2034కి 1 ట్రిలియన్, 2047కి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు స్పష్టమైన రోడ్‌మ్యాప్ కన్పించాలి
చైనా, జపాన్‌లతో పోటీ పడే లక్ష్యాలతో ముందుకుపోవాలి
క్యూర్, ప్యూర్, రేర్.. మూడు రీజియన్లుగా రాష్ట్ర ఆర్థ్ధికాభివృద్ధి
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025పై సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్–2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్..పాలసీ డాక్యుమెంటులో కనిపించాలన్నారు. అభివృద్ధిలో పక్క రాష్ట్రాలతో కాదు.. చైనా, జపాన్‌లతో పోటీ పడే లక్ష్యాలతో ముందుకుపోవాలని కోరారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్) అనే మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ (విధానపరంగా క్రియారాహిత్యం) ఉండదు అని చాటి చెప్పేలా డాక్యుమెంట్ ఉండాలన్నారు. గురువారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025పై మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మహ్మద్ అజహరుద్దీన్, సీతక్కతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం
సీఎంఓ దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది.
విజన్ డాక్యుమెంట్ ఒక దార్శనిక పత్రం
‘రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, యువతకు మెరుగైన ఉపాధి లక్ష్యంగా ప్రభుత్వం విజన్–2047కు సిద్ధమౌతోంది. అందరికీ సమాన అవకాశాలు, సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా వచ్చే 22 ఏళ్లకి భవిష్యత్ కార్యాచరణ ఉండబోతోంది. ఫ్యూచర్ సిటీతో రాష్ట్ర భవిష్యత్‌ను కొత్త పుంతలు తొక్కించే దిశగా అడుగులు వేస్తోంది. అందుకే డిసెంబర్ 8, 9న నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌ను ఫోర్త్ సిటీలో ప్లాన్ చేసింది. విభిన్న రంగాల్లో పారిశ్రామిక అభివృద్ధికి గల అవకాశాలను వివరించటంతో పాటు వివిధ రూపాల్లో అందించే ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించనుంది. విజన్ 2047 దార్శనిక భవిష్యత్ పత్రం. రాష్ట్ర భవిష్యత్తుకు సమగ్ర మార్గరూపం. సమాన వృద్ధి, మహిళా సాధికారత, యువశక్తి,.. ఈ మూడు ప్రధాన రంగాలపై రాష్ట్ర అభివృద్ధి వ్యూహాన్ని ప్రభుత్వం ప్లాన్ చేసింది. తెలంగాణను దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడం ఈ విజన్ డాక్యుమెంట్ లక్ష్యం..’ అని సీఎంఓ పేర్కొంది.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా..
‘రాష్ట్రంలో ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి తెలియజేయాలని ప్రజా ప్రభుత్వం సంకల్పించింది. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, క్వాంటమ్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పర్యాటకం, ఎగుమతులు వంటి రంగాలు రానున్న రెండు దశాబ్దాల్లో ఆర్థికాభివృద్ధికి కీలకమైనవని ప్రభుత్వం భావిస్తోంది. పారదర్శక పాలన, సులభ అనుమతులు (ఈఓడీబీ), గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు రాష్ట్రాన్ని పెట్టుబడిదారుల మొదటి గమ్యస్థానంగా నిలబెట్టనున్నాయి. ఈ బలాలే పునాదిగా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే విధంగా విజన్ డాక్యుమెంట్ ఉండబోతోంది. గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతం చేసేందుకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా వ్యవసాయ కార్యాచరణ కూడా డాక్యుమెంట్‌లో భాగమౌతోంది. నెట్–జీరో తెలంగాణను అవిష్కరించనుంది. బ్లూ అండ్ గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా మూసీ పునరుజ్జీవం, దీనిలో భాగంగా 2,959 చెరువులు, పార్కులు, అటవీ ప్రాంతాలను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామాల్లో స్వచ్చమైన తాగునీరు, పరిశుభ్రమైన రోడ్లు, సౌర విద్యుత్ వెలుగులతో విలేజ్ 2.0 లక్ష్యంతో పనిచేయనుంది..’ అని సీఎంఓ వివరించింది.
హై–స్పీడ్ మొబిలిటీ కారిడార్లు
‘ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో తెలంగాణకు మణిహారంలా రీజనల్ రింగ్ రోడ్డును అభివృద్ధి చేస్తుంది. హై–స్పీడ్ మొబిలిటీ కారిడార్లను నిర్మించనుంది. రీజనల్ రింగ్ రైల్, 4 ఇండస్ట్రియల్ కారిడార్లు, 11 రేడియల్ రోడ్లను నిర్మించనుంది. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు అత్యాధునిక హైవేను నిర్మించి సీపోర్టుకు అనుసంధానం చేయనుంది. ఏటా 2 లక్షల తెలంగాణ యువతకు, లక్షమంది నిపుణులకు విదేశీ ఉపాధికి అవసరమైన నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కేంద్రాలుగా క్రీడా గ్రామాలు నిర్మితమవుతాయి. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించటమే లక్ష్యంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, నైట్ ఎకానమీ సిటీగా హైదరాబాద్ ఇమేజ్‌ను క్రియేట్ చేయటం, బతుకమ్మ, బోనాలు, డెక్కన్ క్రాఫ్టŠస్ గ్లోబల్ పండుగలతో బ్రాండ్ తెలంగాణను విశ్వవ్యాప్తం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది..’ అని సీఎంఓ తెలిపింది.


