జిల్లా బాధ్యతల అప్పగింతపై స్థానిక నేతల కినుక
కొన్ని చోట్ల మంత్రుల సిఫారసులకు ఆమోదం.. మరికొన్ని చోట్ల పట్టించుకోని అధిష్టానం
జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఎంపిక వ్యవహారం అధికార కాంగ్రెస్‌లో కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కొన్ని చోట్ల మంత్రుల సిఫారసుల మేరకు డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేయగా, మరికొన్ని చోట్ల మంత్రుల సిఫారసులను అధిష్టానం పట్టించుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో కొందరు ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు కాగా, మరికొన్ని చోట్ల పట్టించుకోలేదని ఈ నియామకాలు చెబుతున్నాయి.
అయితే, తనకు అనుకూలంగా ఉండే ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు డీసీసీ పదవులు ఇప్పించుకోవడంలో సీఎం రేవంత్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించారని, కీలక మంత్రులైన భట్టి, ఉత్తమ్, పొంగులేటి లాంటి వారి మాటలు కూడా చెల్లుబాటు కావడం, కొన్నిచోట్ల సామాజిక న్యాయం పేరుతో కొందరు నేతలను ఎంపిక చేయగా, విప్‌గా ఉన్న ఎమ్మెల్యేకే డీసీసీ బాధ్యతలిచ్చారు. అయితే డీసీసీలను భవిష్యత్‌లో క్రియాశీలం చేయాలని భావిస్తున్న అధిష్టానం ఈ పదవుల కోసం తీవ్ర కసరత్తు చేసింది.
ఏకంగా ఏఐసీసీ నుంచి వేరే రాష్ట్రాలకు చెందిన నేతలను పరిశీలకులుగా పంపింది. వారి సమక్షంలోనే బహిరంగ సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ జరిపింది. ఆ తర్వాత ఏఐసీసీ పరిశీలకులు పంపిన పేర్లను షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ షార్ట్‌లిస్ట్ పేర్లపై మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంది. సీఎం రేవంత్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌లను ఢిల్లీకి పిలిపించి చర్చించింది. ఆ తర్వాత డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. ఇంత కసరత్తు జరిగినా డీసీసీ నియామకాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వీరి నాయకత్వంలో అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుందోననే ఆందోళన కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
» మహబూబ్‌నగర్ డీసీసీ పదవి ఈసారి కూడా తనకే వస్తుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి ధీమాగా ఉన్నారు. కానీ సంజీవ్ ముదిరాజ్‌ను నియమించడంతో జి.మధుసూదన్‌రెడ్డి, ఆయన అనుచరుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వనపర్తి డీసీసీ అధ్యక్షుడిగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డిని నియమించడంపై ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి నారాజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి లేకుండానే మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయానికి మేఘారెడ్డి భూమి పూజ చేయడం గమనార్హం.
» నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా కాటిపల్లి నగేశ్‌రెడ్డి ఎంపికపై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఆయన తన నియోజకవర్గానికి చెందిన బాడ్సి శేఖర్‌గౌడ్ కోసం ప్రయత్నం చేశారు. కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జుర్జున్ కోసం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పట్టుబట్టి సాధించారు. మల్లికార్జున్ లక్ష్మీకాంతారావు అనుచరుడు. అయితే ఇప్పటివరకు వరుసగా రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్న కైలాస్ శ్రీనివాస్‌రావును మరోసారి కొనసాగించేందుకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గట్టి ప్రయత్నం చేసినా అది సఫలం కాలేదు.
» ఉమ్మడి నల్లగొండ జిల్లా విషయానికొస్తే.. సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనుకూల వ్యక్తిని డీసీసీ అ«ధ్యక్షునిగా నియమించారు. నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సిఫారసుకు వ్యతిరేకంగా డీసీసీ అధ్యక్షున్ని నియమించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం తాను సిఫారసు చేసిన వ్యక్తికి ఇవ్వకపోయినా, కొత్తగా నియమించిన అధ్యక్షుని విషయంలో మంత్రికి వ్యతిరేకత కూడా లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
» ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు వర్గానికి చెక్ పెట్టేందుకు డీసీసీ అధ్యక్షుడిగా మంత్రి గడ్డం వివేక్, ఎమ్మెల్యే వినోద్ సన్నిహితుడిని ఎంపిక చేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కుమురంభీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న విశ్వప్రసాద్‌రావు, సీనియర్లను పక్కనబెట్టి కొత్తగా ఆత్రం సుగణకు అవకాశం ఇచ్చారు. ఆమె 2024లో పార్టీలో చేరింది. సుగుణకు ఉన్నతస్థాయిలో ఉన్న అండదండలతో స్థానికులను పట్టించుకోలేదనే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నరేశ్‌జాదవ్‌ను ఎంపిక చేయగా, పార్టీలో రెడ్డి వర్గం నుంచి పలువురు నాయకులు పోటీ పడి నిరాశ చెందారు.
» సంగారెడ్డి డీసీసీ కోసం 46 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో జహీరాబాద్‌కు చెందిన ఉజ్వల్‌రెడ్డి, నారాయణఖేడ్‌కు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహరెడ్డిల పేర్లను ప్రముఖంగా తీసుకున్నారు. కానీ అధినాయకత్వం సంగారెడ్డి డీసీసీ నియామకాన్ని పెండింగ్‌లో పెట్టింది. కాగా జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితోపాటు, మరికొందరు ముఖ్యనాయకులు ఉజ్వల్‌రెడ్డి వైపు మొగ్గు చూపగా, జహీరాబాద్ ఎంపీ సురేశ్òÙట్కార్ వర్గం వ్యతిరేకించినట్టు తెలుస్తోంది.సమన్వయం కుదరకపోవడంతో అధిష్టానం ఈ పదవిని పెండింగ్‌లో పెట్టింది.
» రంగారెడ్డి డీసీసీ పదవి కోసం 43 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్థానికేతరుడికి డీసీసీ పీఠాన్ని కట్టబెడుతున్నారనే ప్రచారంతో 15 మంది ఆశావహులు ఇటీవల ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. డీసీసీని ప్రకటించకపోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది.
» వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్‌కు అనూహ్యంగా దక్కింది. కొండా దంపతులు గోపాల నవీన్‌రాజ్, మీసాల ప్రకాశ్ పేర్లు సూచించగా, రెండో వర్గం తాజా మాజీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పేరు సిఫారసు చేశారు. ఇరువర్గాలకు కాకుండా మహ్మద్ అయూబ్‌కు ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష పదవి మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు ఆశించగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తన అనుచరుడు బట్టు కర్ణాకర్ ఇప్పించుకున్నారన్న చర్చ ఉంది.
– సాక్షి నెట్‌వర్క్


