లోక్‌సభలో ఎన్నికల్లో 45% ఖర్చు బీజేపీదే  | BJP spent Rs 1,494 crore in 2024 polls | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో ఎన్నికల్లో 45% ఖర్చు బీజేపీదే 

Jun 21 2025 5:29 AM | Updated on Jun 21 2025 5:29 AM

BJP spent Rs 1,494 crore in 2024 polls

రూ.1,494 కోట్లు ఖర్చు పెట్టిన కాషాయం పార్టీ 

కాంగ్రెస్‌ వ్యయం రూ.620 కోట్లు: ఏడీఆర్‌ నివేదిక

న్యూఢిల్లీ:  గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ కలిపి చేసిన మొత్తం వ్యయంలో 45 శాతం వాటా భారతీయ జనతా పార్టీదేనని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) శుక్రవారం ఒక నివేదికలో వెల్లడించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ రూ.1,494 కోట్లు ఖర్చు చేసినట్లు తెలియజేసింది. విపక్ష కాంగ్రెస్‌ రూ.620 కోట్లు ఖర్చు పెట్టిందని, మొత్తం వ్యయంలో ఆ పార్టీ వాటా 18.5 శాతమని వివరించింది. 

మొత్తం 32 జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎన్నికల ఖర్చుల రికార్డులను ఏడీఆర్‌ విశ్లేషించింది. 2024లో మార్చి 16 నుంచి జూన్‌ 6 దాకా లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు సైతం జరిగాయి. ఈ ఎన్నికల కోసం 32 పార్టీలు రూ.3,352.81 కోట్లు ఖర్చు చేసినట్లు ఏడీఆర్‌ తెలియజేసింది. ఇందులో జాతీయ పార్టీల వాటా రూ.2,204 కోట్లు(65.75 కోట్లు) అని పేర్కొంది.

 విరాళాలు, నిధుల రూపంలో జాతీయ పార్టీలకు రూ.6,930.24 కోట్లు, ప్రాంతీయ పార్టీలకు రూ.515.32 కోట్లు అందినట్లు వివరించింది. అంటే మొత్తం నిధుల్లో జాతీయ పార్టీలకు 93.08 శాతం, ప్రాంతీయ పార్టీలకు 6.92 శాతం అందినట్లు స్పష్టమవుతోంది. ఏయే పార్టీలు ఎన్ని నిధులు ఖర్చు చేశాయన్నది ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన ‘వ్యయ నివేదికల’ఆధారంగా ఏడీఆర్‌ గుర్తించింది. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత 90 రోజుల్లోగా, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత 75 రోజుల్లోగా పార్టీలు వ్యయ నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది.

 కానీ, బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ చాలా ఆలస్యంగా ఈ నివేదికలు ఇచ్చినట్లు ఏడీఆర్‌ పేర్కొంది. పార్టీలు ఎన్నికల ప్రచారం కోసమే అత్యధిక నిధులు ఖర్చు చేసినట్లు తెలిపింది. అన్ని పార్టీలు ప్రచారం కోసం రూ.2,008 కోట్లు వెచ్చించినట్లు తేల్చింది. అంటే మొత్తం ఖర్చులో ఇది 53 శాతంగా తెలుస్తోంది. ఆ తర్వాత రవాణా కోసం రాజకీయ పార్టీలు ఎక్కువ ఖర్చు పెట్టినట్లు వెల్లడించింది. ఎన్నికల సంఘం గుర్తింపు పొందని 690 పార్టీలు కూడా గత ఏడాది ఎన్నికల్లో పోటీ చేసినట్లు ఏడీఆర్‌ తెలియజేసింది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చేసే ఖర్చుపై నిఘా పెట్టడానికి ప్రత్యేకంగా పరిశీలకులను నియమించాలని ఎన్నికల సంఘానికి సూచించింది.  

Advertisement
 
Advertisement
Advertisement