అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లు అద్భుతాలు సృష్టిస్తున్నాయి | Startups in space sector are creating wonders says PM Narendra Modi | Sakshi
Sakshi News home page

అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లు అద్భుతాలు సృష్టిస్తున్నాయి

Nov 28 2025 1:35 AM | Updated on Nov 28 2025 1:56 AM

Startups in space sector are creating wonders says PM Narendra Modi

ఇతర దేశాల జెన్‌జీ తరానికి ఆదర్శంగా భారత యువత: ప్రధాని మోదీ

అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లు అద్భుతాలు సృష్టిస్తున్నాయన్న ప్రధాని

త్వరలో అణుశక్తి రంగంలోనూ ప్రైవేట్‌ సంస్థలకు అవకాశం కల్పిస్తామని వెల్లడి

శంషాబాద్‌లో స్కైరూట్‌ ఆఫీస్‌ ‘ఇన్ఫినిటీ క్యాంపస్‌’ ప్రారంభించిన ప్రధాని

స్కైరూట్‌ మొట్టమొదటి ఆర్బిటల్‌ వెహికల్‌ ‘విక్రమ్‌–1’ఆవిష్కరణ

సాక్షి, హైదరాబాద్‌: సృజనాత్మక ఆవిష్కరణలతో దూసుకెళుతున్న భారత దేశ యువత ఇతర దేశాల జెన్‌జీ తరానికి కూడా ఆదర్శంగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. దేశం ఈ రోజు అంతరిక్ష రంగంలో ఒక అపూర్వ ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిందని, విప్లవాత్మక విధానపరమైన మార్పుల ప్రభావంతో ప్రైవేట్‌ సంస్థలు ఈ రంగంలో దూసుకెళుతున్నాయని చెప్పారు. ఉపగ్రహ ప్రయోగాల విషయంలో దేశం అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి చేరుకుంటుందని, ఈ శతాబ్దం జెన్‌జీదేనని అన్నారు. 

దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్‌ రాకెట్‌ తయారీ సంస్థ ‘స్కై రూట్‌’శంషాబాద్‌లో నిర్మించిన భారీ కార్యాలయం ‘ఇన్ఫినిటీ క్యాంపస్‌’ను ప్రధాని గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. సుమారు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కార్యాలయంలోనే స్కైరూట్‌ తన మొట్టమొదటి ఆర్బిటల్‌ వెహికల్‌ ‘విక్రమ్‌–1’ను తయారు చేసింది. ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా విక్రమ్‌–1ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. 

దేశ ప్రయోజనాలకు యువత పెద్దపీట 
‘సై్కరూట్‌ కంపెనీ కార్యాలయం ‘ఇన్ఫినిటీ క్యాంపస్‌’దేశ యువశక్తికి, కొత్త ఆలోచనలకు, సృజనాత్మకతకు ప్రతీకగా నిలుస్తోంది. యువతరం రిస్క్‌ తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. సృజనాత్మకంగా ఆలోచిస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాణిస్తోంది. అంతరిక్ష రంగమూ దీనికి భిన్నమేమీ కాదు. ఇద్దరు, ముగ్గురు జెన్‌–జీలతో మొదలైన స్టార్టప్‌లు చాలా తక్కువ వనరులతోనే అద్భుతాలు సృష్టిస్తున్నాయి. 


స్కైరూట్‌ సంస్థ వ్యవస్థాపకులు పవన్‌కుమార్‌ చందన, నాగ భరత్‌ డాకాలు దేశ యువతకు స్ఫూర్తినిస్తున్నారు. జెన్‌–జీ ఇంజినీర్లు, డిజైనర్లు, కోడర్లు, సైంటిస్ట్‌లు రాకెట్ల చోదక వ్యవస్థలు మొదలుకొని కాంపోజిట్‌ మెటీరియల్స్, ఉపగ్రహ వ్యవస్థలు, రాకెట్లకు సంబంధించిన కొత్త కొత్త టెక్నాలజీలను ఆవిష్కరిస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఇలాంటివి కనీసం ఊహకు కూడా అందేవి కాదు. అందుకే 21వ శతాబ్దం దేశ జెన్‌–జీదేనని విశ్వసిస్తున్నా..’అని ప్రధాని చెప్పారు.
  
అణుశక్తి రంగమూ ప్రైవేటీకరణ.. 
‘భారత అంతరిక్ష రంగ ప్రస్థానం చాలా చిన్న స్థాయిలో మొదలైంది. సైకిళ్లపై రాకెట్‌ విడిభాగాలను మోసుకెళ్లే స్థితి నుంచి ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన లాంచ్‌ వెహికల్‌ను తయారు చేయగల స్థాయికి చేరగలిగాం. ఈ ప్రస్థానం పరిమితమైన వనరులతోనే మొదలైనప్పటికీ వృద్ధి మాత్రం దేశ శాస్త్రవేత్తల సంకల్ప బలానికి నిదర్శనంగా నిలిచింది. గడచిన దశాబ్ద కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అంతరిక్ష రంగంలోనే 300కు పైగా స్టార్టప్‌లు వెలిశాయి. 

సమాచార, వాతావరణ అంచనాలు, వ్యవసాయం, అర్బన్‌ ప్లానింగ్‌లతో పాటు దేశ భద్రతలోనూ అంతరిక్ష రంగం విస్తృత వినియోగంలోకి వచ్చింది. దేశీ అంతరిక్ష రంగంపై పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ కంపెనీలను అనుమతించడం ద్వారా సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని సమీప భవిష్యత్తులో అణుశక్తి రంగాన్ని కూడా ప్రైవెటీకరణ చేసే దిశగా అడుగులేస్తున్నాం..’అని మోదీ వెల్లడించారు. 

గ్లోబల్‌ స్పేస్‌ పవర్‌గా భారత్‌: కిషన్‌రెడ్డి 
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశం గ్లోబల్‌ స్పేస్‌ పవర్‌గా ఎదిగిందని, 400కు పైగా ప్రైవేటు స్టార్టప్స్, 2 వేలకు పైగా ఎంఎస్‌ఎంఈలు, 50 పరిశోధనా కేంద్రాలు స్పేస్‌ రంగానికి ఊతమిస్తున్నాయని చెప్పారు. ఇవాళ రూ.70 వేల కోట్ల విలువైన భారత స్పేస్‌ ఎకానమీ.. 2033 నాటికి రూ.4 లక్షల కోట్లకు చేరుకుంటుందని పేర్కొన్నారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ ఏరో స్పేస్‌ తయారీ రంగంలో పెట్టుబడులకు భారీగా ముందుకు వస్తున్నారని, 2020లో ప్రధాని మోదీ సంస్కరణలు తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ,4500 కోట్ల మేర ప్రైవేటు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.  

రెండు నెలల్లో విక్రమ్‌–1 ప్రయోగం 
స్కైరూట్‌ సొంతంగా తయారు చేసిన ఆర్బిటల్‌ వెహికల్‌ ‘విక్రమ్‌–1’ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సాయంతో రెండు నెలల్లో ప్రయోగించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన పవన్‌కుమార్‌ చందన తెలిపారు. 2018లో దేశంలోనే మొట్టమొదటి సబ్‌ ఆర్బిటల్‌ రాకెట్‌ ‘విక్రమ్‌–ఎస్‌’ప్రయోగం విజయవంతం కావడాన్ని ప్రస్తావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగంలో ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యానికి ఓకే చెప్పడం వల్లనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. స్కైరూట్‌ సహ వ్యవస్థాపకుడు నాగ భరత్‌ డాకా, వ్యోమగామి శుభాంశు శుక్లా, ఇన్‌స్పేస్‌ చైర్మన్‌ పవన్‌ గోయెంకా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement