ప్రకారం మేజిస్ట్రేట్ గా ఆ గ్రామంలోని ఏదైనా ప్రాంతంపై అధికార పరిధి కలిగి ఉన్నవారు.
» ప్రస్తుత లేదా గత ఆర్థిక సంవత్సరంలో గ్రామపంచాయతీకి బకాయి పడి, ఆ బకా>యి చెల్లించాలని బిల్లు/నోటీస్ ద్వారా తెలియజేసినా నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించని వారు.
» గ్రామ సహాయకునిగా (వీఆర్‌ఓ)గా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారి లేదా ఉద్యోగిగా కాని లేదా స్థానిక సంస్థల్లో, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందుతున్న ఏదైనా సంస్థలో ఉద్యోగిగా ఉన్నవారు.
» పార్లమెంట్ లేదా అసెంబ్లీ ద్వారా చట్టబద్ధత పొందిన ఏదైనా సంస్థలో ఆఫీస్ బేరర్‌గా ఉండకూడదు.
» అవినీతి చర్యలకు పాల్పడినందుకు కేంద్రం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగించిన తేదీ నుంచి ఐదేళ్ల వరకు పోటీకి అనర్హులు.
» గతంలో జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించనందుకు లేదా సరైన పద్దతిలో సమర్పించనందుకు ఎన్నికల సంఘం ద్వారా అనర్హులుగా ప్రకటించినవారు పోటీకి అనర్హులు.
బ్యాంక్ ఖాతా తెరవాల్సిందే...
ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు వీలుగా ఎన్నికల్లో చేసే ఖర్చు నిమిత్తం ప్రతీ అభ్యర్థి ప్రత్యేకంగా ఏదో ఒక జాతీయ బ్యాంక్‌లో ఖాతా తెరవాలి. నామినేషన్ దాఖలు సమయంలో సంబంధిత రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా అభ్యర్థి బ్యాంక్ ఖాతా వివరాలు తప్పకుండా తెలియజేయాలి. ఆ ఖాతానుంచే అభ్యర్థి తన మొత్తం ఎన్నికల వ్యయాన్ని ఖర్చుచేయాలి. గతానికి భిన్నంగా ఈసారి పోటీలో ఉన్న అభ్యర్థులు తమ రోజువారీ ఖర్చు వివరాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓ)కు సమర్పించాలి.


