తరచూ ప్రాంతాలు మారే వారికోసం రెంటల్ విధానం
ఫర్నిచర్ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకూ అద్దెకు
కొనటంతో పోలిస్తే గణనీయంగా ఆదా
గిగ్ వర్కర్లు, ఐటీ, స్టార్టప్ ఉద్యోగుల్లో కొత్త ట్రెండ్
సామగ్రిని కొని... ప్రతిసారీ తరలించాలంటే సమస్యే
విక్రయిద్దామన్నా 30–50 శాతం వరకూ నష్టపోయే చాన్స్
శాశ్వతంగా ఒకేచోట ఉండేవారికి మాత్రం కొనుగోలే బెటర్
రవి ఏడాది కిందటే బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాడు. మళ్లీ ఇపుడు రవి కంపెనీ బెంగళూరుకు వెళ్లమంటోంది. మరి ఇలా మారినపుడల్లా ఇల్లు మారాలి సరే...! ఇంటితో పాటు మొత్తం సామగ్రిని తరలించుకోవాలా? ఇలా ఫర్నిచర్‌ను, ఎల్రక్టానిక్ వస్తువుల్ని తీసుకెళ్లటం తలకుమించిన పని. పైపెచ్చు కొన్ని పాడవుతాయి. పోనీ ఇక్కడే కొన్నింటిని విక్రయించేద్దామంటే... కొన్న ధరలో కనీసం 50 శాతం కూడా రాదాయె!. పైపెచ్చు అక్కడ మళ్లీ కొత్తవి కొనుక్కోవాలి. మరి దీనికి పరిష్కారమేంటి?
అందుకేనేమో! రవి బెంగళూరు మాదిరిగానే హైదరాబాద్‌కు వచ్చాక కూడా పెద్దగా సామగ్రి తెచ్చుకోలేదు. కావాల్సిన ముఖ్యమైన వస్తువుల్ని నెలవారీ అద్దెకు తీసుకున్నాడు. ఇంటద్దెతో పాటే వాటికీ ప్రతినెలా కొంత చెల్లిస్తున్నాడు. ఇపుడు మారేటపుడు వాటిని ఇక్కడే ఇచ్చేసి... మళ్లీ బెంగళూరులో వేరే వస్తువులు అద్దెకు తీసుకోవచ్చునని అనుకున్నాడు. అందుకే తనకు ఇలా మారటం పెద్దగా ఇబ్బంది అనిపించటం లేదు. మరి ఈ పద్ధతి ఎవరికి మంచిది? నానాటికీ ప్రాచుర్యం పొందుతున్న ‘రెంటింగ్ ఫర్నిచర్’ విధానం ఎవరికి అనుకూలం? ఇదంతా వివరించేదే ఈ ‘వెల్త్ స్టోరీ’
నవతరం ఉద్యోగాల్లో విపరీతంగా మార్పులొస్తున్నాయి. కొన్నాళ్లు ఓ చోట ఇంకొన్నాళ్లు మరో చోట పనిచేయాల్సి వస్తోంది. ఐటీ, స్టార్టప్‌లలో పని చేసేవారు, గిగ్ వర్కర్లు ప్రతి 18– 30 నెలలకు వేరే నగరాలకు మారుతున్నారు. ఇలా మారినప్పుడల్లా పాత ఫర్నిచరును విక్రయిద్దామంటే 30–50% నష్టపోవాల్సి వస్తోంది. కొత్త ఊళ్లో సాధారణంగా ఓ డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం ఫర్నిచర్ వగైరా కొనుక్కోవాలంటే సుమారు రూ.2– 3 లక్షల వరకు అవు తోంది. అదే అద్దెకు తీసుకుంటే నెలకు రూ. 4,000 నుంచి రూ. 6,000 వరకు కడితే సరిపోతోంది. ఇక సెక్యూరిటీగా డిపాజిట్ చేయాల్సి న మొత్తం పెద్దగా ఉండటం లేందు. ఉన్నా.. చాలా తక్కువ. పైపెచ్చు గడువు తీరాక వెనక్కి తిరిగి వస్తుంది. దీనివల్ల ముందస్తుగా పడే భారం గణనీయంగా తగ్గుతుంది.
మెయింటెనెన్స్ భారం ఉండదు..
సొంతంగా కొనుక్కున్న ఫర్నిచరుకు, ఉపకరణాలకు సమస్యలేవైనా వస్తే రిపేర్లు చేయించేందుకు కంపెనీలు, టెక్నీషియన్ల వెంట పడాల్సి వస్తుంది. వాళ్లు వచ్చే దాకా నమ్మకం ఉండదు. వారు తీరా వచ్చి, ఎస్టిమేషన్ చెబితే, రిపేరు కోసం పెట్టే ఖర్చుతో పోలిస్తే పాత దాన్ని ఎంతో కొంతకు ఎక్స్ఛేంజీకి పెట్టేసి, కొత్తదే కొనుక్కోవచ్చు కదా అనే ఫీలింగూ కలుగుతుంది. అంటే ఒక రకంగా వేలు పోసి కొనుక్కున్న వస్తువుకు రిపేరు వస్తే మనశ్శాంతి లేకుండా పోవడంతో పాటు పర్సుకూ ఫ్రెష్‌గా చిల్లుపడే పరిస్థితి ఉంటోంది. ఇలా కొనుక్కునే బదులుగా అద్దెకే తీసుకుంటే.. ఈ రిపేర్లు గట్రా వచ్చినప్పుడు, సమాచారం ఇస్తే, బాదరబందీ అంతా సదరు కంపెనీయే చూసుకుంటుంది. ఏసీ బ్రేక్‌డౌన్ అయ్యిందా. కంపెనీయే మారుస్తుంది. వాషింగ్ మెషీన్ సమస్య వచ్చిందా. ఉచితంగా సర్వీస్ అందిస్తుంది. మరమ్మత్తుల తలనొప్పి గానీ రీసేల్ గురించి ఆందోళన గానీ చెందనక్కర్లేదు.

పరిస్థితిని బట్టి నిర్ణయం..
ఫర్నిచర్, గృహోపకరణాలను అద్దెకు తీసుకోవాలా లేదా కొనుక్కుంటే మంచిదా అనేది పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 24– 30 నెలలకు మించి మారే అవసరం లేకపోతే అద్దెకు తీసుకోవడం కన్నా కొనుక్కోవడమే మంచిది. ఎందుకంటే అంత సుదీర్ఘ వ్యవధిలో కొనుగోలు కోసం ఖర్చు పెట్టే దానికన్నా అద్దె రూపంలోనే ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. పైగా రీసేల్ చేసే అవకాశం గానీ సొంతం చేసుకునే పరిస్థితి గానీ ఉండదు. సొంతిల్లు ఉండి, ఒకే చోట చోటే ఉద్యోగం చేస్తూ స్థిరపడిన వారికైతే అద్దెకన్నా కొనుక్కోవటమే శ్రేయస్కరం.
చూసుకోవాల్సిన విషయాలివీ..
అద్దెకు తీసుకునేటప్పుడు చూసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా బయటకు చెప్పని రహస్య చార్జీలేమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. అలాగే గడువుకన్నా ముందుగానే తిరిగి ఇచ్చేస్తే భారీగా పెనాల్టీలేవైనా ఉంటాయేమో కనుక్కోవాలి. సాధారణంగా వాడకం వల్ల పాడవడం కాకుండా ఇతరత్రా ఏవైనా కారణాలతో పాడైతే విధించే డ్యామేజీ చార్జీలు ఏ స్థాయిలో ఉంటాయనేది కూడా చూసుకోవాలి. అలాగే మొదటి విడత తర్వాత రెంటు ఎంత మేర పెరుగుతుందో తెలుసుకోవాలి. షరతులు మొదలైనవన్నీ క్షుణ్నంగా తెలుసుకుని స్మార్ట్‌గా నిర్ణయం తీసుకోవాలి.


