సాక్షి, హైదరాబాద్/ఢిల్లీ: తెలంగాణ ఈగల్ టీమ్ దేశ రాజధానిలో గురువారం భారీ ఆపరేషన్ చేపట్టి సూపర్ సక్సెస్ అయ్యింది. ఏకకాలంలో పలు చోట్ల సోదాలు నిర్వహించి.. 50 మందిని అదుపులోకి తీసుకుంది. వీళ్లంతా నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న నైజీరియన్లని తేలింది.
ఢిల్లీ పోలీసుల(సీసీఎస్) సహకారంతో తెలంగాణ ఈగల్ టీం ఈ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. వంద మంది స్థానిక పోలీసులు, 124 మంది ఈగల్ టీం సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. సుమారు 20 ప్రాంత్లాలో సోదాలు జరిపింది. తనిఖీల్లో డ్రగ్ కింగ్‌పిన్, డ్రగ్ సేల్ గర్ల్స్, సెక్స్ వర్కర్స్, మ్యూల్ అకౌంట్ హోల్డర్లు పట్టుబడ్డారు. వీళ్ల నుంచి భారీగా మత్తు పదార్థాలు, డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా ఈగల్ టీం వరుసగా మెరుపు దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు లింకుల నేపథ్యంలోనే తాజా ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పాటు గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, విశాఖలోనూ స్థానిక పోలీసుల సహకారంతో అంతరాష్ట్ర ఆపరేషన్స్ చేపట్టినట్లు సమాచారం.


