న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. 13 ఏళ్ల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయనగర్‌లో 2.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ శీతాకాలంలో ఢిల్లీలో చలిగాలులు వీచడం ఇదే తొలిసారని, 2013 తర్వాత ఇదే అత్యల్ప ఉష్ణోగ్రతని ఐఎండీ వెల్లడించింది. 2013 జనవరి 7న పాలెంలో 2.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 1967 జనవరి 11న పాలెంలో 2.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇది ఆల్‌టైమ్ రికార్డ్. ఆదివారం నగరంలోని అనేక ప్రాంతాల్లో అత్యంత శీతల గాలులు వీచాయి. రిడ్జ్ స్టేషన్‌లో 3.7 డిగ్రీలు, లోధిరోడ్‌లో 4.6 డిగ్రీలు, ఢిల్లీ ప్రధాన వాతావరణ కేంద్రం ఉన్న సఫ్దర్‌గంజ్‌లో ఉష్ణోగ్రత 4.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజధానిలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీలు ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.


