దేశ లగ్జరీ హౌసింగ్ మార్కెట్ ఏటేటా పెరిగిపోతోంది. రియల్ ఎస్టేట్ రీసెర్చ్ సంస్థ అనరాక్ రీసెర్చ్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. గత మూడేళ్లలో ఇతర అన్ని రెసిడెన్సియల్ కేటగిరీలను అధిగమించింది. రూ.1.5 కోట్లకు పైబడి ధర కలిగిన గృహాలు దేశంలోని టాప్ ఏడు నగరాల్లో సగటున 40% ధరల పెరుగుదలను నమోదు చేశాయి. దేశ రాజధాని ప్రాంతం (NCR) 72% ఎదుగుదలతో అత్యధిక ధరల పెరుగుదల నమోదు చేసింది. ఈ విభాగంలో ఇక్కడ 2022లో చదరపు అడుగు సగటు ధర రూ. 13,450 ఉండగా 2025 నాటికి రూ. 23,100 లకు పెరిగింది.
ఈ బడ్జెట్ విభాగంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) 43 శాతంతో రెండవ స్థానంలో ఉండగా, బెంగళూరు 42 శాతం పెరుగుదలతో రెండో స్థానంలో నిలిచింది. మన భాగ్య నగరం హైదరాబాద్ ఈ ర్యాలీలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. 2022–2025 మధ్య లగ్జరీ సెగ్మెంట్‌లో 41% పెరుగుదలను నమోదు చేసి, ధరల పెరుగుదల పరంగా టాప్ పెర్ఫార్మర్లలో ఒకటిగా నిలిచింది.
హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఇలా..
ప్రస్తుతం హైదరాబాద్లో వివిధ కేటగిరీలలో ఇళ్ల సగటు ధరలు ఇలా ఉన్నాయి. లగ్జరీ హౌసింగ్ విభాగంలో చదరపు అడుగుకు రూ.14,200 గా ఉంది. మిడ్-రేంజ్ / ప్రీమియం కేటగిరిలో చదరపు అడుగుకు సగటున రూ.8,420 ధర నడుస్తోంది. ఇక అఫోర్డబుల్ విభాగంలో చదరపు అడుగు ధర రూ.5,235 వద్ద ఉంది.
ధరల పెరుగుదల పరంగా భాగ్య నగరం బలమైన పనితీరు చూపుతున్నప్పటికీ, ఇప్పటికీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా, అందుబాటు ధరలు కలిగినదిగానే ఉంది.


