ఇంటి​కి లగ్జరీ లుక్‌.. కిటికీలోనే ఉంది కిటుకు! | How Modern Glass Windows Transform Homes House construction tips | Sakshi
Sakshi News home page

ఇంటి​కి లగ్జరీ లుక్‌.. కిటికీలోనే ఉంది కిటుకు!

Jan 11 2026 7:44 AM | Updated on Jan 11 2026 3:14 PM

How Modern Glass Windows Transform Homes House construction tips

ఇంటీరియర్‌లో అద్దాలు భాగమైపోయాయి. రంగులు, మొక్కలు, ఫర్నీచర్‌ మాత్రమే కాదు విండోలతోనూ ఇంటికి లగ్జరీ లుక్‌ వస్తుంది. ఇన్సులేషన్‌ కిటికీలతో ఇంటి లోపల వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుందని, కాలానికి అనుగుణంగా ఉష్ణోగ్రతలను నియంత్రించే గుణం ఉండటమే వీటి ప్రత్యేకత అని ఇంటీరియర్‌ నిపుణులు చెబుతున్నారు. దుమ్ము, ధూళిలతో పాటు శబ్ధాబ్దాలను ఇంటి లోపలికి రాకుండా ఈ కిటికీలు అడ్డుకుంటాయని చెబుతున్నారు.

కాలుష్యం, రణగొణ ధ్వనులతో బిజీబిజీగా ఉంటే మెట్రో నగరాలలో నిశ్శబ్ద, ప్రశాంతమైన వాతావరణం కావాలని కోరుకోవడం సహజమే. అందుకే గృహ కొనుగోలుదారులు హరిత భవనాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో బిల్డర్లు అపార్ట్‌మెంట్ల డిజైనింగ్‌ దశ నుంచే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లగ్జరీ లుక్‌తో పాటు ఆహ్లాదభరిత వాతావరణం కల్పించేందుకు పెద్ద కిటికీలను ఎంపిక చేస్తున్నారు. గ్లేజింగ్, సీలింగ్‌ సాంకేతికతలతో తయారైన కిటికీలు మార్కెట్‌లో హాట్‌ ఫేవరేట్‌గా మారాయి.

సంప్రదాయ సింగిల్‌ గ్లేజ్‌ విండోలతో బయటి నుంచి శబ్దాలు, దుమ్ముధూళి వంటివి సులభంగా ఇంటి లోపలికి వస్తాయి. అలాగే అపార్ట్‌మెంట్లలో పైఅంతస్తులలోని నివాసితుల హడావుడి, పరిసర ప్రాంతాల్లోని ట్రాఫిక్, నిర్మాణ సంబంధిత ధ్వనులు కిటికీ ఫ్రేమ్‌ల చుట్టూ ఉన్న చిన్న ఓపెనింగ్‌ల ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి. దీంతో నివాసితులకు చికాకు, ఒత్తిడి వంటివి కలుగుతాయి. అందుకే ఈ రోజుల్లో చాలామంది కస్టమర్లు మెరుగైన ఉష్ణోగ్రతలను నిర్వహించే ఇన్సులేటింగ్‌ గ్లాస్‌ కిటికీలను ఎంచుకుంటున్నారు.

రెండు లేదా అంతకంటే ఎక్కువ గాజు షీట్లతో తయారైన ఈ విండోల మధ్యలో గాలి లేదా ఇతర వాయువుతో నిండి ఉంటుంది. దీంతో వేసవి కాలంలో ఇంటి లోపల వాతావరణం వెచ్చగా ఉండకుండా శీతాకాలంలో వేడిని బయటకు వెళ్లకుండా ఇన్సులేషన్‌ను అందిస్తాయి. ఫలితంగా ఇన్సులేటింగ్‌ గ్లాస్‌ కిటికీలు ఉన్న ఇంట్లో ఏసీలపై ఆధారపడటం తగ్గుతుంది.

లామినేటెడ్‌ గ్లాస్‌ కిటికీలకు ధ్వనిని నియంత్రించే గుణం ఉంటుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ గాజు పొరలతో తయారయ్యేదే లామినేటెడ్‌ గ్లాస్‌లు. ఇవి హానికారక యూవీ కిరణాలను అడ్డుకుంటుంది. ఇంటి లోపల అధిక వేడిని తగ్గిస్తుంది. ఎక్కువ కాలం మన్నిక కోసం టెంపర్డ్‌ గ్లాస్‌ ఉత్తమమైంది. దీనికి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే శక్తి ఉంటుంది. వీటిని ఎక్కువగా బహుళ అంతస్తుల భవనాలలో వినియోగిస్తుంటారు.

ఇది చదివారా? ఇళ్లు మారేవారికి.. ఇదో మంచి మార్గం!

మీ ఇల్లు అధిక ధ్వనులు విడుదలయ్యే ప్రాంతాలైన విమానాశ్రయం, పారిశ్రామిక పార్కులు, వాణిజ్య ప్రాంతాలు, రద్దీగా ఉండే వీధులకు చేరువలో ఉంటే.. మీ ఇంట్లో తప్పనిసరిగా అకౌస్టిక్‌ విండోలను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే అదనపు సౌండ్‌ ఫ్రూఫింగ్‌ వీటి సొంతం. బహుళ గాజులు, ఇతరత్రా పదార్థాలతో తయారైన ఈ కిటికీలు బయటి శబ్దాలను ఇంటి లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. దీంతో ఎళ్లవేళలా ఇంటి లోపల వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement