వృద్ధ్ధ దంపతుల నుంచి రూ.14.85 కోట్ల దోపిడీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వృద్ధ దంపతులు భారీ సైబర్ మోసానికి గురయ్యారు. డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.14.85 కోట్లు దోచేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘరానా మోసం బయటకు వచి్చంది. 81 ఏళ్ల ఓం తనేజా, ఆయన భార్య, డాక్టర్ అయిన 77 ఏళ్ల ఇందిర దశాబ్దాల పాటు అమెరికాలో పనిచేశారు. భారత్‌కు తిరిగి వచ్చి 2016 నుంచి దక్షిణ ఢిల్లీలో నివసిస్తున్నారు. వారి పిల్లలు విదేశాల్లోనే స్థిరపడ్డారు.
దంపతుల పరిస్థితిని, ఒంటరితనం, వయస్సు, ఆరోగ్య సమస్యలను ముందే తెలుసుకున్న నిందితులు వారిని బెదిరించి పెద్ద ఎత్తున డబ్బు దోచుకోవాలని పథకం పన్నారు. డిసెంబర్ 24న మధ్యాహ్నం 12 గంటలకు, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారినంటూ ఒక వ్యక్తి తనేజాకు కాల్ చేశాడు. వారి ఇంటినుంచి అశ్లీల కాల్స్ వెళ్లాయని, 26 మంది తనకు ఫిర్యాదు చేశారని చెప్పాడు.
దంపతులు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, మహారాష్ట్రలో ఎఫ్‌ఐఆర్ నమోదైందని బెదిరించాడు. కేసును మొబై పోలీసులకు బదిలీ చేస్తున్నామని చెప్పి.. అనంతరం కాల్‌ను వీడియో కాల్ మోడ్‌లోకి మార్చాడు. పోలీసు యూనిఫాంలో ఉన్న విక్రాంత్‌సింగ్ రాజ్‌పుత్ అనే వ్యక్తి లైవ్‌లోకి వచ్చాడు. వృద్ధులు రూ.500 కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని బెదిరించాడు. వెంటనే ముంబైకి రావాలని హెచ్చరించాడు. తన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, తాము రాలేమని చెప్పడంతో.. డిజిటల్ అరెస్టు చేస్తున్నామని చెప్పాడు.
డిసెంబర్ 24 నుంచి జనవరి 9 వరకు వీడియో కాల్ ఆన్‌లోనే ఉంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని, చివరికి అమెరికాలో ఉన్న వారి పిల్లలకు కూడా చెప్పవద్దని హెచ్చరించాడు. డబ్బులు బదిలీ చేయాలని తనేజా దంపతులను డిమాండ్ చేశాడు. మొత్తం మీద, వారినుంచి రూ.14.85 కోట్లు తీసుకున్నారు. ఇదంతా ఆర్‌బీఐ నుంచి వాపస్ వస్తుందని నమ్మబలికారు. వారి వెరిఫికేషన్ 97 శాతం పూర్తయిందని చెప్పి జనవరి 8న మరో రూ. 50 లక్షలు డిమాండ్ చేశారు. జనవరి 9న కాల్స్ ఆగిపోవడంతో దంపతులు పోలీసులను ఆశ్రయించారు.


