రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లపై వైఖరిని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, గిరిజన శాఖ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణ డిసెంబర్ 10కి వాయిదా వేసింది.
సంగారెడ్డి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్ల కోసం ఈ నెల 23న జిల్లా కలెక్టర్ (జిల్లా ఎన్నికల అధికారి) జారీ చేసిన గెజిట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆందోల్ మండలం రాంసాన్‌పల్లికి చెందిన మాజీ సర్పంచ్ కొరబోయిన ఆగమయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.మాధవీదేవి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగ, చట్టబద్ధమైన, న్యాయ సూత్రాలను కచ్చితంగా పాటించిన తర్వాత బీసీల జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరారు.
వన్ మ్యాన్ కమిషన్ సూచించిన మేరకు 42 శాతానికి బదులుగా రాష్ట్రవ్యాప్తంగా 17.087 శాతం పంచాయతీ స్థానాలను కేటాయించడం సబబుకాదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీలకు ఒక్క స్థానాన్నీ కేటాయించకపోవడం ఆందోళనకరమన్నారు. ఎన్నికలకు జారీ చేసిన గెజిట్ కులాల మధ్య అసమానతను రుజువు చేస్తోందని చెప్పారు. ఈ కారణంగా అధిక జనాభా ఉన్న బీసీల హక్కులకు భంగం వాటిల్లుతుందని, అలాగే వారి ప్రాతినిధ్యం తీవ్రంగా తగ్గుతుందని నివేదించారు.
ఎన్నికల రిజర్వేషన్ల జీవో నిలిపివేయండి
హైకోర్టులో దాఖలైన పిటిషన్
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి మార్గదర్శకాలను వెల్లడిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ఒకట్రెండు రోజుల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ ధర్మాసనం ముందుకు రానుంది. తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం, శ్రీ మడివాల మాచదేవ రజకుల సంఘంతోపాటు మరో ముగ్గురు ఈ పిటిషన్ వేశారు. ‘బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల కోసం పంచాయతీరాజ్ శాఖ జీవో 46ను జారీ చేసింది.
పంచాయతీ రాజ్ చట్టం–2018లోని సెక్షన్ 9(4) ప్రకారం.. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో బీసీ–ఏ, బీ, సీ, డీలకు కేటగిరీ వారీగా రిజర్వేషన్లు కల్పించలేదు. అనంతరామన్ కమిషన్ నివేదికను ప్రభుత్వం విస్మరించింది. దీంతో బీసీల్లోని నాలుగు వర్గాలు అంటే.. మున్నూరు కాపు, ముదిరాజ్, యాదవ, గౌడ వర్గాలే స్థానిక సంస్థల్లో రాజకీయ అధికారాన్ని పొందుతాయి. ఇతర పేద బీసీ వర్గాల వారు పేదలుగానే మిగిలిపోతారు. చట్టప్రకారం బీసీ రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలి. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించేలా సర్కార్‌ను ఆదేశించాలి’అని కోరారు.


