సింగిల్ జడ్జి తీర్పును నిలిపివేసిన సీజే ధర్మాసనం
తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా
అప్పటివరకు ఉత్తర్వులు అమలులో ఉంటాయని స్పష్టం
గ్రూప్–2పై సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసిన ఉద్యోగులు
విచారణ చేపట్టి.. మధ్యంతర ఆదేశాలిచ్చిన ద్విసభ్య ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 ద్వారా ఎంపికై వివిధ పోస్టుల్లో 2019లో నియామకమైన ఉద్యోగులకు హైకోర్టు సీజే ధర్మాసనంలో భారీ ఊరట లభించింది. నియామకాలను రద్దు చేస్తూ ఈ నెల 18న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. గ్రూప్–2 కింద 1,032 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీజీపీఎస్సీ) 2015లో నోటిఫికేషన్ జారీ చేసింది. తర్వాత 2016లో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయగా, నవంబర్‌లో పరీక్షలు జరిగాయి. కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారంటూ సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చెన్నాయపాలేనికి చెందిన భూక్యా ప్రియాంకతోపాటు మరికొందరు హైకోర్టులో 2019లో ఆరు రిట్ పిటిషన్‌లు దాఖలు చేశారు.
విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. గ్రూప్–2 నియామకాలను రద్దు చేస్తూ ఈ నెల 18న తీర్పునిచ్చారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా కమిషన్ నియమకాలు చేపట్టడాన్ని తప్పుబట్టారు. డబుల్ బబ్లింగ్, వైట్‌నర్, ఎరైజర్ వినియోగించిన జవాబు పత్రాల మూల్యాంకనం చెల్లదని స్పష్టం చేశారు. 2019లో వెల్లడించిన ఫలితాలు చట్టవిరుద్ధమంటూ రద్దు చేశారు. హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం, సాంకేతిక కమిటీ సిఫార్సులను పాటిస్తూ తిరిగి మూల్యాంకనం చేయాలని కమిషన్‌ను ఆదేశించారు. ఈ ప్రక్రియంతా 8 వారాల్లో పూర్తి చేయాలని తేల్చి చెప్పారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డిప్యూటీ తహసీల్దార్ క్రాంతికుమార్‌తోపాటు మరొకరు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.
అందరి వాదనలూ వింటాం..
ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అప్పీలెంట్ల తరఫున సీనియర్ న్యాయ వాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. కొందరు అభ్యర్థులు తమ ఓఎంఆర్ షీట్ల పార్ట్–బీలో స్క్రాచింగ్, ట్యాంపరింగ్, వైట్‌నర్, ఎరైజర్ వినియోగించినట్టు తేలింద ని చెబుతూ నియామకాలను రద్దు చేయడం సరికాదన్నారు. అలా ఉల్లంఘనకు పాల్పడిన వారి పత్రాలను తొలగించినట్టు కమిషన్ పేర్కొన్నా, సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాది సురేందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఓఎంఆర్ షీట్లలో వైట్‌నర్, ఎరైజర్ వినియోగించిన అభ్యర్థుల పత్రాలను మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమన్నారు. హైకోర్టు తీర్పునకు, సాంకేతిక కమిటీ సూచనలకు విరుద్ధంగా ట్యాంపరింగ్ జరిగిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారని చెప్పారు. కీలకమైన గ్రూప్–2 అభ్యర్థుల ఎంపిక లోపభూయిష్టంగా జరిగినందునే సింగిల్ జడ్జి పున: మూల్యాంకనానికి ఆదేశించారని నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. అప్పీలెంట్ల వాదనలో ప్రాథమిక ఆధారాలున్నాయని భావిస్తూ సింగిల్ జడ్జి ఆదేశాలను నిలిపివేస్తూ, విచారణ వాయిదా వేసింది. ఇరుపక్షాల న్యాయవాదులతోపాటు టీజీపీఎస్సీ వాదనలు వింటామని స్పష్టం చేసింది.


