రూ. 7,280 కోట్లు కేటాయింపు
కేబినెట్ గ్రీన్ సిగ్నల్
స్వావలంబన దిశగా మోదీ సర్కార్ అడుగులు
న్యూఢిల్లీ: కీలక రంగాల్లో అత్యావశ్యకంగా మారిన అరుదైన భూఅయస్కాంత ఖనిజాల సేకరణపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. వీటి దిగుమతుల కోసం చైనాపై ఆధారపడడటం మానేసి అరుదైన ఖనిజాల రంగంలో స్వావలంబన దిశగా ముందడుగు వేయాలని కేంద్రం కంకణం కట్టుకుంది. ఇందులోభాగంగా భూఅయస్కాంతాల గనుల తవ్వకం, శుద్ధి, స్వచ్ఛమైన ఖనిజాల తయారీకి సంబంధించి రూ.7,280 కోట్లతో నూతన పథకాన్ని ప్రారంభించాలన్న ప్రతిపాదనకు ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది.
ఈ పథకానికి రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్(ఆర్‌ఈపీఎంఎస్) అని పేరు పెట్టింది. విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్, వైమానిక రంగం, రక్షణ పరికరాల్లోని కీలక భాగాలను ఈ భూఅయస్కాంత ఖనిజాలతోనే తయారుచేస్తారు. దీంతో వీటికి విపరీతమైన కొరత ఏర్పడింది. డిమాండ్ తగ్గ సరఫరా సాధించడంతోపాటు స్వావలంబనే లక్ష్యంగా ఈ పథకాన్ని మొదలుపెట్టనున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. కేబినెట్ భేటీ నిర్ణయాలను ఆయన తర్వాత మీడియాకు వెల్లడించారు.
ఔత్సాహిక కంపెనీల కోసం అంతర్జాతీయ బిడ్డింగ్
అంతర్జాతీయ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఔత్సాహిక కంపెనీలను ఆహ్వానిస్తారు. వీటి నుంచి చివరకు ఐదు సంస్థలను ఎంపికచేస్తారు. ఒక్కో కంపెనీకి 1,200 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని లక్ష్యంగా నిర్దేశిస్తారు. ఏడేళ్ల కాలానికి కాంట్రాక్ట్ అప్పగిస్తారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలు తొలి రెండేళ్లలోపు పూర్తిస్థాయిలో తయారీయూనిట్‌ను స్థాపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐదేళ్లలోపు భూఅయస్కాంతాల తయారీ, విక్రయం, ఎగుమతి మొదలెట్టాలి.
రూ.7,280 కోట్ల పథకంలో రూ.6,450 కోట్లను విక్రయాల ప్రోత్సాహకాల కింద కేటాయించారు. 6,000 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్య సాధన కోసం మరో రూ. 750 కోట్లను మూలధన సబ్సిడీగా కేటాయించారు. భారత్‌లో ఏటా విద్యుత్ వాహనాలు, సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన రంగం, పారిశ్రామిక ఉపకరణాలు, ఎల్రక్టానిక్స్ గృహోపకరణాల్లో భూఅయస్కాంతాల వినియోగం పెరుగుతోంది. దీంతో వీటి డిమాండ్ వచ్చే ఐదేళ్లలో రెట్టింపు కావొచ్చని ప్రభుత్వం అంచనావేస్తోంది.
అంతర్జాతీయంగా భూఅయాస్కాంత ఖనిజాల తవ్వకం, శుద్ధి, స్వచ్ఛ లోహాల తయారీ రంగంలో చైనా గుత్తాధిపత్యం కొనసాగుతోంది. భారత్‌కు ఏటా 5,000 మెట్రిక్ టన్నుల భూఅయస్కాంతాల అవసరం ఉంది. అయితే ఏడు కీలక భూఅయస్కాంతాలు, వాటి ఉపఉత్పత్తుల ఎగుమతి కోసం ప్రత్యేక లైసెన్సులు తప్పనిసరి అంటూ ఏప్రిల్ 4న చైనా కఠిన నిబంధనలు అమల్లోకి తేవడంతో భారత్‌సహా ప్రపంచదేశాలకు వీటి కొరత విపరీతంగా ఏర్పడింది. దీంతో భారత్ ఇలా భూఅయస్కాంతాల్లో ఆత్మనిర్భరత దిశగా అడుగులేస్తోంది.
ఏమిటీ భూఅయస్కాంతాలు?
తక్కువ ఉద్గారాలు, తక్కువ ఇంధన వినియోగం, మెరుగైన సామర్థ్యం, వేగం, దృఢత్వం, వేడిని తట్టుకోవటం వంటి గుణాలతో కూడిన పరిజ్ఞానంతో తయారైన ఉపకరణాల్లో భూఅయస్కాంతాలనే వాడతారు. అందుకే వీటికి అంతటి డిమాండ్. విద్యుత్, కాంతి సంబంధ, అయస్కాంత, ఉత్ప్రేరక అప్లికేషన్లలో వీటిన ఉపయోగిస్తారు. ఇవి శుద్ధ లోహాల రూపంలో లభించవు. ముఖ్యంగా యురేనియం, థోరియం వంటి రేడియోధారి్మక పదార్థాలతో కలిసి మిశ్రమాలుగా లభిస్తాయి.
వీటిని వేరు చేసి, శుద్ధి చేయటం చాలా కష్టమైన పని. భారత్‌లోనూ దాదాపు 72 లక్షల టన్నుల భూఅయస్కాంత నిల్వలున్నాయి. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి తీరప్రాంత రాష్ట్రాల్లోని మోనోజైట్ ఇసుకలో ఈ నిల్వలు అధికంగా ఉన్నాయి. పశి్చమబెంగాల్, జార్ఖండ్, గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్రలోనూ ఇవి ఉన్నాయి. కొత్తరకం ఎల్రక్టానిక్ వస్తువులు, మోటార్లు, ఎనర్జీ టెక్నాలజీ వస్తువులు, స్పీకర్లు, హెడ్‌ఫోన్లు, ప్రింటర్లు, సీడీ/డీవీడీ డ్రైవ్‌లు, సెన్సార్లు, రాకెట్లు, పవర్‌స్టీరింగ్, విండో లిఫ్ట్, సీట్ మోటార్‌లలోనూ వీటిని వాడతారు.


