అతి త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంలో కీలక మార్పునకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న నితిన్ నబీన్‌ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబో తున్న ట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఈ నెల 19 లేదా 20వ తేదీన ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వం, ఆర్‌ఎస్‌ఎస్ మధ్య జరుగుతున్న అంతర్గత చర్చలు తుది దశకు చేరుకున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే నూతన జాతీయ అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటించేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
సంఘ్ గ్రీన్ సిగ్నల్
జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబీన్ పేరును ఖరారు చేయడంలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన సమన్వయ సమావేశాల్లో నబీన్ నాయకత్వ సామర్థ్యాలపై సంఘ్ సానుకూల అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలన్న లక్ష్య సాధనకు నబీన్ సరైన ఎంపికగా ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలు భావిస్తున్నారు.
ఎంపిక వెనుక వ్యూహం...
నితిన్ నబీన్ గత నెలలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ హోదాలో తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్రాల నేతలతో సమన్వయం, యువతలో పెరుగుతున్న ఆదరణే ఆయనకు సానుకూల అంశాలుగా మారినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలున్నాయి. ఇంకా కొన్ని రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షులను ఎంపిక చేయాల్సి ఉంది. అలాగే వివిధ రాష్ట్రాల ఎన్నికల ఇన్‌చార్జీల నియామకాలకు మార్గం సుగమం చేయడం, 2029 లోక్‌సభ ఎన్నికల దిశగా పార్టీని సన్నద్ధం చేయాలన్నదే అధిష్టానం వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందే పార్టీకి స్పష్టమైన దిశను నిర్దేశించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డాకు పార్టీలో లేదా ప్రభుత్వంలో మరిన్ని కీలక బాధ్యతలు అప్పగిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు.


