సిద్దిపేట తర్వాత ఎనిమిది కిలోమీటర్ల వరకు పూర్తయిన రైల్వే ట్రాక్
నత్తనడకన మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు నిర్మాణం
భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో జాప్యం ఫలితం
కనీసం మట్టి పనులు కూడా పూర్తిస్థాయిలో చేపట్టలేని పరిస్థితి
గౌరీభట్ల నరసింహమూర్తి సిద్దిపేట, సిరిసిల్లల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగుతోంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌ను నేరుగా అనుసంధానించే కలను సాకారం చేయడంతోపాటు సిద్దిపేటకు రైల్వే సౌకర్యం కల్పించే ఉద్దేశంతో 2016లో ప్రధాని మోదీ గజ్వేల్‌లో శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు దాదాపు పదేళ్లు గడుస్తున్నా నేటికీ పూర్తికాలేదు. కనీసం ట్రాక్ ఏర్పాటుకు వీలుగా భూమిని చదును చేసే ఎర్త్‌వర్క్‌తోపాటు భూసేకరణ ప్రక్రియ సైతం కొన్నిచోట్ల మొదలవలేదు.
సిద్దిపేట వరకు రైలు కూత పెట్టినా..
మేడ్చల్ సమీపంలోని మనోహరాబాద్ స్టేషన్ నుంచి మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి గజ్వేల్ మీదుగా సిద్దిపేటకు చేరుకుంటుంది. ఆ తర్వాత సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో పనులు జరగాల్సి ఉంది. అయితే సిద్దిపేట వరకు పనులు పూర్తి కావడంతో 2023 అక్టోబర్‌లో రైలు సర్వి సులను ప్రారంభించారు. కానీ ఆ తర్వాత సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో నిర్వాసితులకు పరిహారం పూర్తిగా విడుదల చేయకపోవడంతో నేటికీ ఆ ప్రాంత భూములు రైల్వే అదీనంలోకి రాలేదు.
పనులు చేసేందుకు వెళ్తే రైతులు దాడులకు దిగుతుండటంతో రైల్వే అధికారులు అటువైపు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సిరిసిల్ల జిల్లా పరిధిలో ఇప్పటికీ 42.35 హెక్టార్లకు సంబంధించిన భూమికి రూ. 69.80 కోట్ల పరిహారం డబ్బులు విడుదల కాలేదు. కరీంనగర్ జిల్లా పరిధిలో 89.88 హెక్టార్లను సేకరించగా 51.46 హెక్టార్ల భూమికి సంబంధించిన పరిహారం డబ్బు పంపిణీ చేశారు. ఇంకా 38.43 హెక్టార్లకు సంబంధించిన రూ. 58 కోట్ల పరిహారం విడుదల కాలేదు.
రెండేళ్లలో వంతెన సిద్ధం... కానీ...
సిరిసిల్ల పట్టణాన్ని అనుకొని ఉన్న మానేరు నదిపై భారీ రైలు వంతెన నిర్మించాల్సి ఉంది. ఇటీవలే టెండర్లు పిలిచి నిర్మాణ సంస్థకు రైల్వే శాఖ ఆ బాధ్యత అప్పగించింది. త్వరలో పనులు మొదలు కానున్నాయి. నదీ గర్భంలో నిర్మించాల్సి ఉన్నందున వంతెన పనుల పూర్తికి రెండేళ్ల సమయం పట్టనుంది. ఈలోగా నదికి ఇరువైపులా రైల్వేలైన్ నిర్మాణ పనులు మొదలు పెడదామని రైల్వే అధికారులు భావించినా భూసేకరణలో జాప్యంతో ముందడుగు పడని పరిస్థితి నెలకొంది.
రూ.కోటి ఆపడంతో..
సిద్దిపేట–సిరిసిల్ల మధ్య భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. పరిహారం కూడా చెల్లించడంతో పనులు చేసేందుకు మార్గం దాదాపు సుగమమైంది. కానీ ఆ భూముల్లో చెట్లు, షెడ్లు, నీటి పైప్‌లైన్లు, బోరుబావులు, ఇతర చిన్నపాటి నిర్మాణాలకు సంబంధించి కేవలం రూ. కోటి మొత్తాన్ని అధికారులు చెల్లించకుండా ఆపేశారు. దీంతో ఆ మొత్తం ఇచ్చే వరకు పనులు చేయనీయబోమని రైతులు తేల్చిచెప్పారు. ఫలితంగా దాదాపు ఏడాదిగా అక్కడ పనులు జరగట్లేదు.
అత్యంత కీలక ప్రాజెక్టు...
కేవలం హైదరాబాద్–కరీంనగర్ మధ్య రైలు సేవలకే ఈ మా ర్గం పరిమితం కాదు. ఉత్తర, దక్షిణాదిని జోడించే గ్రాండ్ ట్రంక్ లైన్‌కు ఇదో ప్రత్యామ్నాయ మార్గంగా ఉండనుంది. గ్రాండ్ ట్రంక్ మార్గంలో భారీ వర్షాలకు రైల్వేలైన్ కొట్టుకుపోయినా లేక ఏదైనా ప్రమాదం జరిగి రైళ్లు ఆగిపోవాల్సి వచ్చినా మనోహరాబాద్–కొత్తపల్లి లైన్ అందుబాటులోకి వస్తే చాలా రైళ్లను దీని మీదుగా మళ్లించి గమ్యం చేర్చేందుకు వీలవుతుంది. గతేడాదితోపాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాజీపేట–ఖమ్మం మధ్య రెండుసార్లు ట్రాక్ కొట్టుకుపోవడంతో ఈ మార్గంలో మూడొంతుల రైళ్లను రద్దు చేయాల్సి వచ్చింది.
రైల్వే ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తాయి. భాగస్వామ్య ప్రాజెక్టుగా ఒప్పందం చేసుకున్నాక రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలి. కానీ ఈ ప్రాజెక్టు విషయంలో మీ ప్రభుత్వ తీరు సరిగ్గా లేదు. సహకారం అందించలేనప్పుడు స్టేట్õÙర్ ప్రాజెక్టుగా దీన్ని ఎందుకు అంగీకరించారు? ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకపోగా కనీసం భూసేకరణ పరిహారం కూడా ఇవ్వకపోతే ఎలా?
– పీఎంఓ ఆధ్వర్యంలోని ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ ఇటీవలి భేటీలో రాష్ట్ర అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలివి
ప్రాజెక్టు బకాయిల లెక్కలు ఇవీ..
⇒ మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రూ. 128 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఇందులో సిద్దిపేట జిల్లా పరిధిలో రూ. కోటితోపాటు సిరిసిల్ల జిల్లా పరిధిలో రూ. 69.80 కోట్లు, కరీంనగర్ జిల్లా పరిధిలో రూ. 58 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి.
⇒ ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం మూడో వంతు భరించాల్సి ఉంది.
⇒ రైల్వే శాఖ వాటా రూ. 1,853.80 కోట్లు
⇒ రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 926.93 కోట్లు.
⇒ రాష్ట్రం ఇప్పటివరకు రూ.415.73 కోట్లు చెల్లించగా మరో రూ. 511.20 కోట్లు చెల్లించాల్సి ఉంది.


