‘సిగాచి’ ఘటనపై అధికారి తీరును తప్పుబట్టిన హైకోర్టు
237 మంది సాక్షులను విచారించినా దర్యాప్తు కొలిక్కి రాలేదా?
ఘోర ఘటనకు కారణం, బాధ్యులెవరో ఇంకా గుర్తించలేదా?
డీఎస్పీ స్థాయి అధికారికి దర్యాప్తు అప్పగించడమేంటి?
పిల్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ప్రశ్నలు
తదుపరి విచారణ డిసెంబర్ 9కి వాయిదా.. హాజరుకావాలని ఐవోకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో జరిగిన భారీ ప్రమాదంపై ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 54 మంది మృతి చెందిన ఘటన దర్యాప్తుపై అధికారుల ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని ప్రశ్నించింది. దారుణ ఘటన జరిగి ఐదు నెలలు కావొస్తున్నా దర్యాప్తు ఏమీ తేల్చకపోవడాన్ని తప్పు బట్టింది. 237 మంది సాక్షులను విచారించినా ఎలాంటి పురోగతి లేకపోవడం సరికాదంది. ఘటనకు కారణాలేంటి, బాధ్యలెవరనేది గుర్తించకపోవడమేంటని అడిగింది.
ఇలాంటి ప్రమాదంపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా..ఒక డీఎస్పీని నియమిస్తారా అని ప్రశ్నించింది. తదుపరి విచారణ రోజున తమ ముందు హాజరై దర్యాప్తునకు సంబంధించిన వివరాలు అందజేయాలని దర్యాప్తును అధికారిని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది.
పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న సంభవించిన ఘోర పేలుడు ప్రమాదంలో 54 మంది మృతి చెందగా, 28 మంది గాయపడ్డారని, 8 మంది ఆచూకీ ఇంకా లభించాల్సి ఉందని హైదరాబాద్ స్నేహపురి కాలనీకి చెందిన రిటైర్డ్ సైంటిస్ట్ కలపాల బాబురావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం విదితమే. ఫ్యాక్టరీలో భద్రతా నిబంధనలు లేకపోవడం, బాధిత కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతోందన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.
పరిశ్రమ సిబ్బందిని ఎందుకు విచారించలేదు
పిటిషనర్ తరఫున న్యాయవాది వసుధ నాగరాజ్ వాదనలు వినిపిస్తూ.. ఘటన జరిగి నాలుగు నెలలు కావొస్తున్నా దర్యాప్తు మందకొడిగా సాగుతోందన్నారు. పరిహారం పంపిణీ పూర్తి స్థాయిలో జరగలేదని, బాధ్యులైన వారిని అరెస్టు చేయలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిపుణుల కమిటీ నివేదికను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని దర్యాప్తు సంస్థకు ఇటీవలే అందజేశామన్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
సిగాచి పరిశ్రమ తరఫు హాజరైన న్యాయవాది కౌంటర్ దాఖలుకు రెండు వారాలు సమయం కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘మరణించిన, గాయపడిన కార్మికుల కుటుంబాలకు ‘సిగాచి’ఇచ్చిన హామీ మేరకు పరిహారం చెల్లించే చర్యలు చేపట్టాలని గత విచారణ సందర్భంగా ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాం. ఆ మేరకు మరణించిన, గాయపడిన కార్మికులతో పాటు కనిపించకుండా పోయిన వారికి చెల్లించిన పరిహారం వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరఫున ఏఏజీ న్యాయస్థానానికి సమరి్పంచారు. దర్యాప్తులో భాగంగా 237 మంది సాక్షులను అధికారులు విచారించారని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఘటనపై పూర్తి చార్జిïÙట్ దాఖలు చేయడానికి మరో 15 మంది సాక్షులను విచారించాల్సి ఉందన్నారు.
సాక్షుల వివరాలను పరిశీలిస్తే మరణించిన, గాయపడిన కార్మికుల బంధువులు, కొందరు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించినట్టు తెలుస్తుంది. పరిశ్రమ యాజమాన్యాన్ని, ఉద్యోగులను విచారించినట్లు పేర్కొనలేదు’అని అభిప్రాయపడింది. దర్యాప్తుకు సంబంధించిన రికార్డులు, కేసు డైరీ లాంటి వివరాలతో దర్యాప్తు అధికారి తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు పరిశ్రమకు రెండు వారాలు సమయానికి అనుమతించింది. తదుపరి విచారణ డిసెంబర్ 9న మధ్యాహ్నం 2.15కు వాయిదా వేసింది.


