దేశ పౌరులంతా రాజ్యాంగ విధులు నిర్వర్తించాలి
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడం మనందరి బాధ్యత
ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి
దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లేఖ
న్యూఢిల్లీ: దేశ పౌరులంతా రాజ్యాంగం నిర్దేశించిన విధులను నిర్వర్తించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బలమైన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విధులే పునాది అని ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన బుధవారం దేశ ప్రజలకు ఈ మేరకు లేఖ రాశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఇందుకోసం ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు.
ఇకపై ప్రతిఏటా పాఠశాలలు, కళాశాలల్లో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవాలని, 18 ఏళ్లకు తొలిసారి ఓటు హక్కు పొందినవారిని సత్కరించుకోవాలని కోరారు. విధులు నిర్వర్తిస్తేనే హక్కులు లభిస్తాయని జాతిపిత మహాత్మాగాంధీ బోధించినట్లు ప్రధాని మోదీ గుర్తుచేశారు. సామాజిక, ఆర్థిక ప్రగతికి విధుల నిర్వహణ అత్యావశ్యకమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రచనలో బాబూ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌తోపాటు మరికొందరు మహనీయులు పోషించిన పాత్రను గుర్తుచేశారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో వల్లభ్‌భాయ్ పటేల్, బిర్సా ముండా, మహాత్మాగాం«దీల నాయకత్వాన్ని, త్యాగాలను శ్లాఘించారు.
దేశానికి కృతజ్ఞత చూపాల్సిందే..
‘‘రాజ్యాంగ విధులను అందరూ సక్రమంగా నిర్వర్తిస్తేనే మన ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏలో ఈ అంశాన్ని పొందుపర్చారు. ఉమ్మడిగా సామాజిక, ఆర్థిక ప్రగతిని సాధించడానికి రాజ్యాంగ విధులే మనకు దారి చూపుతాయి. ‘వికసిత్ భారత్’ దిశగా మన ప్రయాణం సఫలం కావాలంటే రాజ్యాంగ విధులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాలే రాబోయే తరాల జీవితాలను ప్రభావితం చేస్తాయి. మన దేశం మనకు ఎంతో ఇచ్చింది. కృతజ్ఞతలు చూపాలన్న భావన మనసులో నాటుకోవాలి. అప్పుడు రాజ్యాంగ విధుల నిర్వహణ మన జీవితంలో భాగమవుతుంది. ప్రతి పని పూర్తిసామర్థ్యం, అంకితభావంతో పూర్తిచేయాలి. మనం చేసే ప్రతి పని దేశానికి సంబంధించిన లక్ష్యాలను, ప్రయోజనాలను నెరవేర్చేలా ఉండాలి. మహోన్నతమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుల స్వప్నాలను సాకారం చేయడం మనందరి బాధ్యత.
జమ్మూకశ్మీర్ ప్రజలకు రాజ్యాంగ హక్కులు
సర్దార్ పటేల్ దార్శనికత, నాయకత్వ పటిమతో దేశం ఐక్యంగా మారింది. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35(ఎ)ను రద్దు చేయడానికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలవుతుండడం సంతోషంగా ఉంది. జమ్మూకశ్మీర్ ప్రజలకు రాజ్యాంగ హక్కులు లభిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, అణగారిన వర్గాల ప్రజలకు మేలు జరుగుతోంది. గిరిజనులకు న్యాయం, గౌరవం, సాధికారత చేకూర్చడంలో భగవాన్ బిర్సా ముండా జీవితం మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. రాజ్యాంగం దేశ ప్రజలకు ఓటు హక్కును ఇచ్చింది. స్థానిక, రాష్ట్ర జాతీయ ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయాలి. రాజ్యాంగం కట్టబెట్టిన హక్కును వాడుకోవడం పౌరులుగా మన బాధ్యత.
అది ముమ్మాటికీ రాజ్యాంగం ఘనతే
రాజ్యాంగం గొప్పతనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆర్థికంగా వెనకబడిన కుటుంబంలో జన్మించిన నేను ప్రధానమంత్రిగా ఉన్నత స్థానానికి చేరుకున్నానంటే అది ముమ్మాటికీ రాజ్యాంగం ఘనతే. రాజ్యాంగం కల్పించిన అవకాశంతోనే గత 24 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాజీవితంలో కొనసాగుతున్నా. 2014లో ప్రధానమంత్రిగా తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టినప్పుడు అక్కడి మెట్లకు తలవంచి నమస్కరించడం, మెట్లను చేతితో తాకడం ఇప్పటికీ గుర్తుంది. 2019లో ఎన్నికల ఫలితాల తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాజ్యాంగానికి నమస్కరించి, తలపై మోశాను. మన రాజ్యాంగం నాలాంటి ఎంతోమంది నాయకులను ఈ దేశానికి ఇచ్చింది. రాజ్యాంగాన్ని బలోపేతం చేసే అవకాశాన్ని రాజ్యాంగమే కల్పించింది’’ అని మోదీ లేఖలో పేర్కొన్నారు.


